జలుబు https://te.wikipedia.org/wiki/%E0%B0%9C%E0%B0%B2%E0%B1%81%E0%B0%AC%E0%B1%81 జలుబు లేదా పడిసం లేదా రొంప శ్వాసనాళం యొక్క పైభాగంలో వైరస్ దాడి చేయడం వల్ల కలిగే జబ్బు. ఇది ప్రధానంగా ముక్కు, గొంతు, స్వరపేటికను ప్రభావితం చేస్తుంది. వైరస్ సోకిన రెండు రోజుల లోపే దీని ప్రభావం మొదలవుతుంది. దీని లక్షణాలు కళ్ళు ఎరుపెక్కడం, తుమ్ములు, దగ్గు, గొంతు రాపు, ముక్కు కారడం, శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉండటం (ముక్కు దిబ్బడ), తలనొప్పి,, జ్వరము. ఇవి సాధారణంగా ఏడు నుంచి పది రోజులలో తగ్గిపోతాయి, కొన్ని లక్షణాలు మూడు వారాల వరకు ఉండిపోతాయి. ఇది మిగతా ఆరోగ్య సమస్యలతో కలిసి న్యుమోనియాగా మార్పు చెందవచ్చు. జలుబు 200 లకు పైగా వైరస్‌ ల వల్ల రావచ్చు. వీటిలో రైనోవైరస్‌లు అత్యంత సాధారణమైనవి. వాతావరణంలో ఉండే ఈ వైరస్ దేహంలోకి ప్రవేశించినపుడు, జలుబుతో బాధపడుతున్న వ్యక్తి ఉపయోగించిన తువ్వాళ్ళు, చేతి రుమాలు వంటివి వాడటం వల్ల జలుబు వ్యాపిస్తుంది. పిల్లలు బడికి వెళ్ళినపుడు, సరిగా నిద్రపోనప్పుడు, మానసిక ఒత్తిడి లాంటి పరిస్థితుల్లో ఇది సులభంగా వ్యాపిస్తుంది. జలుబు లక్షణాలు వైరస్ లు కణజాలాన్ని నాశనం చేయడం వల్ల కాకుండా శరీరంలోని వ్యాధినిరోధక వ్యవస్థ ఆ వైరస్ లను ఎదుర్కోవడానికి చేసే ప్రయత్నం వల్లనే కలుగుతాయి. ఇన్ ఫ్లూయెంజా వచ్చిన వ్యక్తులు కూడా ఇలాంటి లక్షణాలే కనబరుస్తారు కానీ ఇంతకన్నా ఎక్కువగా ఉంటాయి. జలుబుకు ఎలాంటి టీకా (వ్యాక్సీన్) లేదు. నివారణకు ప్రధాన ఉపాయం చేతులు కడుక్కోవడం; అశుభ్రమైన చేతులు కళ్ళలో, ముక్కులో, నోట్లో పెట్టుకోకపోవడం; జబ్బుగా ఉన్నవారి నుంచి దూరంగా ఉండటం. ముఖానికి తొడుగులు ధరించడం వల్ల కూడా కొంత వరకు ప్రయోజనం ఉండవచ్చని కొన్ని పరిశోధనలు నిర్ధారించాయి. శాస్త్రీయంగా జలుబుకు విరుగుడు కూడా ఏమీ లేదు. ఏ మందులు వాడినా జలుబు వల్ల కలిగిన లక్షణాలకు చికిత్స చేయడం వరకే. ఇబుప్రొఫేన్ లాంటి యాంటి ఇన్ ఫ్లమేటరీ డ్రగ్స్ నొప్పిని తగ్గించడానికి సహాయపడవచ్చు. యాంటీబయోటిక్ మందులు అసలు వాడకూడదు. దగ్గు మందులు కూడా ఎటువంటి ప్రయోజనం చూపించడం లేదని నిర్ధారణ అయింది. జలుబు మానవుల్లో అతి సాధారణమైన వ్యాధి. వయసులో ఉన్నవారు సంవత్సరానికి సగటున రెండు నుంచి నాలుగు సార్లు జలుబు బారిన పడుతుంటారు. అలాగే పిల్లలకు సగటున ఆరు నుంచి ఎనిమిది సార్లు జలుబు చేస్తుంటుంది. చలికాలంలో సర్వసాధారణం. ఈ సాంక్రమిక వ్యాధి మానవుల్లో చాలా పురాతన కాలం నుంచి ఉంది. దగ్గు, కారుతున్న ముక్కు, ముక్కు దిబ్బడ, గొంతు రాపు జలుబు ప్రధాన లక్షణాలు. కొన్నిసార్లు కండరాల నొప్పి, అలసట, తలనొప్పి,, ఆకలి లేకుండా ఉండటం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. గొంతు రాపు దాదాపు 40% రోగుల్లో, దగ్గు సుమారు 50% రోగుల్లో కనిపిస్తుంది. కండరాల నొప్పి మాత్రం అందులో సగం మందిలో కనిపించవచ్చు. యుక్తవయస్కులలో జ్వరం కనిపించదు కానీ పిల్లల విషయంలో మాత్రం ఇది సాధారణం. ఇన్ ఫ్లూయెంజాతో కూడుకుని ఉండకపోతే తేలికపాటి దగ్గు ఉంటుంది. యుక్తవయస్కుల్లో దగ్గు, జ్వరం కనిపిస్తుంటే దాన్ని ఇన్ ఫ్లూయెంజాగా అనుమానించవచ్చు. జలుబును కలిగించే అనేకమైన వైరస్ లు ఇతర ఇన్ ఫెక్షన్లకు కూడా కారణం కావచ్చు. ముక్కునుంచి కారే శ్లేష్మం (చీమిడి) పసుపు, పచ్చ లాంటి రంగుల్లో ఉండవచ్చు. దీన్ని బట్టి జలుబు ఏ వైరస్ వల్ల వచ్చిందో చెప్పలేము. జలుబు సాధారణంగా అలసట, శరీరం చలితో వణకడం, తుమ్ములు, తలనొప్పితో ప్రారంభమై రెండు రోజుల్లో ముక్కు కారడం, దగ్గు మొదలవుతుంది. ఈ లక్షణాలు వైరస్ బారిన పడ్డ 16 గంటలలోపు బయటపడతాయి. మరో రెండు మూడు రోజుల్లో తీవ్ర స్థాయికి చేరుకుంటాయి. సాధారణంగా ఇవి 7 నుంచి పది రోజుల్లో ఆగిపోతాయి కానీ కొంతమందులో మూడు వారాలవరకు ఉండవచ్చు. దగ్గు సగటున 18 రోజుల దాకా ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో వైరస్ ప్రభావం పోయినా దగ్గు ఎక్కువ కాలం ఉంటుంది. 35%-40% పిల్లల్లో దగ్గు 10 రోజులకంటే ఎక్కువ ఉంటుంది. 10% పిల్లల్లో 25 రోజులకన్నా ఎక్కువ రోజులు ఉంటుంది. శ్వాసనాళిక పైభాగం వైరస్ బారిన పడడమే జలుబు. సర్వసాధారణంగా రైనో వైరస్ (30%–80%) ఇందుకు ప్రధాన కారణం. ఇది పికోర్నా వైరస్ అనే జాతికి చెందినది. ఇందులో 99 రకాల సెరోటైప్స్ ఉన్నాయి. దీని తర్వాతి స్థానంలో కొరోనా (≈15%) అనే వైరస్ ఉంది. ఇంకా ఇన్ ఫ్లూయెంజా వైరస్ (10%–15%, అడినో వైరస్ (5%, హ్యూమన్ రెస్పిరేటరీ సింసిటల్ వైరస్, ఎంటిరో వైరస్, హ్యూమన్ పారా ఇన్ ఫ్లూయెంజా వైరస్, మెటా న్యూమోవైరస్ లు కూడా జలుబుకు కారణం కావచ్చు. తరచుగా ఒకటి కంటే ఎక్కువ వైరస్ లు కూడా కారణం కావచ్చు. మొత్తం మీద జలుబు రావడానికి 200 కి పైగా వైరస్ లు కారణమవుతున్నాయి. జలుబు సాధారణంగా గాలితుంపరల ద్వారా, ముక్కునుంచి కారిన వ్యర్థాలను తాకడం ద్వారా, కలుషితమైన వస్తువులను ముట్టుకోవడం ద్వారా సంక్రమిస్తుంది. ఇందులో ఏది ప్రధానమైన కారణమో ఇప్పటిదాకా నిర్ధారించలేదు. కానీ గాలి తుంపరల కన్నా చేతుతో ముట్టుకున్నప్పుడే ఎక్కువ వ్యాపిస్తుందని తెలుస్తున్నది. ఈ వైరస్ లు వాతావరణంలో చాలాసేపు ఉంటాయి. రైనో వైరస్ లు దాదాపు 18 గంటలపైనే ఉంటాయి. తరువాత వ్యక్తుల చేతికి అంటుకుని వాళ్ళ కళ్ళ దగ్గరకి గానీ, ముక్కు దగ్గరకి గానీ చేరి అక్కడ నుంచి వ్యాపించడం మొదలుపెడతాయి. బాలబడుల్లో, పాఠశాలల్లో పిల్లలు ఒకరినొకరు ఆనుకుని కూర్చోవడం వల్ల, పిల్లలకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల, శుభ్రత పెద్దగా ఉండకపోవడం వల్ల సంక్రమించడం ఎక్కువగా ఉంటుంది. ఇవి వాళ్ళు ఇంటికి రాగానే కుటుంబ సభ్యులకు అంటుకుంటాయి. విమానాల్లో ప్రయాణించే టపుడు ఒకే గాలి మళ్ళీ మళ్ళీ ప్రసరిస్తున్నపుడు జలుబు సంక్రమించడానికి కారణం అవుతున్నట్లు ఇంకా ఏ ఆధారమూ లేదు. దగ్గరగా కూర్చున్న వ్యక్తులకు సులువుగా సంక్రమిస్తుంది. రైనో వైరస్ ల వల్ల వచ్చే జలుబు లక్షణాలు కనిపించిన మొదటి మూడు రోజులు ఎక్కువగా సంక్రమిస్తాయి. తరువాత నుంచి సంక్రమణం కొద్దిగా మందగిస్తుంది. సాంప్రదాయ వాదం ప్రకారం ఎవరైనా చలి, వాన లాంటి చల్లటి వాతావరణంలో ఎక్కువ సేపు గడిపితే పడిశం పట్టుకుంటుందని భావిస్తూ వచ్చారు. జలుబుకు కారణమయ్యే వైరస్ లు ఎక్కువగా చలికాలంలోనే ఎక్కువ కనిపిస్తాయి. చలికాలం లోనే ఎందుకు వస్తుందనే విషయం ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. చల్లటి వాతావరణం శ్వాస వ్యవస్థలో కలగజేసే మార్పులు, వ్యాధి నిరోధక శక్తిలో తగ్గుదల, వాతావరణంలో తేమ తక్కువగా ఉండటం వల్ల వైరస్ సులభంగా సంక్రమించడం, గాలిలో ఎక్కువ దూరం వ్యాపించడమే కాక, ఎక్కువ సేపు నిలవ ఉండటం మొదలైన కారణాలు చూపవచ్చు. చలికాలంలో కుటుంబ సభ్యులు ఎక్కువగా ఇంట్లోనే ఉండటం, జబ్బు చేసిన వారి సమీపంలో ఉండటం, , ముఖ్యం బడిలో పిల్లలు దగ్గరగా కూర్చోవడం లాంటి సామాజిక అవసరాలు కూడా కారణం కావచ్చు. శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల జలుబు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉందనే విషయం పై చిన్న వివాదం ఉంది. కానీ అలా జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉందని ఆధారాలున్నాయి. పిల్లల్లో శ్వాస సంబంధిత వ్యాధులు సంక్రమించడం ఎక్కువ. ఎక్కువ సార్లు వైరస్ బారిన పడటం వల్ల మనుషుల్లో కొంచెం తట్టుకునే గుణం వస్తుంది. దీని వల్ల సమాజంలో వైరస్ వ్యాప్తి చెందడం తక్కువగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం కూడా జలుబుకు అనుకూలమే. నిద్రలేమి, సరైన పోషణ లేకపోవడం లాంటి కారణాల వల్ల కూడా వ్యాధినిరోధక శక్తి తగ్గి రైనో వైరస్ బారిన పడే అవకాశాలున్నాయి. తల్లిపాలు తాగడం వల్ల చిన్న పిల్లల్లో శ్వాస సంబంధిత వ్యాధులు రావడానికి అవకాశం తక్కువగా ఉంటుంది, అందుకే శిశువుకు జలుబు చేసినప్పుడు కూడా పాలు పట్టడం ఆపవద్దని వైద్యులు సలహా ఇస్తారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పాలు పట్టడం అనేది జలుబుకి నివారణగా భావించడం లేదు. శరీరంలో ప్రవేశించిన వైరస్ ను ఎదుర్కోవటానికి శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ స్పందన వల్లనే జలుబు లక్షణాలు కలుగుతాయి. ఈ స్పందన వైరస్ ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు రైనోవైరస్ నేరుగా తాకడం వల్ల సంక్రమిస్తుంది. తరువాత ICAM-1 రిసెప్టర్ల ద్వారా వాపును కలిగించే కణాలను విడుదల చేసేలా చేస్తాయి. ఈ కణాలే జలుబు లక్షణాలను కలుగజేస్తాయి. ఇవి సాధారణంగా ముక్కు లోపలి ఉపరితలానికి హాని చెయ్యవు. రెస్పిరేటరీ సింకిషియల్ వైరస్ (Respiratory Syncytial Virus - RSV) కూడా నేరుగా తాకడం వల్ల, గాలి కణాల వల్ల సంక్రమిస్తుంది. ఇది ముక్కులోకి, గొంతులోకి చేరగానే తనంతట తానుగా అభివృద్ధి చెంది క్రమంగా శ్వాసనాళిక కింది భాగంలోకి కూడా వ్యాపిస్తుంది. RSV ఉపతలానికి హాని చేస్తుంది. మనుషుల్లో వచ్చే పారాఇన్ ఫ్లూయెంజా వైరస్ ముక్కు, గొంతు, వాయునాళాల్లో వాపును కలుగజేస్తుంది. చిన్నపిల్లల్లో ఇది శ్వాసనాళం మీద దాడి చేసినప్పుడు, వారిలో ఆ మార్గం చిన్నదిగా ఉండటం మూలాన విలక్షణ శబ్దంతో (గొర్రె అరుపు) కూడిన దగ్గు వస్తుంది. ముక్కు, గొంతు లేదా ఊపిరితిత్తులలో జలుబు లక్షణాలు ఎక్కడ కేంద్రీకృతమై ఉన్నాయనేదాన్ని బట్టి వైరల్ ఇన్ఫెక్షన్ లో తేడాను గుర్తించవచ్చు. కానీ ఈ లక్షణాలు ఒకదాని కంటే ఎక్కువ చోట్ల కూడా కేంద్రీకృతమై ఉండవచ్చు. జలుబును తరచుగా ముక్కు వాపు, గొంతు వాపుగా భావిస్తుంటారు. జలుబు చేసినపుడు అది సోకిన వ్యక్తి సులభంగా గుర్తు పట్టగలడు. వైరస్ ను వృద్ధి చేసే కారకాల్ని వేరు చేయడం కానీ, లక్షణాలను బట్టి వైరస్ రకాన్ని కనుగొనడం కానీ సాధ్యం కాదు. చేతులు కడుక్కోవడం, ముఖానికి మాస్కులు వాడటం లాంటి చర్యల వలన మాత్రమే జలుబును వ్యాప్తి చెందకుండా కొంతమేర ఆపవచ్చు. వైద్యశాలల్లో సురక్షితమైన గౌన్లు వాడకం, ఒకసారి వాడి పారేసే చేతితొడుగులు వాడటం లాంటి చర్యలు తీసుకుంటారు. వ్యాధి సోకిన వ్యక్తిని ఎవరికీ అందుబాటులో దూరంగా ఉంచడం లాంటి వాటి వల్ల పెద్దగా ప్రయోజనం లేదు, ఎందుకంటే ఇది చాలా రకాలుగా వ్యాపిస్తుంది. జలుబుకు కారణమయ్యే వైరస్ లు చాలా రకాలు ఉండటం వల్ల, వైరస్ లు తొందరగా తమ రూపాన్ని మార్చుకునే శక్తి ఉండటం వల్ల దానికి టీకా మందు తయారు చేయడం కూడా దుస్సాధ్యమే. అన్ని రకాల వైరస్ లను తట్టుకునే వ్యాక్సీన్ తయారు చేయాలంటే వైద్యపరంగా కష్టమైన పని. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం జలుబును అరికట్టడంలో (ముఖ్యంగా పిల్లల్లో) ప్రధాన పాత్ర పోషిస్తున్నది. సాధారణంగా వాడే సబ్బుల్లో, ద్రావకాల్లో ఆంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్స్ ని కలపడం వల్ల ప్రయోజనం ఉందా లేదే అనేది తేలలేదు. జలుబుతో బాధపడుతున్న వారు చుట్టూ ఉన్నప్పుడు ముఖానికి మాస్కు తగిలించుకోవడం వల్ల ఉపయోగం ఉంది. కానీ ఎల్లప్పుడు అలా దూరాన్ని పాటించడం వల్ల జలుబును కచ్చితంగా రాకుండా మాత్రం ఆపలేము. జింకుతో కూడిన సప్లిమెంట్లు జలుబును నివారించడంలో కొద్దిగా సహాయడతాయి. తరచుగా తీసుకునే విటమిన్ సి సప్లిమెంట్లు జలుబు రావడాన్ని, తీవ్రతను ఆపలేవు కానీ దాని కాలపరిమితిని మాత్రం తగ్గించగలదు. నీళ్ళను పుక్కిలించడం వల్ల కూడా ఉపయోగకరమైనదని కొన్ని పరిశోధనల్లో తేలింది. ఏ మందులూ, మూలికలూ జలుబు కాలపరిమితిని కచ్చితంగా తగ్గించినట్లు నిరూపణ కాలేదు. చికిత్స కేవలం లక్షణాలను ఉపశమింపజేయడం కోసమే. బాగా విశ్రాంతి తీసుకోవడం, శరీరంలో నీటి శాతం తగ్గకుండా ద్రవపదార్థాలు సేవించడం, వేడి నీళ్ళలో ఉప్పు కలిపి పుక్కిలించడం లాంటి చర్యలు కొంతమేరకు జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కానీ చికిత్స వల్ల నయమనిపించడానికి చాలావరకు కారణం ప్లాసిబో ఫలితం. నొప్పి నివారించే మందులు (అనాల్జెసిక్స్), ఇబుప్రొఫేన్, పారాసిటమాల్ లాంటి జ్వరాన్ని నివారించే (యాంటిపైరెటిక్) మందులతో జలుబు లక్షణాలకు చికిత్స చేస్తారు. దగ్గు మందుల వాడకం వల్ల ప్రయోజనం ఉన్నట్లు రుజువులు లేవు. వాటిని జలుబు మీద అవి ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు సాక్ష్యాలు లేకపోవడం వల్ల, హాని చేస్తున్నట్లు కొన్ని ఆధారాలు లభ్యమవడం వల్ల చాలామంది వైద్యులు పిల్లలకు వాడమని చెప్పడం లేదు. ఈ కారణం వల్లనే 2009 లో కెనడా దగ్గు మందులను, జలుబు మందులను ఆరు సంవత్సరాలకంటే చిన్నపిల్లలకు ప్రిస్క్రిప్షన్ లేనిదే అమ్మకుండా నిషేధించింది. డెక్స్ట్రోమిథోర్ఫాన్ (ఒక రకమైన దగ్గు మందు) ను దుర్వినియోగం చేస్తుండటంతో చాలా దేశాలు దీన్ని నిషేధించాయి. పెద్దవారిలో యాంటీహిస్టామిన్ మొదటి రెండు రోజుల్లో జలబు లక్షణాలను కొంతమేరకు ఉపశమింపజేస్తున్నట్లు గమనించారు కానీ దీర్ఘ కాలంలో దాని వల్ల ప్రయోజనం కనిపించలేదు పైగా అవి అలసటను కలుగజేస్తున్నట్లు గుర్తించారు. ముక్కు దిబ్బడను తొలగించే స్యూడోఎఫిడ్రిన్ లాంటి మందులు పెద్దవారిలో బాగా పనిచేస్తున్నట్లు తేలింది. ఇప్రాట్రోపియం స్ప్రే మందు ముక్కు బాగా కారుతున్నపుడు పనిచేస్తుంది కానీ ముక్కుదిబ్బడను మాత్రం తగ్గించలేదు. పరిశోధన పెద్దగా జరగకపోవడం వల్ల ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల జలుబు లక్షణాలు మెరుగుపడుతున్నట్లు, కాలపరిమితి తగ్గుతున్నట్లు పూర్తిస్థాయిలో నిరూపణ కాలేదు, అలాగే ఆవిరి పట్టడం గురించి కూడా సరైన సమాచారం లేదు. రాత్రిలో వచ్చే దగ్గు, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు, నిద్ర సరిగా పట్టకపోవడం లాంటి లక్షణాలు వేపోరబ్ ల ద్వారా కొంచెం ఉపశమిస్తున్నట్లు ఒక పరిశోధనలో తేలింది. యాంటిబయోటిక్స్ జలుబును కలిగించే వైరస్ ల పై ఎలాంటి ప్రభావం చూపవు. అవి కలిగించే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మేలు చేయకపోగా ఎక్కువ కీడే జరుగుతున్నది. కానీ ఇప్పటికీ వైద్యులు వీటిని వాడమనే చెబుతున్నారు. ఇందుకు కారణం జలుబుతో బాధ పడుతూ వైద్యుని దగ్గరకు వెళ్ళినపుడు వాళ్ళు ఏదో చేయాలని జనాలు కోరుకోవడం, కొంతమంది వైద్యుల అత్యుత్సాహం, అసలు యాంటిబయోటిక్స్ అవసరమా లేదా అనేది నిర్ధారించడం కష్టం కావడం. జలుబుపై ప్రభావవంతంగా పనిచేసే యాంటీ వైరల్ మందులు కూడా అందుబాటులో లేవు. దీనిపై పరిశోధన ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. జలుబు చికిత్స కోసం ఎన్నో ప్రత్యామ్నాయ చికిత్సలు ఉన్నప్పటికీ వాటిలో చాలా పద్ధతులు కచ్చితంగా పనిచేస్తున్నట్లు శాస్త్రీయమైన ఆధారాలు లేవు. 2014 వరకు తేనె సేవించడం జలుబుకు మంచిదా కాదా అనేది స్పష్టంగా నిర్ధారణ కాలేదు. నాసికా రంధ్రాలను శుభ్రం చేయడం ద్వారా ఫలితం కనబడుతున్నట్లు 2015 దాకా జరిగిన పరిశోధనలు తెలియజేస్తున్నాయి. జింకును చాలా రోజులుగా జలుబు లక్షణాలను ఉపశమింపజేయడానికి వాడుతూ వస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిలో జలుబు లక్షణాలు కనిపించిన 24 గంటలలోపు జింకును వాడితే జలుబు తీవ్రత,, కాలపరిమితిని తగ్గిస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. అయితే విస్తృతంగా జరిగిన పరిశోధనల ఫలితాల్లో తేడాలుండటం వలన జింకు ఏయే సందర్భాల్లో ప్రభావంతంగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి మరింత పరిశోధన అవసరం. జింకు మాత్రలు సైడ్ ఎఫెక్ట్స్ కు కారణం అవుతుండటం వల్ల, వైద్యులకు జింకును సూచించడానికి వెనుకాడుతున్నారు. జింకుతో కూడిన ఇంకో విధానంలో దాన్ని ముక్కు లోపల రాసినప్పుడు వాసన కోల్పోతున్నట్లు కూడా గ్రహించారు. జలుబుపై విటమిన్ సి ప్రభావం గురించి విస్తృతమైన పరిశోధనలు జరిగినా చలిప్రాంతాల్లో తప్ప ఫలితాలు అంత ఆశాజనకంగా లేవు. ఎకినాసియా అనే ఒక రకమైన మొక్కల నుంచి తయారు చేసిన మూలికలు కూడా జలుబు నివారణలోనూ, చికిత్స లోనూ ప్రభావం చూపిస్తున్నట్లు పరిశోధనల్లో కచ్చితంగా తేలలేదు. వెల్లుల్లి కూడా సరిగా పనిచేస్తుందో లేదో తెలియదు. విటమిన్ డి ఓ సారి ఇవ్వడం వల్ల కూడా ప్రయోజనం కనిపించలేదు. జలుబు సాధారణంగా స్వల్ప అస్వస్థతే. దాని లక్షణాలు సాధారణంగా వారం రోజులలోపే వాటంతట అవే తగ్గుముఖం పడతాయి. సగం కేసులు పది రోజుల్లో నయమవుతున్నాయి. తొంభై శాతం కేసులు 15 రోజుల్లో నయమవుతున్నాయి. పెద్దగా ఉపద్రవమంటే కేవలం మరో వృద్ధుల్లోనో, చిన్నపిల్లల్లోనో, వ్యాధి నిరోధక శక్తి బాగా తక్కువగా ఉన్నవారిలోనే కనిపిస్తుంది. జలుబు వల్ల కలిగే బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు సైనసైటిస్, ఫారింజైటిస్, చెవి ఇన్‌ఫెక్షన్ లాంటి సమస్యలకు దారి తీయవచ్చు. ఒకవేళ బ్యాక్టీరియల్ ఇంఫెక్షన్ అయితే 8 శాతం కేసుల్లో సైనసైటిస్, 30 శాతం కేసుల్లో చెవి ఇన్‌ఫెక్షన్ రావచ్చని ఒక అంచనా. జలుబు మానవుల్లో వచ్చే సర్వ సాధారణమైన వ్యాధి. ఇది ప్రపంచంలో ఎవరికైనా రావచ్చు. పెద్దవారిలో సంవత్సరానికి రెండు నుంచి ఐదు సార్లు, పిల్లల్లో ఆరు నుంచి పది సార్లు (బడి పిల్లల్లో అయితే పన్నెండు దాకా) వచ్చే అవకాశం ఉంది. వృద్ధుల్లో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జలుబు మానవుల్లో చాలా ప్రాచీనకాలం నుంచి ఉన్నప్పటికీ, కారణాలు మాత్రం 1950 నుంచి అన్వేషించడం మొదలైంది. జలుబు లక్షణాలకు చికిత్స గురించి సా.పూ 16 వ శతాబ్దానికి చెందిన అత్యంత ప్రాచీన ఈజిప్టు వైద్యగ్రంథమైన ఎబెర్స్ పాపిరస్ అనే గ్రంథంలో ప్రస్తావించబడి ఉంది. యూకేలోని మెడికల్ రీసెర్చి కౌన్సిల్ 1946 లో కామన్ కోల్డ్ యూనిట్ పేరుతో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఆ విభాగం 1956 లో రైనోవైరస్ ను కనుగొన్నది. 1970 వ దశకంలో ఈ విభాగమే రైనోవైరస్ మొదటి దశలో ఉన్నప్పుడు ఇంటర్ఫెరాన్లు అనే ప్రోటీన్ల ద్వారా కొంతమేరకు రక్షణ లభిస్తున్నట్లు నిరూపించింది, కానీ దాని నుంచి అనుభవయోగ్యమైన చికిత్సను మాత్రం రూపొందించలేకపోయారు. ఈ విభాగాన్ని వారు 1987 లో జింకు మీద పరిశోధన చేసి, రైనోవైరస్ వల్ల వచ్చే జలుబును నయం చేసే విధానం కనుగొన్న తరువాత 1989 లో మూసేశారు. జలుబును చికిత్స చేయడానికి ఈ విభాగం కనుగొన్న విజయవంతమైన విధానం ఇదొక్కటే. జలుబు కలిగించే ఆర్థిక ప్రభావం ప్రపంచంలో చాలా దేశాలు అర్థం చేసుకోలేదు. అమెరికాలో జలుబు వల్ల ఏటా సుమారు 7 కోట్ల నుండి పదికోట్ల సార్లు వైద్యుల దగ్గరకు వెళ్ళాల్సి వస్తోంది. ఇందుకు సుమారు 8 బిలియన్ డాలర్ల దాకా ఖర్చు పెడుతున్నారు. అమెరికన్లు జలుబు లక్షణాలను నివారించడానికి వైద్యులతో సంబంధం లేకుండా వాడే మందుల కోసం సుమారు 2.9 బిలియన్ డాలర్లు, వైద్యుల సలహా మేరకు వాడే మందుల కోసం 400 మిలియన్ డాలర్లు ఖర్చు పెడుతున్నారు. వైద్యుల దగ్గరికి వెళ్ళిన వారిలో మూడింట ఒక వంతు రోగులకు యాంటిబయోటిక్ మందులు వాడమని సలహా ఇస్తున్నారు. దీనివల్ల మానవుల్లో యాంటీబయోటిక్ నిరోధకత తగ్గిపోతోంది. ప్రతి సంవత్సరం 2-19 కోట్ల పాఠశాల దినాలు వృధా అవుతున్నట్లు ఒక అంచనా. దీని ఫలితంగా వారిని చూసుకోవడానికి తల్లిదండ్రులు 12.6 కోట్ల పనిదినాలు సెలవు పెడుతున్నారు. దీన్ని ఉద్యోగులకు వచ్చే జలుబు వల్ల కలిగే 15 కోట్ల పనిదినాలతో కలిపితే సంవత్సరానికి 20 బిలియన్ డాలర్లు నష్టం కలుగుతోంది. యాంటీవైరల్ మందులు జలుబుమీద ఎంతమేరకు పనిచేస్తాయని పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. 2009 దాకా జరిగిన పరిశోధనల ప్రకారం ఏవీ జలుబుపై ప్రభావం చూపినట్లు తెలియలేదు. వేటికీ అనుమతి ఇవ్వలేదు. పికోర్నా వైరస్ పై పనిచేయగల ప్లెకోనారిల్ (pleconaril) అనే మందుపైనా, BTA-798 పైనా ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ప్లెకోనారిల్ సేవించడంలో కలిగే ఇబ్బందులు, దాన్ని ఏరోసోల్ గా మార్చడం పై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. DRACO అనే యాంటీవైరల్ చికిత్స రైనోవైరస్ లు,, ఇతర సాంక్రమిక వైరస్ లపై పనిచేస్తున్నట్లు ప్రాథమిక పరిశోధనల్లో తేలింది. ఇప్పటి దాకా తెలిసిన రైనోవైరస్ ల జీనోమ్ క్రమాన్ని కనుగొన్నారు. ఓపెన్ డైరెక్టరీ ప్రాజెక్టులో జలుబు