తెలంగాణ_గ్రామజ్యోతి_పథకం https://te.wikipedia.org/wiki/తెలంగాణ_గ్రామజ్యోతి_పథకం తెలంగాణ గ్రామజ్యోతి పథకం తెలంగాణ రాష్ట్రం లోని గ్రామాల అభివృద్ధికోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం. తెలంగాణ గ్రామజ్యోతి పథకాన్ని 2015, ఆగస్టు 17వ తేదీన వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించారు. ఈ పథకం అమలు కోసం మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుచేసారు. ఈ కమిటీలో మంత్రులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, టి. హరీశ్ రావు, జోగు రామన్న సభ్యులుగా ఉన్నారు. గ్రామజ్యోతి పథకం అమలుకు ఒక్కో మండలానికి ఒక్కో అధికారిని, గ్రామగ్రామాన ‘గ్రామజ్యోతి' పేరిట వారోత్సవాలకోసం పంచాయితీలకు సిబ్బందిని నియమించారు. ఈ పథకంలో భాగంగా రానున్న 5 ఏళ్లలో గ్రామాల అభివృద్ధికి రూ. 25 వేల కోట్లు ఖర్చ చేయాలని... జనాభాను బట్టి అన్ని గ్రామాల అభివృద్ధికి రూ.2 నుంచి 6 కోట్ల వరకు ప్రభుత్వం నుంచి నిధులు అందివ్వనున్నారు.