భారత_జాతీయ_ఎస్టీ_కమిషన్ https://te.wikipedia.org/wiki/భారత_జాతీయ_ఎస్టీ_కమిషన్ భారత జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ప్రకారం 2004 సంవత్సరంలో ఏర్పడింది. ఇది రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ. రాజ్యాంగంలోని 338(ఎ) అధికరణ జాతీయ షెడ్యూల్డ్ తెగల గురించి తెలియజేస్తుంది. రాజ్యాంగ పరంగా షెడ్యూల్డ్ తెగలకు కల్పించిన రక్షణలను పరిరక్షించడం ఈ సంస్థ లక్ష్యం. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్‌లో ఒక చైర్మన్, వైస్ చైర్మన్, ముగ్గురు ఇతర సభ్యులు ఉంటారు. వీరిలో ఒక మహిళ సభ్యురాలు తప్పనిసరి. వీరందరూ షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినవారై ఉండాలి. కమిషన్‌ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులను నియమించే మరియు తొలగించే అధికారం రాష్ట్రపతికే ఉంటుంది. వీరి పదవీ కాలం మూడేళ్లు. షెడ్యూల్డ్ తెగల హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు విచారణ చేపట్టడం. ఎస్టీలకు రాజ్యాంగపరంగా, శాసనపరంగా కల్పించిన ప్రత్యేక రక్షణ పట్ల అవగాహన కల్పించి చైతన్యపరచడం. ఎస్టీల ఆర్థిక, సాంఘిక అభివృద్ధికి సంబంధించి ప్రణాళిక రూపొందించి ప్రభుత్వాలకు సలహా ఇవ్వడం. ఎస్టీల రక్షణ కోసం అవసరమైన చర్యలపై రాష్ట్రపతికి సలహాలివ్వడం. ఏదైనా విషయాన్ని విచారించే విషయంలో ఈ కమిషన్‌కు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి.