తెలంగాణ_రైతుబీమా_పథకం https://te.wikipedia.org/wiki/తెలంగాణ_రైతుబీమా_పథకం తెలంగాణ రైతుబీమా పథకం, తెలంగాణ రాష్ట్ర రైతులకోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. ఏ కారణంతోనైనా రైతు చనిపోతే, నామినీకి ఎల్ఐసీ నుంచి 10 రోజుల్లోగా 5 లక్షల బీమా పరిహారం అందించడానికి ఈ పథకం రూపొందించబడింది. తెలంగాణ ప్రభుత్వం ఒక్కో రైతు కోసం 2,271 రూపాయలను ప్రీమియంగా చెల్లించి, 5 లక్షల రూపాయలను బీమాగా అందిస్తోంది. రైతులకు 5 లక్షల బీమా కవరేజ్ అందించిన దేశంలోని తొలిరాష్ట్రం తెలంగాణ. కొంతకాలం తరువాత రైతుబీమా పథకం ప్రీమియం 56.54 శాతానికి పెరుగగా, ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ. 3,556 చొప్పున మొత్తం 32.16 లక్షల మంది రైతులకు రూ.1143.60 కోట్లను ప్రీమియంగా ఎల్.ఐ.సి.కి చెల్లించింది. తొలి రెండేళ్ళకాలంలో రైతుబీమా పథకంలో భాగంగా ప్రీమియం కింద రూ. 1775.95 కోట్ల పేమెంట్స్ జరుగగా, 32267 మంది రైతు కుటుంబాలకు రైతుబీమా పథకం వర్తించగా, ఎల్ఐసీ ద్వారా ఒక్కో రైతు కుటుంబానికి 5 లక్షల చొప్పున రూ.1613.35 కోట్లు చెల్లించబడ్డాయి. తొలి మూడేళ్ళకాలంలో (2018-19, 2019-20, 2020-21) మూడేండ్లలో రాష్ట్రంలోని 32.33 లక్షల మంది అర్హులైన రైతుల కోసం ప్రభుత్వం రైతు బీమా పథకం అమలు కోసం రూ.2917.39 కోట్లను ప్రీమియంగా ఎల్.ఐ.సి సంస్థకు చెల్లించింది. 2021 మే నాటికి 49,755 మంది రైతులు చనిపోగా, వీరి కుటుంబాలకు 8.75 కోట్ల బీమా మొత్తం అందింది. 2018, ఫిబ్రవరి 26న కరీంనగర్ పట్టణంలో జరిగిన రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబీమా పథకంపై నిర్ణయం తీసుకున్నాడు. 2018, ఆగస్టు 6న వరంగల్ జిల్లా, దుగ్గొండి మండలం, తిమ్మంపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ 'రైతుబీమా' పథకంలో భాగంగా రైతులకు బీమా బాండ్లను అందజేశాడు. 2018 ఆగస్టు 14న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా రైతు బీమా పథకం అధికారికంగా ప్రారంభమయింది. రైతుబీమా చేసేందుకు ఎన్నో బీమా సంస్థలు ప్రభుత్వాన్ని సంప్రదించగా, ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థగా పేరుండి, ఊరూరా విస్తరించి, ప్రజల్లో నమ్మకం కలిగిన ఎల్ఐసీ సంస్థకే ఈ బాధ్యతను అప్పగించబడింది. ఇందుకోసం 2018 జూన్ 4న హైదరాబాద్ లోని మాదాపూర్ హెచ్ఐసీసీలో జరిగిన రైతుబంధు జీవిత బీమా పథకం అవగాహన సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం - ఎల్ఐసీ మధ్య కీలక ఒప్పందం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎల్ఐసీ చైర్మన్ వీకే శర్మ సమక్షంలో ఒప్పంద పత్రాలపై ఎల్ఐసీ రీజినల్ మేనేజర్ జి. సత్యనారాయణ శాస్త్రి, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి సంతకాలు చేసి, పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళలోపు వయసు ఉన్న రైతులందరు ఈ పథకానికి అర్హులు ఆధార్ కార్డుపై నమోదైన పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. ప్రతీ ఏడాది కూడా ఆగస్టు 15నే ప్రామాణికంగా తీసుకుని పేర్లను నమోదు చేసుకుంటారు. పట్టాదారు పాస్ పుస్తకాలున్న ప్రతి రైతుకు రైతు బీమా పథకం వర్తిస్తుంది ఎకరం భూమి ఉన్న రైతు నుంచి వంద ఎకరాలున్న రైతుకు కూడా ఒకే రకమైన బీమా వర్తిస్తుంది గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర రైతు సమన్వయ సమితులు రైతులతో బీమా చేయిస్తాయి2018-19లో 31.27 లక్షల మంది రైతులు బీమా చేయించుకోగా, 10.30 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఎల్.ఐ.సి సంస్థకు చెల్లించింది. ఎల్.ఐ.సి అధికారులు రైతుబంధు జీవితబీమా పాలసీ బాండ్ ను 2018 ఆగస్టు 15న ప్రభుత్వానికి అందజేశారు. 17,521 మంది రైతులు మరణించగా వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.876.05 కోట్ల బీమా మొత్తం అందించబడింది. 2020-21 ఆర్థిక సంవత్సరం (2020 ఆగస్టు 14 నుంచి 2021 ఆగస్టు 13 వరకు) రైతు బీమా పథక అమలు కోసం రూ.1173.54 కోట్ల (18 ప‌ర్సెంట్ జీఎస్టీతో కలిపి రూ. 1141 కోట్ల ప్రీమియం, రూ. 32.54 కోట్ల స్టాంప్ డ్యూటీ ఫండ్స్) ప్రీమియం నిధులు విడుదలయ్యాయి. భారతీయ బీమా సంస్థ – ఎల్ఐసీకి ఈ నిధులు చెల్లించబడ్డాయి. నాలుగో ఏడాది 2021-22లో ప్రభుత్వం రూ.1200 కోట్ల బీమా ప్రీమియం చెల్లించింది.ప్రపంచ దేశాల్లో రైతుల అభివృద్ధి కోసం చేపట్టిన వినూత్న కార్యక్రమాల్లో ఐక్యరాజ్యసమితి ఎంపిక చేసిన 20 పథకాలలో రైతుబీమా పథకం ఒకటి. 2018 నవంబరు 20 నుండి 23 వరకు 'వ్యవసాయాభివృద్ధిలో వినూత్న ఆవిష్కరణలు' అనే అంతర్జాతీయ సదస్సు ఐరాసలోని వ్యవసాయ విభాగం ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎవో) కేంద్ర కార్యాలయం రోమ్ నగరంలో జరిగింది. ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతుబంధు, రైతుబీమా పథకాలను ఎంపిక చేయగా, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలపై ప్రత్యేక ప్రజంటేషన్ ఇచ్చాడు. తెలంగాణ ప్రభుత్వ పథకాలురైతుబీమా పథక వెబ్సైటు Archived 2021-12-31 at the Wayback Machine