అరుణిమ సిన్హా https://te.wikipedia.org/wiki/%E0%B0%85%E0%B0%B0%E0%B1%81%E0%B0%A3%E0%B0%BF%E0%B0%AE_%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B9%E0%B0%BE అరుణిమ సిన్హా ప్రపంచంలోని అత్యున్నత శిఖరం ఎవరెస్టును అధిరోహించిన మొదటి దివ్యాంగ మహిళ. ఆమె దుండగుల దురాగతంలో తన కుడికాలు పోగొట్టుకున్న జాతీయస్థాయి వాలీబాల్‌ మాజీ క్రీడాకారిణి. మౌంట్‌ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన భారతదేశపు మొట్టమొదటి దివ్యాంగ వ్యక్తిగా గుర్తింపు పొందింది. ఆమె తన 25వ యేట ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. ఆమె ఉత్తర ప్రదేస్ లోని అంబేద్కర్ జిల్లాలోని గ్రామంలో 1988 జూలై 20న జన్మించింది. ఆమె తండ్రి సైనికోద్యోగి, తల్లి వైద్యశాఖలో ఉద్యోగి. ఆమెకు ఒక అన్నయ్య, చెల్లెలు ఉన్నారు. ఆమెకు బాల్యం నుండి వాలీ ‌బాల్ ఆడడం యిష్టం. ఆమెను తల్లిదండ్రులు, పాఠశాలలోని వ్యాయామోపాధ్యాయుడు ప్రోత్సహించారు. కొంత కాలానికి ఆమె వాలీబాల్, ఫుట్‌బాల్ ఆటల్లో గుర్తింపు పొందింది. అనేక విజయాలు సాధించింది. అనేక క్రీడా పతకాలు సాధించింది. ఆమెకు జాతీయ జట్టులో స్థానం లభించింది. ఆటలతొ పాటు చదువుకుంటే క్రీడల కోటాలో ఉద్యోగం సంపాదించవచ్చని ఆమె క్రీడలలో పాల్గొంటూనే ఎం.ఎ పూర్తి చేసింది. తరువాత ఎల్.ఎల్.బి చేసింది. ఎల్.ఎల్.బి చేస్తున్న రోజుల్లో ఆమె ఆర్మీలో ఉద్యోగ నియామకం కొరకు దరఖాస్తు చేసింది. కానీ దరఖాస్తులో పుట్టినతేదీ తప్పుగా ఉన్నట్లు తరువాత గుర్తించింది. బరేలీ లోని ఆర్మీ రిక్రూట్ మెంట్ అధికారులు సవరిస్తారని ఇంట్లో వాళ్ళు సలహా ఇవ్వడంలో 2011, ఏప్రిల్ 11 న లక్నోకు రైలులో బయలుదేరింది. ఆమె 2011 ఏప్రిల్ 11న లక్నో నుంచి ఢిల్లీకి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ లో జనరల్‌ కంపార్టుమెంట్‌లో బయలుదేరింది. బరేలీ సమీపంలో ముగ్గురు దొంగలు ఆమె మెడలోని బంగారు గొలుసు లాగేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో దుండగలు రైలు నుంచి ఆమెను కిందకు తోసేశారు. ఆమె ప్రక్క ట్రాక్ పై పడింది. ఆ సమయంలో ట్రాక్ పై రైలు వస్తోందని ఆమె గమనించి లేచే లోపే ఆమె కుడికాలిపై నుండి రైలు దూసుకు పోయింది. సమీప గ్రామస్థులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆ ప్రమాదంలో కుడి కాలు తొడ ఎముక వరకు తీవ్రంగా దెబ్బతినడంతో వైద్యులు మోకాలు కింది భాగాన్ని తొలగించారు. ఆమెకు అప్పటి కేంద్ర యువజన, క్రీడాశాఖా మంత్రి అజయ్ మకేన్ 2 లక్షల నష్ట పరిహారం, ఉద్యోగం ప్రకటించాడు. భారతీయ రైల్వే సంస్థ ఆమెకు ఉద్యోగం యిచ్చుటకు అంగీకరించింది. ఆమె 2011 ఏప్రిల్ 18న ఆల్ ఇండ్యా మెడికల్ సైన్సెస్ లోచేరింది. ఆమె పూర్తిగా కోలుకోవడానిని నాలుగు నెలలు పట్టింది. మొదట పోలీసు శాఖ ఈ ప్రమాదాన్ని ఆత్మహత్యగా అనుమానించింది. ఆమె రైల్వే కాసింగ్ వద్ద ఆత్మహత్యా ప్రయత్నం చేసుకునే ప్రయత్నం చేసి ఉండవచ్చని భావించింది. కానీ ఆమె ఆ వాదనలను ఖండించింది. ఈ సంఘటన తరువాత ప్రతిఒక్కరూ ఆమెపై సానుభూతి చూపడం మొదలుపెట్టారు. ఇది భరించలేని ఆమె ఏదో ఒక సాహసకార్యం చేయాలనే ఆ క్షణమే నిర్ణయించుకుంది. ఆమె ఎవరెస్టు శిఖరం అధిరోహించాలని నిర్ణయించుకుంది. అ నిర్ణయానికి ఆమె అన్నయ్యతో పాటు కోచ్ కూడా సహకరించారు. అనంతరం ఆమె టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్‌లో సభ్యురాలిగా చేరి శిక్షణ తీసుకుంది. ఉత్తర కాశిలో జరిగిన శిబిరంలో ఎవరెస్టును అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రి పాల్ వద్ద అరుణిమ మెళకువలు తెలుసుకుంది. 2013 మే 21 న ఆమె ఎవరెస్టు శిఖరాన్ని ఉదయం 10.55 కి చేరుకుంది. ఇది Eco Everest Expedition లో భాగంగా టాటా గ్రూప్ సంస్థలు స్పాన్సర్ చేసిన కార్యక్రమం. ఆమె భారత క్రికెట్ క్రీడాకారుడు యువరాజ్ సింగ్ను ఆదర్శంగా తీసుకున్నట్లు తెలిపింది. అతనున తనకు వచ్చిన కేన్సర్ వ్యాధిని లెక్కచేయకుండా "ఏదో ఒకటి చేయాలి" అనే తలంపుతో విజయాలను సాధించాడు. అప్పటి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆమెను సన్మానించాడు. లక్నో లోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకమంలో ఆమెకు 25 లక్షల కు చెండు చెక్కులను అందజేసాడు. ఇందులో రాష్ట్రప్రభుత్వం తరపున 20 లక్షలు, సమాజ్‌వాదీ పార్టీ తరపున 5 లక్షల చెక్కులు ఉన్నాయి. సిన్హా తన కృషి, సంకల్పంతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఆమె సాధించినందుకు భారత క్రీడా మంత్రి జితేంద్ర సింగ్ ఆమెను అభినందించాడు. అరుణిమా సిన్హా ఇప్పుడు సాంఘిక సంక్షేమం కోసం తన జీవితం అంకితం చేయాలని నిశ్చయించుకొని పేద, విభిన్న సామర్థ్యం ఉన్నవారికి ఉచిత స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించాలనుకుంటుంది. అవార్డులు, సెమినార్ల ద్వారా ఆమెకు లభించే అన్ని ఆర్థిక సహాయాలను ఆమె అదే కారణంతో విరాళంగా ఇస్తోంది. ఈ అకాడమీకి "షాహీద్ చంద్ర శేఖర్ వికలాంగ్ ఖేల్ అకాడమీ" అని పేరు పెట్టారు. ఆమె "బోర్న్ అగైన్ ఆన్ ద మౌంటెన్" అనే పుస్తకాన్ని ఆమె రాసింది. దీనిని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014 డిసెంబర్‌లో ప్రారంభించడు. ఆమెకు 2015 లో భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ లభించింది. అర్జున్ అవార్డుతో సమానమైన భారతదేశంలో ఆమెకు టెన్జింగ్ నార్గే అత్యధిక పర్వతారోహణ అవార్డు లభించింది. ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన తరువాత ఆమె ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తైన శిఖరాలను అధిరోహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆమె 2014 నాటికి ఆసియా, యూరప్, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో ఆరు శిఖరాలను అధిరోహించింది. ఆమె 5,642 మీ (18,510 అడుగులు) ఎత్తు గల రష్యాకు చెందిన మౌంట్ ఎల్బర్స్ (యూరప్) శిఖరాన్ని , టాంజానియా (ఆఫ్రికా) లోని 5,895 మీ (19,341 అడుగులు) ఎత్తు గల కిలిమంజారో పర్వతాన్ని, అధిరోహించింది. 2019 జనవరి 4 న, ఆమె అంటార్కిటికాలో ఏడవ శిఖరాన్ని అధిరోహించింది. విన్సన్ పర్వతాన్ని అధిరోహించిన ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా దివ్యాంగ మహిళగా చరిత్ర సృష్టించింది.