దగ్గు https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%97%E0%B1%8D%E0%B0%97%E0%B1%81 శ్వాస మార్గం ద్వారా ఏవైనా అవాంఛిత పదార్థాలు లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు వాటిని బయటికి పంపించేందుకు మన శరీరం చేసే బలమైన ప్రయత్నమే దగ్గు (Cough). ఒంట్లో తలెత్తిన మరేదో సమస్యకు దగ్గు ఓ లక్షణం మాత్రమే. శరీరం మొత్తాన్ని అతలాకుతలం చేసే దగ్గు అయితే దాన్ని ఎలాగైనా తగ్గించెయ్యాలని నానా తంటాలూ పడటం సరికాదు. ఎందుకంటే దగ్గు అనేది మన ఊపిరితిత్తులకు మంచి రక్షణ లాంటిది. అందుకే దగ్గు వీడకుండా వేధిస్తున్నప్పుడు దుగ్గు మందు తాగేసి, దాన్ని అణిచివెయ్యాలని ప్రయత్నించకుండా అసలు దగ్గుకు కారణం ఏమిటన్నది తెలుసుకుని, దానికి చికిత్స తీసుకోవటం శ్రేయస్కరం. చాలా దగ్గు ముందులు తాత్కాలికంగా దగ్గును అణిచివేస్తాయిగానీ లోపల అసలు సమస్య అలాగే ఉండి, అది మరింత ముదురుతుంటుంది. 1.కఫం లేని పొడి దగ్గు: 2.మామూలు కఫంతో కూడిన దగ్గు: 3.రక్త కఫంతో కూడిన దగ్గు:గాలిలోని రకరకాల కాలుష్యాలను, విషతుల్యాలను లోపలికి పీల్చినప్పుడు కూడా దగ్గు మొదలై, వాటిని బలంగా బయటకు తోసేస్తుంది. సిగరెట్‌ పొగ, దుమ్ము, పుప్పొడి, రసాయనాలు ఇలా చాలా పదార్ధాలు శ్వాస ద్వారా లోపలికి చేరినప్పుడు, వీటిని బయటకు పంపించేసేందుకు మన ఊపిరితిత్తులు దగ్గు రూపంలో వేగంగా స్పందిస్తాయి. ఇక ముక్కుల్లో ఇన్‌ఫెక్షన్‌, అలర్జీ, సైనుసైటిస్‌, గొంతు నొప్పి, కొన్ని రకాల గుండె జబ్బులు, వీటన్నింటిలో కూడా దగ్గు రావచ్చు. మనిషి దగ్గటానికి మానసిక కారణాలు కూడా ఉండవచ్చు. ఉదాహరణకు కొందరు సభల్లో మాట్లాడటానికి ముందు దగ్గి గొంతు సవరించుకొంటారు.దగ్గు తగ్గేందుకు వాడే సిరప్‌లను 'యాంటీ టస్సివ్స్‌' అంటారు. వీటిలో ఒకో మందు ఒకో రకంగా పనిచేస్తుంది. ఇవి గొంతులో చికాకు, పట్టేసినట్టుగా అనిపించటం, శ్వాస ఇబ్బంది వంటి బాధలను తగ్గిస్తాయి. పైగా లాలాజలం ఎక్కువ తయారయ్యేలా ప్రేరేపించటం ద్వారా గొంతులో హాయిగా ఉండేలా చేస్తాయి. దీంతో దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. మార్కెట్లో దొరికే రకరకాల 'లింక్టస్‌' రకం మందులు ఇవే. కఫం చిక్కగా వస్తున్నప్పుడు ఈ రకం మందుల్ని వాడతారు. ఇవి శ్వాస నాళాల్లో స్రావాలను పెంచుతాయి. దీంతో చిక్కటి కఫం కాస్తా.. పల్చబడి, త్వరగా బయటకు వెళ్లి పోతుంది. పొటాసియం సిట్రేట్‌ వంటివి ఈ రకం మందులు. ఇవి కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసి, ఒంట్లో దగ్గుకు సంబంధించిన సహజ స్పందనలనే అణిచివేస్తాయి. పొడి దగ్గు తగ్గేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి. కఫం వస్తుంటే మాత్రం వీటితో ఉపయోగం ఉండదు, పైగా కఫం లోపలే పేరుకుపోయి నష్టం కూడా జరుగుతుంది. బయట దొరికే 'కోడీన్‌' రకం మందులన్నీ ఇవే. ఈ మందులు చిక్కని కళ్లెను పల్చన చేస్తాయి. దీంతో దగ్గినప్పుడల్లా కళ్లె బయటకు వెళ్లిపోతుంది. దగ్గును అణిచివేసే మందులు నాడీ వ్యవస్థ మీద పనిచేసి మలబద్ధకం మొదలవ్వచ్చు. కొన్ని దగ్గు మందులతో మగత, అలసట వంటి సమస్యలు రావచ్చు.కొన్ని దగ్గుమందులు తీసుకున్న తర్వాత మత్తుగా అనిపించవచ్చు. కాబట్టి వీటిని అందరూ, ఎప్పుడుబడితే అప్పుడు వాడెయ్యటం అంత మంచిది కాదు. ముఖ్యంగా డ్రైవింగ్‌ చేసేవాళ్లు వీటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కఫం వస్తుంటే వైద్యుల సలహా మేరకే దగ్గు మందులు వాడాలి. దగ్గు విషయంలో మార్కెట్లో దొరికే సిరప్‌ల కంటే ఇంటి చిట్కాలే మేలు. దగ్గుకు నీరు మంచి మందు. నీళ్లు ఎక్కువగా తాగితే కఫం త్వరగా పల్చబడి బయటకు వెళ్లిపోతుంది. నీరు తాగటం వల్ల కఫాన్ని తేలిగ్గా తోడెయ్యవచ్చు. అలర్జీ కారణంగా దగ్గు వస్తున్నవాళ్లు చల్లగాలిలోకి వెళ్లకపోవటం, రోజూ ఆవిరి పట్టటం మంచిది. వారాల తరబడి కఫం-దగ్గు తగ్గకపోతే ఒక్కసారి కళ్లె పరీక్ష చేయించుకోవటం మంచిది.దగ్గుకి మంచి మందు క్యాబేజీ. క్యాబేజీ ఆకులని నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసం తీసి తాగినా దగ్గు మాయం.రసాన్ని నేరుగా తాగలేకపోతె చిటికెడు పంచదార కలుపుకోవచ్చు.తీవ్రతని బట్టి 2-3 సార్లు తీసుకోవచ్చు.దగ్గు ఎక్కువగా రాత్రిళ్ళు బాధిస్తుంది కాబట్టి పడుకోబోయేముందు ఒకసారి తప్పకుండా తాగాలి. దగ్గుకి ఇంకొక మందు కరక్కాయ. రాత్రిళ్ళు బుగ్గన పెట్టుకుని పడుకున్నా దగ్గు రాదు. ధనియాలు, మిరియాలు, అల్లాన్ని కషాయంగా చేసి తాగితే కూడా దగ్గు తగ్గుతుంది, లవంగం బుగ్గన పెట్టుకున్నాదగ్గు తగ్గుతుంది. తేనె చాలా ఉపయోగకరం. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ పరిశోధకులు గుర్తించారు. రాత్రి పడుకునే ముందు ఒకటి లేదా రెండు చెంచాల తేనె తాగిస్తే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి మంచి ఉపశమనం కలుగుతుందని వీరి తాజా అధ్యయనాల్లో తేలింది. ఇది సమర్థమైన ప్రత్యామ్నాయ పద్ధతి అని పరిశోధకులు అంటున్నారు. విటమిన్ సి, ఫ్లావనాయిడ్ల నుండి ఉత్పత్తయిన యాంటీ ఆక్సిడెంట్లు తేనెలో దండిగా ఉంటాయని వారు గుర్తు చేస్తున్నారు. శరీరంలో తీపిని నియంత్రించే నాడులకు దగ్గును నియంత్రించే నాడులకు దగ్గరి సంబంధం ఉండటంవల్ల తేనెలోని తియ్యదనం దగ్గును తగ్గించేందుకు తోడ్పడుతుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. సొంటి కషాయంలోగాని లేక అల్లం రసంలోగాని తేనె తీసుకుంటే దగ్గు, ఆయాసం, జలుబు, కఫం తగ్గుతాయి. అడ్డ సరపాకుల రసంలో తేనె కలిపి రోజుకు 5 నుండి 10 మి.లీ. వరకు 3 లేక నాలుగు సార్లు తీసుకున్నా దగ్గు, ఆయాసం తగ్గుతుంది. ఉసరికపండ్లను పాలతో ఉడకబెట్టి ఎండించి పొడి చేసి దానిని 1/4గ్రా. నుండి 1/2గ్రా. మోతాదులో పుచ్చుకుంటే ఎలాంటి దగ్గయినా తగ్గును. ట పిప్పళ్ళను నీళ్ళతో మెత్తగా నూరి నువ్వులనూనెలో వేయించి తీసి, పటిక కలిపి కషాయంతో కలిపి తీసుకుంటే కఫముతో కలిపి వస్తున్న దగ్గు తగ్గుతుంది. తాని కాయలపొడిని తేనెతోగాని, తమల పాకుల రసంతోగాని, తులసి రసంతోగాని 1/4 నుంచి 1/2 గ్రాము మోతాదులో పుచ్చుకుంటే కఫముతో కూడిన దగ్గు తగ్గుతుంది. పటికిబెల్లం పొడిలో కలిపి తీసుకుంటే పొడిదగ్గు తగ్గుతుంది ఉమ్మె త్తాకులను ఎండించి చుట్టవలెచుట్టి దాని పొగతాగితే దగ్గు, ఆయాసం తగ్గుతాయి. నేల ఉసిరిక రసాన్ని పంచదార కలిపి పుచ్చుకుంటే ఆయాసం తగ్గుతుంది. పిప్పళ్లపొడి, బెల్లం, సమభాగాలుగా తీసుకుని సేవిస్తే దీర్ఘకాలంగా వున్న దగ్గులు, ఆయాసం తగ్గు తాయి. ఒక కప్పు గోరువెచ్చటి నీళ్లలో సగం టీ స్పూన్ పసుపు, సగం టీ స్పూన్ ఉప్పు కలిపి, ఆ నీళ్లని పుక్కిలించి ఉమ్మివేయటం వల్ల దగ్గు తగ్గుతుంది. కోరింత దగ్గు పటిక బెల్లం రాత్రుళ్ళు బుగ్గన పెట్టుకుంటే దగ్గు నుండి ఉపసమనం కలుగుతుంది17 ఏప్రిల్, 2007 ఈనాడు లో వచ్చిన వ్యాసం – తేనెతో తగ్గు దగ్గు!