అగ్నిపథ్_పథకం https://te.wikipedia.org/wiki/అగ్నిపథ్_పథకం అగ్నిపథ్ పథకం భారత ప్రభుత్వం మూడు సాయుధ దళాలలో ప్రవేశపెట్టిన నియామక వ్యవస్థ. ఈ విధానంలో నియమితులైన సిబ్బందిని అగ్నివీర్లు అంటారు. 2022 జూన్‌ 14 న భారత ప్రభుత్వం ఆమోదించిన ఈ పథకాన్ని 2022 సెప్టెంబరు నుండి అమలు చేయాలని తలపెట్టారు. ఈ పథకం ద్వారా త్రివిధ దళాల లోనికీ, ఆఫీసర్ల కంటే దిగువ స్థాయి సైనికుల నియామకాలు జరుపుతారు. సైనిక బలగాల్లోకి నియమాకాలు జరిపే ఏకైక పద్ధతి ఇదే. నియమితుల ఉద్యోగ కాలం 4 సంవత్సరాలు. ఈ పథకం ద్వారా నియమితులైనవారిని అగ్నివీరులు అంటారు. ఈ అగ్నివీర్ అనేది కొత్త సైనిక ర్యాంకు. ఈ పథకం ద్వారా గతంలో ఉన్నట్లుగా దీర్ఘ కాలం పాటు పని చేసే పద్ధతి పోతుంది. ఉద్యోగం నుండి విరమించాక పింఛను రాదు. ప్రతిపక్షాలు ఈ పథకాన్ని విమర్శిస్తూ దానిలోని లోపాలను ఎత్తిచూపాయి. పార్లమెంటులో చర్చించేవరకు ఈ పథకాన్ని నిలిపివేయాలని కోరాయి. ఈ పథకంపై దేశంలో నిరసనలు చెలరేగాయి. హింస జరిగింది. 12 రైళ్ళను తగలబెట్టారు. అనేక రైళ్ళను మధ్య లోనే నిలిపివేయడం, రద్దు చెయ్యడం జరిగింది. అగ్నిపథ్ పథకం ప్రవేశపెట్టడానికి ముందు, సైనికులు జీవితకాల పెన్షన్‌తో 15+ సంవత్సరాలకు పైబడిన పదవీకాలంపై సాయుధ దళాలలో నియమించేవారు. రిటైరయ్యాక వీరికి జీవితాంతం పింఛను వచ్చేది. 2019 నుంచి మూడేళ్లపాటు సాయుధ బలగాల్లో రిక్రూట్‌మెంట్‌ జరగలేదు. దీని కారణం కోవిడ్-19 మహమ్మారిని భారత ప్రభుత్వం చెప్పింది. ఓవైపున ఏటా 50,000 నుండి 60,000 మంది సైనికులు పదవీ విరమణ చేస్తూనే ఉన్నారు. దీంతో మానవ వనరుల కొరత ఏర్పడి, సాయుధ దళాల కార్యాచరణ సామర్థ్యాలను ప్రభావితం చేయగల పరిస్థితికి దారితీసింది. 2020లో సాధారణ పౌరులను బలగాలలో నియమించుకునేందుకు 'టూర్ ఆఫ్ డ్యూటీ' అనే పథకాన్ని ప్రతిపాదించారు. దీనిద్వారా పౌరులు మూడు సంవత్సరాల స్వల్పకాలిక సేవలో చేరవచ్చు. ప్రతిపాదిత పథకాన్ని 100 మంది అధికారులు, 1000 మంది సైనికులతో ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని ప్రణాళిక చేసారు. భారతీయ రక్షణ దళాలు ఆఫీసరేతరులు లేదా నాన్ కమీషన్డ్ ఆఫీసర్ల ర్యాంక్‌లో సైనికులను నియమించుకోవడానికి అగ్నిపథ్‌ను ప్రవేశపెట్టారు. సుమారు 45,000 నుండి 50,000 మంది సభ్యులతో కూడిన శిక్షణ పొందిన రక్షణ సిబ్బందిని ఈ వ్యవస్థ క్రింద నియమిస్తారు. వీరిని అగ్నివీరులు అని అంటారు. అగ్నిపథ్ పథకాన్ని 2022 సెప్టెంబరు నుండి అమలు చేసే ఉద్దేశంతో, 2022 జూన్‌లో భారత ప్రభుత్వం ఆమోదించింది. 2022 జూన్ 14 న ఈ పథకం గురించి ప్రకటన చేసింది. ఈ పథకాన్ని 17.5 నుండి 21 సంవత్సరాల వయస్సు గల పురుషులు, మహిళలు ఇద్దరికీ ఉద్దేశించారు. ఈ పథకం ద్వారా భారత సైన్యం, నౌకాదళం, వాయుసేనల్లో సంవత్సరానికి రెండుసార్లు నిఅయామకాలు జరుగుతాయి. అగ్నిపథ్‌ ద్వారా ఆఫీసర్ కేడర్ కంటే దిగువన ఉన్న స్థానాలకు నియమకాలు జరుపుతారు. సైనికదళాల్లో చేరేందుకు అగ్నిపథ్ పథకం ఒక్కటే మార్గం. అగ్నివీరుల నియామకాలు నాలుగు సంవత్సరాల పనికాలనికి జరుగుతాయి. ఇందులో ఆరు నెలల పాటు శిక్షణ, 3.5 సంవత్సరాల పాటు మోహరింపు ఉంటుంది. సర్వీసు నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత సాయుధ దళాల్లో కొనసాగేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం వారికి ఉంటుంది. పదవీ విరమణ పొందనున్న ప్రతి బ్యాచ్ లోనూ ఉన్న మొత్తం సంఖ్యలో 25 శాతానికి మించకుండా శాశ్వత కేడర్‌కు ఎంపిక చేస్తారు. మిగతా వారు పదవీ విరమణ చేస్తారు. వారు పెన్షనుకు అర్హులు కారు. కానీ పదవీకాలం ముగిసే సమయానికి దాదాపు ₹11.71 లక్షల మొత్తం వారికి లభిస్తుంది. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం 45,000 నుండి 50,000 మంది కొత్త సిబ్బందిని నియమించాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. 2022 సెప్టెంబరులో ఈ పథకం ద్వారా 46,000 మంది యువకులను నియమించడానికి ప్లాన్ చేసారు. అగ్నిపథ్ పథకం అర్హతలు ఆఫీసర్ కేడర్ కంటే తక్కువ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌లు.17.5 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల వయస్సులో ఉన్నవారు.నియామకాలు ఏడాదికి రెండుసార్లు జరుగుతాయి.భారత సైన్యం, నావికాదళం, వాయుసేనలలో నియామకం జరగనుంది.మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.అయితే కోవిడ్ కారణంగా రెండేళ్ళ పాటు నియామకాలు చేపట్టనందున 2022 సంవత్సరానికి మాత్రం గరిష్ఠ వయోపరిమితిని 21 నుండీ 23 ఏళ్ళకు పెంచినట్లు కేంద్ర ప్రకటించింది. ప్రతి సంవత్సరం నియమితులైన అగ్నివీరులలో 25 శాతం మందిని మాత్రమే పదిహేనేళ్ల సర్వీస్‌ను పూర్తి చేయడానికి కొనసాగిస్తారు. మిగిలిన వారు నాలుగేళ్ల సర్వీసు పూర్తి కాగానే రిటైరవుతారు. నాలుగు సంవత్సరాల సర్వీసు తర్వాత పదవీ విరమణ పొందే వారు పింఛను పొందేందుకు అర్హత ఉండదు. ఈ పథకంలో పాత విధానంలో ఉన్న దీర్ఘకాలిక పదవీకాలం, పెన్షన్ వంటి ఇతర ప్రయోజనాలు ఉండవు. సాయుధ దళాలలో చేరాలని ఆకాంక్షిస్తున్న వ్యక్తులు కొత్త పథకం నిబంధనలతో నిరాశ చెందారు. తక్కువ సేవా కాలం, విరమణ పొందిన వారికి ఎటువంటి పెన్షన్ నిబంధనలు లేకపోవడం, 17.5 నుండి 21 సంవత్సరాల వయస్సు పరిమితి కారణంగా ప్రస్తుత ఆశావహులు భారత సాయుధ దళాలలో పనిచేయడానికి అనర్హులై పోవడం ఆందోళనకు ప్రధాన కారణాలు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టే ముందు, దీనిపై ప్రభుత్వం చర్చకు పెట్టలేదు. పార్లమెంటులో గానీ, పార్లమెంటు స్టాండీంగ్ కమిటీలో గానీ, ప్రజాబాహుళ్యంలో గానీ ఏ చర్చా జరపలేదు. ప్రకటించేముందు ప్రజలకు అసలు దీని గురించి సమాచారం ఇవ్వనే లేదు. ఈ పథకాన్ని ప్రస్తుతానికి నిలిపివేసి, పార్లమెంటులో దానిపై చర్చ చేపట్టాళని ప్రతిపక్షాలు డిమాండు చేసాయి. అకస్మాత్తుగా ప్రకటించిన ఈ పథకం పట్ల యువతలో నిరసన వ్యక్తమైంది. దేశం లోని పలు ప్రాంతాల్లో ఈ నిరసనలు హింసాత్మక రూపాన్ని తీసుకున్నాయి. కొత్త పథకంతో కోపంగా ఉన్న ఆర్మీ ఆశావహులు దీనిని వెనక్కి తీసుకోవాలని పిలుపునిచ్చారు. బస్సులు, రైళ్లతో సహా ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు. 2022 జూన్ 15 న, మొదటిసారిగా బీహార్ రాష్ట్రంలో నిరసనలు వచ్చాయి. అక్కడ నిరసనకారులు జాతీయ రహదారులు, రైల్వే ట్రాక్‌లను అడ్డుకున్నారు. 2022 జూన్ 16 న బీహార్‌లోని ఛప్రా, జెహనాబాద్, ముంగేర్, నవాడాల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఆర్మీ ఆశావహులు రైళ్లు, బస్సులను తగులబెట్టారు. కైమూర్, ఛప్రా జిల్లాల్లో రైలు బోగీలకు నిప్పంటించారు, సివాన్, అరా, జెహనాబాద్, నవాడా, సహర్ష, ఛప్రాలో రైళ్ల రాకపోకలను, కొన్ని చోట్ల రోడ్లపై ట్రాఫిక్‌నూ అడ్డుకున్నారు. తరువాత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా లకు, ఇతర రాష్ట్రాలకూ హింసాత్మక సంఘటనలు వ్యాపించాయి. నిరసనల వల్ల 200 కు పైగా రైళ్లు ప్రభావితమయ్యాయి, 35 రైళ్లను రద్దు చేసారు. 13 రైళ్లు తమ గమ్యస్థానానికి చేరుకోలేకపోయాయి. 2022 జూన్ 16 న బీహారులో 5 రైళ్ళను తగలబెట్టారు. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఢిల్లీ, జమ్మూల్లో కూడా ఆందోళనలు జరిగాయి. జూన్ 17 న సికిందరాబాదు రైల్వే స్టేషనులో యువకులు నిరసన తెలిపారు. హైదరాబాదు నుండి కోల్‌కతా వెళ్ళే ఈస్ట్‌కోస్ట్ ఎక్స్ప్రెస్స్ రైలుకు నిప్పంటించారు. అక్కడ పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. జూన్ 18న బీహార్‌లో నిరసనకారులు ఈ పథకానికి వ్యతిరేకంగా సమ్మెకు పిలుపునిచ్చారు. ఉదయం నుంచి పోలీసులతో ఘర్షణ పడి పలు వాహనాలకు నిప్పు పెట్టారు. జూన్ 18 న రాత్రి 8 గంటల వరకు బీహార్‌లో రైలు సేవలు నిలిచిపోయాయి. జూన్ 19 తెల్లవారుజామున 4 గంటల నుంచి మళ్లీ వాటిని నిలిపివేసారు. అనేక రాష్ట్రాల్లో హింస కొనసాగుతుండటంతో భారతదేశం అంతటా 350కి పైగా రైళ్లను రద్దు చేశారు. ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జూన్ 20న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. ఏ సంస్థ పేరు చెప్పకుండానే సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. సమ్మె కారణంగా 600కి పైగా రైళ్లు రద్దయ్యాయి. రిక్రూట్‌మెంట్ స్కీమ్‌కు వ్యతిరేకంగా భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీ-గుర్గావ్ ఎక్స్‌ప్రెస్ వేలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఫరీదాబాద్, నోయిడాలో, నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు సమావేశమవకుండా నిషేధాజ్ఞలు విధించారు. ఢిల్లీ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా సర్హౌల్ సరిహద్దు సమీపంలోని ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ జామ్‌లు కనిపించాయి. బీహార్‌లోని 20కి పైగా జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. జార్ఖండ్‌లో, పాఠశాలలను మూసివేసారు. రాష్ట్రంలో భారీ భద్రతను మోహరించారు. కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో 75 విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. నిరసనలు, బంద్ పిలుపు ల వలన తలెత్తిన భద్రతాపరమైన సమస్యలు దీనికి కారణమని కొందరు పేర్కొన్నారు. రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. బీహార్ ప్రభుత్వం 20 జిల్లాల్లో ఇంటర్నెట్‌ను నిలిపివేసింది. మరోవైపు 11 జిల్లాల్లోని బీజేపీ కార్యాలయాలకు భద్రతను పెంచింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బీహార్ పోలీసులు సశస్త్ర సీమా బల్ సిబ్బందిని బీజేపీ కార్యాలయాల వద్ద మోహరించారు. పరమవీర చక్ర కెప్టెన్ బాణా సింగ్ ఈ పథకానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, "ఈ పథకాన్ని తీసుకురావడానికి ముందు మరింత చర్చ జరిగి ఉండాల్సింది. సంబంధిత వర్గాలందరితో చర్చించకుండా ఇటువంటి భారీ మార్పులు తీసుకురావడం ఏమంత సమంజసంగా లేదు. అయితే, ఈ పథకం ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం వేచి చూడాలి." నావికాదళ మాజీ చీఫ్‌ అడ్మిరల్‌ అరుణ్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ.. త్రివిధ దళాలకు ఒకేసారి ఈ పథకాన్ని అమలు చేయడం కష్టసాధ్యమని అన్నాడు. ఇంకా, “ప్రస్తుత రూపంలో ఇది, సైన్యానికి మాత్రమే సరిపోతుంది. దానికున్న పెద్ద పదాతిదళ విభాగానికి అంత పెద్ద సాంకేతికత ఏమీ ఉండదు. నావికాదళం, వైమానిక దళాల విషయంలో, ఒక కొత్త ఉద్యోగికి ప్రాణాంతకమైన ఆయుధ వ్యవస్థలు, సంక్లిష్టమైన యంత్రాలు, ఎలక్ట్రానిక్‌ల నిర్వహణను అప్పగించడానికి తగినంత అనుభవం పొందాలంటే కనీసం 5-6 సంవత్సరాలు అవసరమని గుర్తించాలి.” అని కూడా అన్నాడు. ఆర్మీ స్టాఫ్ మాజీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజ్ కద్యన్ (అతను సర్వీస్‌లో ఉన్నప్పుడే ఈ చర్య పట్ల తన వ్యతిరేకతను లేవనెత్తాడు), ఈ రకమైన పథకం తక్కువ రిస్కుండే సంస్థకు సరిపోతుందని చెప్పాడు. "మనం రిస్కు ఎక్కువగా ఉండే రక్షణ దళాలలో దీనిని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం, యుద్ధం రాకూడదని నేను ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. యుద్ధమే గనక వస్తే, నాలుగేళ్ళ తరువాత బయటకు పోవాల్సిన వ్యక్తి తన ప్రాణాలను త్యజించేంత నిబద్ధత చూపిస్తాడని ఆశించలేం” అని అతను చెప్పాడు.. పారాట్రూపర్, మాజీ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) అయిన లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా మీడియాతో మాట్లాడుతూ, ఈ చర్యపై తన వ్యతిరేకతను స్పష్టంగా తెలియజేశాడు: “దేశం కోసం, సాయుధ దళాల కోసం, అగ్నివీరుల కోసం ToD [టూర్ ఆఫ్ డ్యూటీ లో అగ్నిపత్ విజయవంతం కావాలని ఆశిద్దాం, ప్రార్థిద్దాం. ఈ ప్రక్రియ చాలా రిస్కుతో కూడుకున్నది, వెనక్కు తీసుకోలేనిదీను. ప్రభుత్వం దీని బాధ్యతను తన భుజాలపై వేసుకుని అది విజయవంతమయ్యేలా చూసుకోవాలి." అతను ఇంకా ఇలా చెప్పాడు “నేను పారాట్రూపర్‌ని, అంచేత రిస్కు నాకు కొత్తేం కాదు. కానీ ఇంత రిస్కు నేను తీసుకోలేను. దీంతో సైన్యపు మౌలిక లక్షణమే మారవచ్చు." మేజర్ జనరల్ జి.డి. బక్షి, ఈ ప్రతిపాదనను తీవ్రంగా దుయ్యబట్టాడు. "అగ్నివీర్ పథకంతో తాను విస్తుపోయానని" పేర్కొన్నాడు. “ఇది పైలట్ ప్రాతిపదికన జరుగుతున్న ట్రయల్ అని నేను మొదట్లో అనుకున్నాను. భారతీయ సాయుధ బలగాలను చైనీస్ (చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని సూచిస్తూ) లాగా స్వల్పకాలిక పాక్షిక నిర్బంధ సైనిక దళంగా మార్చే పని ఇది. ఫర్ గాడ్ సేక్ ప్లీజ్ డోంట్ డూ” అన్నాడు. సంస్థలను నాశనం చేయవద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ, అతను ఇంకా ఇలా అన్నాడు: “చైనా, పాకిస్తాన్ నుండి గొప్ప ముప్పు ఎదురౌతున్న సమయంలో మన సంస్థలను నాశనం చేయకండి. కేవలం డబ్బును పొదుపు చేయడం కోసం మన వద్ద ఉన్న దానిని నాశనం చేయకూడదు. సాయుధ దళాలకు యువత, అనుభవాల సమ్మిశ్రమం అవసరం. నాలుగేళ్ళ సైనికులు ప్రమాదానికి దూరంగా ఉండే అవకాశం ఉంది. రష్యా నుండి నేర్చుకోండి.” "రాత్రికిరాత్రే నాలుగేళ్ళ టూర్ ఆఫ్ డ్యూటీ మోడల్‌కి మారిపోవడం చాలా విఘాతం కలిగించే మార్పు అవుతుంది" అని ఆ విశ్రాంత ఆర్మీ అధికారి చెప్పాడు. 10 మంది పారా కమాండోలలో సెకండ్-ఇన్-కమాండ్‌గా ఉన్న మేజర్ జనరల్ షియోనన్ సింగ్ భారత శాంతి పరిరక్షక దళంలో భాగంగా శ్రీలంకలో పనిచేసాడు. అతను, "ఇది మూర్ఖపు చర్య, ఇది భద్రతా దళాల సామర్థ్యాన్నే ప్రభావితం చేయగలదు." "డబ్బు పొదుపు చేయడం మంచిదే, కానీ రక్షణ దళాల డబ్బుతో చేయకూడదు. అనుభవజ్ఞుడైన సైనికుడు యుద్ధంలో మరణిస్తే, నాలుగేళ్ల శిక్షణ పొందిన వ్యక్తితో అతని స్థానాన్ని భర్తీ చేయగలరా? ఇలాంటి విధానాలతో ఈ పనులు కావు." అన్నాడు. ఎయిర్ వైస్ మార్షల్ మన్మోహన్ బహదూర్, "భారత సైన్యం రెండు శతాబ్దాలుగా, వైమానిక దళం, నౌకాదళాలు దశాబ్దాలుగా అవలంబిస్తూ ఉన్న పద్దతుల నుండి ఈ పథకం సంపూర్ణంగా తొలగిపోతోంది. మార్పు ఏదైనా, అంచెలంచెలుగా, వివిధ దశల్లో చేసి ఉండాల్సింది" అని అన్నాడు. మౌంటైన్ బ్రిగేడ్ మాజీ కమాండర్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) మాజీ కమాండర్ బ్రిగేడియర్ V. మహాలింగం మాట్లాడుతూ, "యుద్ధల్లో విజయం సాధించే సైన్యపు సామర్థ్యాన్ని దిగజార్చుతుంది. దురదృష్టవశాత్తు, నిర్ణయం చేసిన అధికారులెప్పుడూ యుద్ధంలో పాల్గొనలేదు. బుల్లెట్లు దూసుకొచ్చేవేళ, బాగా యుద్ధ సన్నద్ధంగా ఉన్న స్థానంపై దాడి చేయవలసి వచ్చినప్పుడు కమాండ్ & కంట్రోల్‌ని అమలు చేయడం ఎలా ఉంటుందో వాళ్ళకు తెలియదు." అన్నాడు. భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ అనుభా జైన్ మాట్లాడుతూ "వెన్నెముక లేని జనరళ్ళు ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి తొక్కిసలాడుకుంటున్నారు." అన్నాడు. మాజీ ఆర్మీ జవాన్లు కూడా "సైన్యంతో ప్రయోగాలు చేయవద్దు, నాలుగేళ్ల తర్వాత గ్యాంగ్‌స్టర్స్‌లో చేరితే ఎలా ఉంటుంది?" అని ఉటంకిస్తూ ఈ పథకాన్ని నిందించారు. ఫరీద్‌కోట్‌లోని మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు హవిల్దార్ ప్రేమ్‌జిత్ సింగ్ బ్రార్ మాట్లాడుతూ "ఇది తప్పుడు చర్య. ఈ నిఅయమ నిబంధనలపై సైన్యంలో చేరడానికి ఎవరూ ఆసక్తి చూపరు. ఇది ప్రైవేట్ సైన్యాన్ని పెంచడం లాంటిది. సరిహద్దుల్లో ఎవరైనా చనిపోతే, అతనికి ఒక స్థిరమైన నష్టపరిహారం మాత్రమే ఇస్తామనీ, అతని కుటుంబానికి ఎటువంటి పెన్షన్ గానీ, లేదా ఎటువంటి ప్రయోజనం గానీ లభించదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో, చనిపోవడానికి ఎవరైనా ఎందుకు సిద్ధంగా ఉండాలి?" అన్నాడు.భారతదేశంలో సదుద్దేశాలు కూడా రాజకీయాల్లో చిక్కుకుపోవడం దురదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నాడు. జూన్ 20న, "అనేక నిర్ణయాలు ఇప్పుడు అన్యాయంగా కనిపించవచ్చు. కొంత కాలం తరువాత, ఆ నిర్ణయాలే దేశనిర్మాణానికి దోహదపడతాయి." అని అతను అన్నాడు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఓ సదస్సులో మాట్లాడుతూ, "సాయుధ బలగాల్లో నియామకాల ప్రక్రియలో అది విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తోంది. కొందరు దీనిపై అపోహలు వ్యాప్తి చేస్తున్నారు. కొత్త పథకం కావడంతో ప్రజల్లో కొంత గందరగోళం ఉండవచ్చు" అని అన్నాడు. ఆర్మీ స్టాఫ్ చీఫ్ మనోజ్ పాండే నిరసనలపై స్పందిస్తూ, "సైన్యంలో చేరాలనుకునే ఆశావాదుల ఆందోళన, వారికి సరైన సమాచారం లేకపోవడం వలన వచ్చింది." నేవల్ స్టాఫ్ చీఫ్ ఆర్. హరి కుమార్ మాట్లాడుతూ "ఇలాంటి నిరసనలను నేను ఊహించలేదు. తప్పుడు సమాచారం, పథకం గురించి తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే నిరసనలు జరుగుతున్నాయని నేను భావిస్తున్నాను" అని అన్నాడు. ఎయిర్ స్టాఫ్ చీఫ్ వివేక్ రామ్ చౌదరి హింసను ఖండిస్తూ, "[రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో చివరి దశ, పోలీసు ధృవీకరణ: ఈ నిరసనల్లో ప్రమేయం ఉన్నవారు, పోలీసుల నుండి క్లియరెన్స్ పొందలేరు" అని అన్నాడు. మిలిటరీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి, లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరి, పెరుగుతున్న ఆందోళనపై స్పందిస్తూ "ఆశావహులు, తాము నిరసనలలో పాలుపంచుకోలేదని నిరూపించుకోవాలి" అని అన్నాడు. అతను ఇంకా మాట్లాడుతూ, "ఇక ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవడం గురించి చెప్పాలంటే.. - అది కుదరదు. అసలు దానిని ఎందుకు వెనక్కి తీసుకోవాలి? దేశంలో యువరక్తం నింపడానికి ఇది ఏకైక ప్రగతిశీల చర్య." అన్నాడు.