తెలంగాణ_మెడికల్_కౌన్సిల్ https://te.wikipedia.org/wiki/తెలంగాణ_మెడికల్_కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్రంలో వైద్య విధానం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కౌన్సిల్. కొత్త వైద్యుల నమోదు, సీనియర్ వైద్యుల రెన్యూవల్స్, వైద్య ప్రమాణాల పాటింపు, నిరంతర వైద్య విద్య కార్యక్రమాలన్నీ ఈ కౌన్సిల్ పరిధిలోనే జరుగుతాయి. తెలంగాణ ప్రభుత్వం 2016, జనవరి 6న ఈ మెడికల్ కౌన్సిల్ ను ఏర్పాటుచేసి డా. ఈ.రవీంద్రరెడ్డిని కౌన్సిల్ తొలి చైర్మన్ గా, డా.వి.రాజలింగంని తొలి వైస్ చైర్మన్ గా నియమించింది. అంతేకాకుండా ఇతరులతో కలిసి కౌన్సిల్ కమిటీని ఏర్పాటుచేసింది. 2022 మే 7న జరిగిన కౌన్సిల్‌ ఎన్నికలలో నూతన అధ్యక్షుడిగా మెహిదీపట్నం సరోజినీదేవి కంటి దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వి.రాజలింగం ఎన్నికయ్యాడు. ఇందులో సభ్యులుగా ఉస్మానియా ఆసుపత్రి ప్రొఫెసర్‌ డాక్టర్‌ వి.రమేశ్‌, సిద్ధిపేటకు చెందిన డాక్టర్‌ డి.చంద్రారెడ్డి, కరీంనగర్‌కు చెందిన డాక్టర్‌ సీహెచ్‌ అమిత్‌ కుమార్‌, హైదరాబాదుకు చెందిన డాక్టర్‌ కృష్ణారెడ్డి, జడ్చర్లకు చెందిన డాక్టర్‌ ఎస్‌.కె.అగర్వాల్‌ నియమితులయ్యారు. వీరు కౌన్సిల్‌ అధ్యక్షుడిగా డాక్టర్‌ రాజలింగంను ఏకగ్రీవంగా ఎన్నుకోగా, ఉపాధ్యక్షుడిగా డాక్టర్‌ చంద్రారెడ్డి ప్రమాణ స్వీకారం చేశాడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అర్హత పొందిన వైద్యుల జాబితాను తయూరుచేస్తుంది. ప్రభుత్వంకు, వైద్య వృత్తికి అనుసంధానంగా, నియంత్రణ సంస్థగా ఇది పనిచేస్తుంది. వైద్యుల పేర్ల నమోదుతోపాటు వైద్యులంతా నియమ నిబంధనలు, వైద్య ప్రమాణాలు పాటించేలా చూస్తూ, ఉత్తమ వైద్య పద్ధతులను ప్రోత్సహిస్తుంది. చికిత్సలో వైద్యులు తప్పు చేసినట్లు నేరం రుజువైతే చర్య తీసుకుంటుంది. వైద్య విద్య, శిక్షణలో ఉన్నత ప్రమాణాలను ప్రోత్సహిస్తుంది.వైద్యసేవలు అందించాలనుకునే వారు ముందుగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఎంబీబీఎస్ పూర్తికాగానే రిజిస్టర్ చేసుకున్నవారికి ప్రాక్టీసు చేసుకోవడానికి అర్హత లభిస్తుంది.