రైతు_బంధు_పథకం https://te.wikipedia.org/wiki/రైతు_బంధు_పథకం వ్యవసాయం కోసం పెట్టుబడిని ఋణంగా నగదు రూపంలో రైతులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే రైతుబంధు పథకం. ఈ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 2018, మే 10న కరీంనగర్‌ జిల్లా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి - ఇందిరానగర్‌ వద్ద ప్రారంభించాడు. మొట్టమొదటి సారిగా ధర్మరాజుపల్లి వాసులు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా చెక్కులు, పట్టాదార్‌ పాసు పుస్తకాలు అందుకున్నారు. రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి రూ.5 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేయనుంది. ఖరీఫ్, రబీ సీజన్ లకు ఎకరానికి రూ.5000 చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ.10000 పెట్టుబడిగా ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని రైతుకు చెక్కుల రూపంలో ఇవ్వనున్నారు. అదే విధంగా ఈ పథకం కింద నిల్వ ఉంచిన సరుకుపై రుణం తీసుకున్న రైతులకు ఆరు నెలల పాటు వడ్డీ రాయితీ ఇస్తారు. రైతులు తాము తీసుకున్న రుణాలపై ఎలాంటి వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదు. ఆరు నెలల తర్వాత అనగా 181 వ రోజు నుంచి 270 వ రోజు వరకు వారు తీసుకున్న రుణంపై 12 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 58.34 లక్షల మంది రైతులకు పెట్టుబడిసాయం అందిస్తుంది. ( గిరిజనభూములు కలిపి మొత్తం కోట్ల ఎకరాలకు ) ఈ పథకం అమలుకోసం బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించారు. తెలంగాణా రాష్ట్ర గణాంక సంకలనం 2020 ఉన్న వివరములను పరిశీలిస్తే , రైతుబంధు పథకం కింద పొందిన వ్యవసాయదారులలో 90% చిన్నరైతులు , సన్నకారు రైతులే ఉన్నారు . ఈ పథకం మొత్తం లబ్ది పొందిన వాటిలో నల్గొండ జిల్లాలోని 4,32,059 రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనము పొందినారు. రాష్ట్రము మొత్తములో ఎక్కువ మొత్తంలోరైతుబంధు పథకం ప్రయోజనం పొందిన రైతులలో నల్గొండ జిల్లా ప్రథమ స్థానం లో ఉన్నది, తర్వాతి స్థానాలలో సంగారెడ్డి, రంగారెడ్డి, ఖమ్మం, నాగర్ కర్నూల్ జిల్లాలు ఉన్నవి . రైతుబంధు లబ్దిదారులను క్రింది పట్టిక ద్వారా చూడ వచ్చును మొదట్లో 2018-19 సంవత్సరంలో ఎకరానికి రూ.4వేల చొప్పున రెండు పంటలకోసం రెండు విడతల్లో ప్రతి రైతుకు మొత్తం ఏడాదికి రూ. 8వేలను ప్రభుత్వం అందించారు. పునాస పంట పెట్టుబడిని ఏప్రిల్‌ నుంచి, యాసంగి పంట పెట్టుబడిని నవంబర్‌ నుంచి పంపిణీ చేశారు. 2019-20 నుంచి పంట పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచి, రైతుకు ఎకరాకు సంవత్సరానికి రూ.10 వేలు అందజేస్తున్నారు. ఈ పథకం కింద 2021 వరకు రూ.50 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమచేయబడ్డాయి. పంట పెట్టుబడి పథకం వల్ల 90.5 శాతం ఉన్న పేద రైతులు లబ్ధి పొందారు. 2022 జూన్ 28న తొమ్మిదో విడత రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ ప్రారంభమైంది. ఈ వానకాలం సీజన్‌కు 68.94 లక్షలమంది రైతులు రైతుబంధుకు అర్హులు కాగా, రైతుబంధు పంపిణీ కోసం రూ.7,654.43 కోట్లు పంపిణీ చేశారు. ఈ సీజన్ పంపిణీతో ఇప్పటివరకు అందించిన సాయం రూ. 58,102 కోట్లకు చేరింది. ప్రపంచ దేశాల్లో రైతుల అభివృద్ధి కోసం చేపట్టిన వినూత్న కార్యక్రమాల్లో ఐక్యరాజ్యసమితి ఎంపిక చేసిన 20 పథకాలలో రైతుబంధు పథకం ఒకటి. 2018 నవంబరు 20 నుండి 23 వరకు 'వ్యవసాయాభివృద్ధిలో వినూత్న ఆవిష్కరణలు' అనే అంతర్జాతీయ సదస్సు ఐరాసలోని వ్యవసాయ విభాగం ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎవో) కేంద్ర కార్యాలయం రోమ్ నగరంలో జరిగింది. ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతుబంధు, రైతుబీమా పథకాలను ఎంపిక చేయగా, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలపై ప్రత్యేక ప్రజంటేషన్ ఇచ్చాడు. రైతుబంధు పథకంలో భాగంగా రూ.50వేల కోట్లు రైతులకు నేరుగా అందించిన సందర్భంగా 2022 జనవరి 3 నుండి 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు జరిగాయి. ఈ వారోత్సవాలలో రైతుబంధు సంబురాల రంగవల్లులు, వరినారుతో కేసీఆర్ చిత్రపటాలను తయారు చేయడం, ట్రాక్టర్-ఎడ్లబండ్ల ర్యాలీలు, సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పూలాభిషేకం-పాలాభిషేకాలు, చిత్రలేఖన-వ్యాసరచన పోటీలు వంటివి నిర్వహించబడ్డాయి. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తమ ప్రభుత్వం నడిపించిన రైతు బంధు పథకాన్ని తమ సానుకూలాంశంగా ప్రచారం చేసుకుంది. అయితే విపక్షాలు మాత్రం ఈ పథకం కేవలం పెద్ద రైతులకు, భూస్వాములకు లాభం చేకూర్చడానికే నడిచిందనీ, అసలు వ్యవసాయం చేసి కష్టనష్టాలు అనుభవించే కౌలు రైతులకు దీని వల్ల రూపాయి కూడా లాభం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు