నారికురుపు https://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B1%81%E0%B0%B0%E0%B1%81%E0%B0%AA%E0%B1%81 నీటి మూలమున వ్వాపించు వ్యాధులలో కలరా, సన్ని పాత జ్వరము (typhoid), గ్రహిణి విరేచనములు (dysentery) ముఖ్యమైనవి. తరువాత చెప్పుకోదగ్గది నారి కురుపు. నారి కురుపుకి కారణమైన పురుగు పై వ్యాధులలోని సూక్ష్మ జీవుల వలె గాక (అనగా, అతి సూక్ష్మమై కంటికి కనపడనిదిగా గాక) మూడడుగులు పొడుగు కలిగి, పేక దారము వలె స్పష్టముగ తెలియుచు, లాగిన కొలదిని పుండు నుండి బయటకు వచ్చుచుండును. ఈ పురుగు కూడా ఒక రోగి నుండి అనేకులకు నీటి మూలమున ప్రవేశించుట చేత ఈ వ్వాధిని కూడా అంటు వ్యాధులలో చేర్చవచ్చు. అనాది నుండియు నారి కురుపు ఆసియా, ఆఫ్రికా, అమెరికా ఖండములలో నున్నట్లు నిదర్శనములు ఉన్నాయి. ఇది ఉష్ణ ప్రదేసములలో హెచ్చుగ నుండును. మిక్కిలి శీతల ప్రదేశములగు ఐరోపా మొదలగు ఖండము లందు ఈ పురుగు మిక్కిలి అరుదు. ఈ పురుగును, ఏలుగు పాము, నులి పురుగు, మొదలగు మరి కొన్ని పురుగులను ఒక్క జాతిలోనివే. ఈ జాతి పురుగులలో ఆడు దాని కంటే మొగది ఎప్పుడును చిన్నదిగా నుండును. స్త్రీ సంబంధమైన అంగములు ఆడు దాని శరీర మద్యమునను, పురుష సంబంధమైన అంగములు మగ దాని తోక సమీపమున వుండును. ఆడుదాని గర్భ కోశము సామాన్యముగా శరీరము పొడుగున నొక గొట్టముగా నుండి క్రిక్కిరిసి యుండు పిల్లలతో నిండి యుండును. ఇవి తమకు కావలసిన ఆహారమును తమ పోషకుల సంపాదించి పెట్టు కొనిన దాలో నుండి సంగ్రహించుకొనుచు తామేమియు శ్రమ పడక వారల శరీరములో బ్రతుకు చుండును. ఇట్టి ప్రాణులకు పరాన్న భుక్కులు ( ) అని పేరు. నారి పురుగు మానవ శరీరములో చర్మము క్రిందను, కండల మధ్యనుండు సందుల యందును నివసించును. గుర్రము మొదలగు ఇతర జంతువులలో కూడా కొందరు దీనిని కని పెట్టి యున్నారు. హిందూ దేశము లోని కొన్ని స్థలములలో ఈ పురుగు ప్రజలలో రమారమి సగము మంది శరీరములో నుండును. సామాన్యముగ ఒక్కొక్క రోగిని ఒకటే పురుగు ఆశ్రయించి యుండును గాని కొందరికి నాలుగు, అయుదు చోట్ల యుండును. అరుదుగ 30 లేక 40 చోట్ల యందు కూడా ఈ పురుగు కనబడి యున్నది. ఆడ పురుగు మానవ శరీరములో ప్రవేశించిన తరువాత ఒక అడుగు మొదలు ఆరు అడుగుల వరకు పెరుగును. ఇది కొంచెము పసిమి వర్ణముగల తెలుపు రంగు కలిగి తలనుండి కొన వరకు గుండ్రముగా నుండును. ఇది అంగుళములో రమారమి 20 వ వంతు లావుగ నుండి పేక దారము వలె కనబడు చుండును. తల వద్ద నున్న భాగము కొంచెము సన్నగిలి తుండము (ముట్టె) వలే నేర్పదీని పొడుగు సగటున మూడడుగులుండును. తల వద్ద సన్నగిలి ముట్టెవలి తేలి యుండును. తోక వద్ద కొక్కెము వలె కొంచెము వంగి యుండును. పిల్లల పొడుగు అంగుళములో వెయ్యవ వంతుండును. ఈ తుండపు కొన యందు 21 పెద్దవియు 6 చిన్నవియు మొటిమ లుండును. శరీరము పొడుగునను సన్నని అడ్డు గీట్లుండును. ఈ పురుగు రబ్బరు వలె సాగు నట్టి స్వభావము గలదై వింటి నారి వలె నుండుట చే కాబోలు దీనికి నారి పురుగు అని పేరు వచ్చి యుండ వచ్చును. (నారి = విల్లునకు కట్టు త్రాడు). చర్మమునందు ఒక దాని మీద ఒకటి చొప్పున 6 పొరలు గలిగి సూక్ష్మ నిర్మాణమునందిది సామాన్యముగ ఏలుగు పామును బోలి యుండునని చెప్పవచ్చును. దీని తోక వద్ద నుండు భాగము తల వెంట్రుకంత సన్నముగ నుండి కొన యందు కొక్కెము వలె వంగి యుండును. దీని ఆహార కోశము నీటి నుండి తోక వరకు ఒకటే గొట్టముగ నుండును. గర్భ వతి అయినపుడు మిక్కిలి పెద్దది యై లోపల నుండి ఎత్తి కొని వచ్చు గర్భ కోశము చేత పురుగు చిన్నదిగ నుండునపుడు తెరచి యుండు ఆసన మార్గము మూసికొని పోవును. తల నుండి తోక వరకు వ్యాపించి యుండు దీని గర్భ కోశములో లక్షల కొలది పిల్లలు చుట్టలు చుట్టుకొని యుండును. ఈ పిల్లలు అంగుళములో 1000 వంతు పొడుగను, పొడుగులో రమారమి 20 వ వంతు లావును కలిగి కొంచెము బల్లపరుపుగ నుండును. ఈ పిల్లల తోకలు మిక్కిలి సన్నమై మొత్తము పొడుగులో సగము వరకు నుండును. ఇవి మిక్కిలి చురుకుగ ఈదుచు మురికి నీటిలో గాని తడి మట్టిలో గాని అనేక దినముల వరకు నివసింపగలవు. నారి కురుపు వ్యాపకముగల గ్రామములలో నుండు చెరువులలోను, నూతులలోను, ఈ పురుగు పిల్లలు సామాన్యముగ కాన వచ్చును. ఇవి పొడి నేలలో కూడా 6 గంటలు మొదలు 24 గంటల వరకు బ్రతుక గలవు. ఇవి మన శరీరములో ప్రవేశించినది మొదలు బయట కురుపుగా తేలు వరకు మూడు లేక ఆరు మాసములు పట్టును. తల్లి నారి పురుగు యుక్త వస్సు వచ్చిన వెంటనే తలతో దారిని దొలుచు కొనుచు సామాన్యముగా క్రింది భాగమునకు అనగా పాదము లోనికి గాని చీల మండ లోనికి గాని కాలి లోనికి గాని దిగును. ఇక్కడ చర్మములో ఎక్కడ కైనను ఒక రంద్రమును లోపల నుండి తొలుచు కొనుచు వచ్చి మన శరీరముపై నుండు ఒక్క పలుచని పొరను మాత్రము చీల్చకుండ పై కప్పుగా బెట్టుకొనును. ఈ పొర లోపల నొక బొబ్బ ఏర్పడి అది కొద్ది దినములలో పగిలి పుండగును. ఈ పుండు యొక్క మధ్య భాగమున మిక్కిలి సన్నని రంధ్రమొక్కటి కనపట్టును. ఒకా నొకప్పుడు ఈ రంధ్రము గుండ చొరచు కొని నారి పురుగు యొక్క తల కూడా కొద్దిగ కనపడు చుండ వచ్చును. తల బయటకు కనపడు చుండినను, లేక పోయినను ఈ పుండు మీద కొంచెము చల్లని నీటిని పోసిన యెడల ఒక విధమైన తెల్లని ద్రవ పదార్థము చిన్న రంధ్రము గుండ ఊరునట్లు బయటకు పొంగును. ఒకానొకప్పుడు రమారమి అర అంగుళము పొడగు గల తెల్లని గొట్ట మొకటి ఈ రంధ్రము గుండ బయటకు వచ్చును. పిమ్మట ఈ చిన్న గొట్టము పగిలి దీనిలో నుండు పదార్థము పుండు మీద పడును. మనము చన్నీళ్లను పుండు మీద పోసినప్పుడు బయటకు వచ్చి చిన్న గొట్టము నారి పురుగు యొక్క గర్భతిత్తి యందలి భాగమే. ఇట్లు పుండులో నుండి బయట పడు ద్రవ పదార్థమును కొంచె మెత్తి సూక్ష్మ దర్శినితో పరీక్షించిన యెడల దీనియదార్థము తెలియగలదు. సూక్ష్మ దర్శినిలో నారి పురుగు పిల్లలు గిలగిల కొట్టుకొను కిక్కిరిసి యున్నవి కనబడును. ఈ ప్రకారము అప్పుడప్పుడు ఈ గ్రుడ్లు బయలు పడుచు 15 దినముల నాటికి గర్భ తిత్తిలో నుండు గ్రుడ్లన్నియు వెలుపలు వచ్చి వేయును. ఇంతట తల్లి నారి పురుగు తనంటట గానే ఒకానొకప్పుడు అకస్మాత్తుగను మరి యొకప్పుడు మెల్లమెల్లగను మానవ శరీరమును విడిచి వేయును. దినమునకు 5, 6 సార్లు కొంచెము కొంచెముగ మెల్ల మెల్లగ తెగి పోకుండ లాగుచు వచ్చిన యెడల కొన్ని పురుగులు ఒకటి రెండు దినములలోనే బయట పడును. నారి పురుగునకు చల్లని నీటి యందు ఆశ మెండు. అందు చేతనే ఇది సాధారణముగా కాళ్ళలోనికి దిగును. ఏలయన నడుచు నప్పుడును, కాళ్ళు కడుగు కొను నప్పుడును అక్కడ నీళ్లు దొరుకునని దానికి తెలియును. నీటి సహాయము లేని యడల తమ గ్రుడ్లు బ్రతుక లేవని కూడా దానికి తెలియును. అందు చేతనే చన్నీళ్లు దొరికిన తోడనే ఇది గ్రుడ్లను విడిచి పెట్టుటకు సిద్ధముగా నుండును. నీళ్ల బిందెలను భుజముల మీద మోయు వార్ల శరీరములో ఒకానొకప్పుడీ నారి కురుపు భుజముల వద్ద పైకి తేల వచ్చును. కాని ఇతర స్థలములలో ఇది బయట పడుట మిక్కిలి అరుదు. ఈ వ్యాధి పిల్లలను పెద్ద వారలను అన్ని జాతుల వారలను నారి పురుగున కనుకూలమగు స్థితి గతులేర్పడినప్పుడు సమానముగ నంటును. అనగా ఒక చెరువు లోని నీటి యందు ఈ వ్వాధి వ్వాపించుటకు తగిన కారణముండిన యెడల ఆనీటిని త్రాగు అన్ని జాతుల వారికిని భాగ్యవంతులకును, బీద వారలకును పెద్దలకును పిల్లలకును వాని కురుపు ఒకటే రీతిగ అంటును. ఈ పురుగు బయటికి రాక పూర్వము కొందరికి దద్దురులు, వాంతులు, దురదలు మొదలగు గుణములు కలుగ వచ్చును. పిమ్మట కొన్ని దినములకు శరీరములో ఎక్కడో ఒక్క చోట చర్మము క్రింద నొక్క త్రాడు ఉన్నట్లుగా తోచ వచ్చును. సామాన్యముగా చర్మము క్రిందికి ఈ పురుగు చేరు వరకును ఇది మన శరీరములో నున్నట్లు మనకు తెలియనే తెలియదు. ఇది సాధారణముగా కాళ్ల లోనికి దిగునని వైన చెప్పియుంటిమి కాని నడుము మీదను జననేంద్రియముల మీదను చేతుల మీదను నాలుక మీదను కను రెప్పల మీదను కూడా నీ పురుగు కాన వచ్చు చున్నది. ఒకా నొకప్పుడు ఒకటి గాని అనేకములు గాని కురుపులు పొడుగన ఈ పురుగున్నంత దూరము పుట్టుట గలదు. ఒక్కొకప్పుడు ఈ కురుపులలో చీము పట్టి ఆ యా భాగములు చచ్చి పోయి కాళ్లు చేతులు తెగ గొట్ట వలసి వచ్చును. ఒక్కొకప్పుడు ప్రాణ హాని కూడా కలుగ వచ్చును. ముఖ్యముగ అతి మూత్ర వ్యాధి కలవారలు ఈ పురుగు అంటిన ఎడల మిక్కిలి అపాయకర మగును. కాళ్లు చేతులు, క్రుళ్లి చచ్చి పోవును. బల వంతముగ లాగి నారిని త్రెంపిన యెడల పిల్లలన్నియు చెదరి పోయి జ్వరము, అధికమైన బాధ మొదలగు చిహ్నములతో పెద్ద కురుపేర్పడి హెచ్చుగ పీడింప వచ్చును. ఒకానొకప్పుడు పురుగు చర్మము పైకి తేలక మునుపే తనంతట కానే చచ్చి పోవచ్చును. అట్టి సమయములలో అది లోపల మిగిలి పోయినను అపాయము లేదు. నారి కురుపు వచ్చిన వారలకు సాధారణముగా చికిత్స అక్కర లేకయే పురుగు బయట పడి మాని పోవచ్చును. కాని అప్పుడప్పుడు చన్నీళ్లతో తడిపిన పరిశుభ్రమైన మెత్తని గుడ్డను పుండు మీద వేసి దాని పైని లేత అరిటాకు గాని, మెత్తని ఎండు తామరాకును గాని వేసి కట్టు తడి గుడ్డ ఆరిపోకుండ మార్చు చుండుట మంచిది. ఇట్లు చేయుచు కొద్ది కొద్దిగ నారిని బయటకు లాగిన యెడల పురుగు అంతయు శీఘ్రముగ వెలువడ వచ్చును. లేదా అప్పుడప్పుడు పుండు మీద చన్నీళ్లు కొట్టు చుండిన చాలును. కొందరు చీపురు పుల్లను గాని వెదుర్ఫు పుల్లను గాని ఒక కొనయందు రెండుగా చీల్చి అచీలకలో నారి యొక్క నొనను దూర్చి నారినంతను పుల్ల చుట్టు మెల్లగ చుట్టి పెట్టుదురు. ప్రతిదినమును కొంచెము కొంచెముగా నీడ్చుచు పుల్లకు చిట్టి పెట్టుచు కొన్ని దినములలో పురుగు నంతను బయటకు లాగి వేయుదురు. కురుపు తేలక బాధ యెత్తు చున్నప్పుడు బోరిక్ పవుడర్ వేసి కాచిన నీళ్లతొ పిండిన వేడి వేడి గుడ్దతో అప్పుడప్పుడు వత్తు చుండ వచ్చును. లేదావేడి నీళ్లలోముంచి పిండిన బోరిక్ లింటును వెచ్చ వెచ్చగ వేసి కట్టవచ్చును. ఉమ్మెత్త ఆకులను వెచ్చ జేసి కట్టిన కూడా నొప్పి హరించును. నూరిన ఉమ్మెత్తాకులను సరికి సరిగావరి పిండియు కలిపి నీటితో ముద్దగా నుడికించి ఇది వేసి కట్టవచ్చును. నారి పురుగునకు సహజముగ నీటి యందభిలాష అధిమనియు నీటి యొక్క సంపర్కము కలిగినప్పుడు ఇది తన పిల్లలను వేగముగ బయటికి విడిచి వేయుననియు పైన చదివి యున్నాము. నీరు లేని చోట్ల అనగా పొడి నేలల యందు ఈ పురుగు పిల్లలు మిక్కిలి సులభముగా చచ్చి పోవును. సామాన్యముగా నారి పురుగు పిల్లలు నీటిలో పడిన వెంటనే ఆనీటి యందుండు మిక్కిలి సూక్ష్మములగు రొయ్య జాతి జంతువుల శరీరములోనికి చొచ్చుకొని పోయి వాని శరీరములో పెరుగును. ఈ జంతువులలో ప్రవేశించిన తరువాత నాలుగు వారములలో ఇవి రూప నిష్పత్తి చెంది అంగుళములో 20 వ వంతు పరిమాణము గలవి యగును. ఆ జంతువులు మనకు త్రాగు నీటితో పాటు మన కడుపులో పడి జీర్ణమై పోయినప్పుడు పురుగు పిల్లలు క్షయను పుట్టిచునవి, పొట్ట గోడ గుండ చొరుచుకొని ప్రయాణం చేసి మన శరీరములో చెమట వచ్చు రంద్రముల ద్వారా శరీరములోనికి ప్రవేశించు నని కొందరి అభిప్రాయము. ఒకానొక పరిశోధకుడు అరటి పండ్లలో నారి పురుగులను పెట్టి కొన్ని కోతులకు తీనిపించగా అందులో ఒక కోతికి తొడ మీద వాపును నొప్పియు ప్రారంభమయ్యెను. ఆకోతి అటు పిమ్మట తొమ్మిది మాసములలో చచ్చి పోయెను. ఆప్పుడు దాని తొడమీది కంతిని కోసి చూడగా సర్వ విధముల నారి పురుగును పోలి యుండిన పురుగు దానిలో కనపట్టి యుండెను. కాని దాని పొడుగు 16 అంగుళములు మాత్రమే యుండెను. ఈ నిదర్శనము వలన నారి పురుగు పిల్లలు మన ఆహార పదార్థముల మూలమున కూడా ప్రవేశింప వచ్చునని తోచు చున్నది. ఈ విషయమై ఇంకను శోధనుము చేయ వలసి యున్నది. ఎట్లయినను నారి కురుపుల వ్యాపకము గల ప్రదేశములో నివసించు వారలందరును తాము త్రాగు నీళ్లను మరగ కాచు కొని త్రాగవలెను. ఇట్లు చేయుటచే నీళ్లలోనారి పురుగు పిల్లలున్న యెడల చచ్చి పోవను. స్నానము చేయు నీళ్ళను కూడా సాద్యమైనంత వరకు మరగ కాచి చల్లార్చుకొనుటయే మంచిది. అంటువ్యాధులు రచయిత - ఆచంట లక్ష్మీపతి అను గ్రంథమునుండి గ్రహింప బడినది