ఊపిరితిత్తుల కాన్సర్ https://te.wikipedia.org/wiki/%E0%B0%8A%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2_%E0%B0%95%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D ఊపిరితిత్తుల క్యాన్సర్ (ఆంగ్లం: Lung cancer, లేదా lung carcinoma) ఊపిరితిత్తుల్లోని కణాలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల వచ్చే క్యాన్సర్. ఈ పెరుగుదల మెటాస్టాసిస్ అనే ప్రక్రియ ద్వారా కేవలం ఊపిరితిత్తులతోనే ఆగిపోకుండా చుట్టూ ఉన్న అవయువాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. సాధారణంగా ఊపిరితిత్తుల్లో ప్రారంభమయ్యే ప్రాథమిక ఊపిరితిత్తుల క్యాన్సర్ (primary lung cancers) లు కార్సినోమాలు (carcinomas). ఈ క్యాన్సర్లలో అధిక భాగం (సుమారు 85 శాతం) దీర్ఘకాలం పాటు పొగాకు సేవించే వారిలో కనిపిస్తాయి. 10–15% కేసుల్లో బాధితులు ఎప్పుడూ ధూమపానం చేయలేదు. 2012 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 18 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడగా అందులో సుమారు 16 లక్షలమంది మరణించారు. మగవారిలో కాన్సర్ మరణాలలో ఈ వ్యాధి మొదటి స్థానంలో ఉండగా, ఆడవారిలో రొమ్ము కాన్సర్ తర్వాత ఎక్కువ మంది ఈ వ్యాధి వలననే మరణిస్తున్నారు. ఎక్కువ శాతం వ్యాధి నిర్ధారణ 70 సంవత్సరాల వయసులో జరుగుతోంది.