యూనియన్_పబ్లిక్_సర్వీస్_కమిషన్ https://te.wikipedia.org/wiki/యూనియన్_పబ్లిక్_సర్వీస్_కమిషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశంలో కేంద్ర స్థాయిలో పబ్లిక్ సర్వీసుల‌ నియామక సంస్థగా ప‌ని చేస్తుంది. ఇది స్వతంత్ర రాజ్యాంగ బద్ధ సంస్థ. యూపీఎస్సీలో చైర్మన్, సభ్యులును నియమించే మరియు తొలగించే అధికారం రాష్ట్రపతికే ఉంటుంది. ఈ కమిషన్‌లో ఎంత మంది సభ్యులు ఉండాలో రాజ్యాంగం ప్రత్యేకంగా చెప్ప‌లేదు. సాధారణంగా చైర్మన్‌తో సహా 9 నుండి 11 మంది సభ్యులు ఉంటారు. కమిషన్‌లోని సగం మంది సభ్యులు భారత ప్రభుత్వంలో గాని, రాష్ట్ర ప్రభుత్వాలలో కానీ కనీసం 10 సంవత్సరాలు ప‌ని చేసి ఉండాలి, చైర్మన్, సభ్యుల సర్వీస్ విషయాలను రాష్ట్రపతి నిర్ణ‌యిస్తాడు. యూపీఎస్సీ కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు ఏది ముందైతే అది వర్తిస్తుంది. చైర్మ‌న్‌, స‌భ్యులు ఎప్పుడైనా రాష్ట్రపతికి రాజీనామా ఇచ్చి పదవి నుంచి తప్పుకోవచ్చు.అఖిల భారత సర్వీసులకు, కేంద్ర సర్వీసులకు, కేంద్ర పాలిత ప్రాంతాల సర్వీసు నియామకాలకు పరీక్షలు నిర్వహిస్తుంది. ఏమైనా సర్వీసులకు ప్రత్యేక అర్హతలుగల అభ్యర్థుల నియామకం అవసరమని రెండు లేక అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు భావిస్తే ఆ రాష్ట్రాల‌ అభ్యర్థన మేరకు సర్వీసులలో ఉమ్మడిగా వర్తింపజేయుటకు పథకాలను రూపొందించడానికి, అమలు చేయడానికి యూపీఎస్సీ ఆ రాష్ట్రాలకు సహాయం చేస్తుంది. రాష్ట్రపతి అనుమతిలో గవర్నర్ కోరిన మేరకు రాష్ట్రానికి తోడ్పడుతుంది.