ఆలీసాగర్_ఎత్తిపోతల_పథకం https://te.wikipedia.org/wiki/ఆలీసాగర్_ఎత్తిపోతల_పథకం ఆలీసాగర్ ఎత్తిపోతల పథకం, నిజామాబాదు జిల్లాలోని ఎత్తిపోతల పథకం. ఇది ఒక పర్యాటక కేంద్రం. ఇది నిజామాబాదు జిల్లా, ఎడపల్లి మండలం, థానాకలాన్ గ్రామంలో ఉంది. దీన్ని 1930 లో నిజాం పరిపాలనలో ఏర్పాటు చేశారు. అలీసాగర్ నిజామాబాదు నుండి 10 కిలోమీటర్ల దూరములో నిజామాబాదు - బాసర రోడ్డుకి 2 కిలోమీటర్ల దూరములో ఉంది. నగర జీవితము యొక్క హడావిడికి దూరముగా ఈ జలాశయము ప్రశాంత వాతావరణము కల్పిస్తుంది. వన్య ప్రాంతముతో పాటు కల వేసవి విడిది, చక్కగా తీర్చిదిద్దిన ఉద్యానవనాలు, ఒక దీవి, కొండపైనున్న అతిధిగృహము దీనిని పర్యాటకులకు ఒక ముఖ్య గమ్యస్థానముగా చేస్తున్నాయి. వీటితో పాటు జింకల పార్కు, ట్రెక్కింగ్, జలక్రీడలకు సదుపాయాలు ఉండటము అదనపు ఆకర్షణ. నిజాంసాగర్ నుండి వచ్చే ప్రధాన కాలువ ద్వారా ఆలీసాగర్ జలాశయం లోకి నీరు వస్తుంది. నిజాంసాగర్ కింద ఉన్న ఆయకట్టులో నీరు అందని ప్రాంతాలకు నీటి సౌకర్యం కలిగించేందుకు ఆలీ సాగర్ ఎత్తిపోతల పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించింది. నిజామాబాదు జిల్లా, నవీపేట మండలం కోస్లి వద్ద గోదావరి నది కుడి గట్టునుండి నీటిని మూడు దశల్లో ఎత్తిపోసి ఆలీసాగర్ వద్దకు చేర్చడం ఈ పథకంలో ప్రధాన అంగం. మొదటి దశలో కోస్లి నుండి తాడ్‌బిలోలి వరకు ఎత్తిపోస్తారు. రెండవ దశలో అక్కడి నుండి పోచారం చెరువు వరకు పంపిస్తారు. మూడవదశలో అక్కడి నుండి ఆలీసాగర్ దిగువన నిజాం సాగర్ కాలువలోకి తోడిపోస్తారు. మొత్తం 17.35 కిలోమీటర్ల దూరం పంపిస్తారు. ఈ పథకం వలన కొత్తగా ఆయకట్టు ఏర్పడదు. నవీపేట, రేంజల్, ఎడపల్లి, నిజామాబాదు, డిచ్‌పల్లి, మాక్లూర్ మండలాల్లో ఉన్న నిజాంసాగర్ ఆయకట్టు లోని 53,793 ఎకరాలకు సాగునీటి పారుదల స్థిరీకరణ జరుగుతుంది. మండలం వారీగా ప్రయోజనం పొందే భూమి వివరం: ఈ పథకం 2007 లో పూర్తై, 2007-2008 ఖరీఫ్ పంట నుండి నీటిని అందిస్తోంది.