బోదకాలు https://te.wikipedia.org/wiki/%E0%B0%AC%E0%B1%8B%E0%B0%A6%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81 బోదకాలు (Filariasis) సమస్య క్యూలెక్స్‌ రకం దోమ కుట్టటం వల్ల వస్తుంది.ఈ వ్యాధి ఫైలేరియా అనే సూక్ష్మక్రిమి ద్వారా సంక్రమిస్తుంది. ఇంటి పరిసరాల్లో ఉన్న మురుగునీటిలో గుడ్లు పెట్టి వృద్ధి చెందే క్యూలెక్స్‌ దోమ ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలోని 'మైక్రోఫైలేరియా' క్రిములు మన శరీరంలో ప్రవేశించి మన లింఫ్‌ నాళాల్లో పెరిగి పెద్దవవుతాయి. అవి లింఫ్‌ గ్రంథుల్లో చేరి ఉండిపోతాయి. ఇవి అక్కడ పెద్దగా పెరగటం వల్లే మనకి బోదకాలు వస్తుంది. వీటి నుంచి వచ్చే కొన్ని విషతుల్యాల (Toxins) వల్ల లింఫు నాళాల్లో వాపు వస్తుంది. అలాగే ఈ క్రిములు చనిపోయి లింఫు నాళాల్లో అవరోధంగా మారటం వల్ల వీటికి బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లు కూడా తోడవటం వల్ల కాలు వాపు, జ్వరం, గజ్జల్లో బిళ్లల వంటి బాధలు మొదలవుతాయి. ఈ బాధలు వచ్చిన ప్రతిసారీ నాలుగైదు రోజులుండి తగ్గిపోతాయి. కానీ మళ్లీమళ్లీ వస్తూనే ఉంటాయి. ఈ వ్యాధి ఎక్కువగా కాళ్ళకు మాత్రమే కాకుండా చేతులు, రొమ్ము, పురుషాంగాలకు, హైడ్రోసిల్‌, రొమ్ము భాగానికి, స్త్రీ మర్మాంగాలకు కూడా రావచ్చును. ఏడాదికోసారి ఫైలేరియా నివారణ మందులు మింగాలి. వ్యాధికారక దోమలను అరికట్టాలి. బోధకాలు వ్యాధికి విధిగా చికిత్స చేయించుకోవాలి. సంక్రమితుల్లో మానవ మలేరియా పరాన్నజీవి సూక్ష్మ దశలో ఉన్నపుడు రక్త వ్యవస్థలో మైక్రో ఫైలేరియాలను ఉత్పత్తి చేస్తుంది. మానవుల రక్తాన్ని సేకరించిన దోమలో మైక్రో ఫైలేరియా ఉండిపోతుంది. సంక్రమిత మైక్రో ఫైలేరియా 12 రోజుల్లో పెరిగి పెద్దదై మరొకరికి వ్యాపింపజేసే దశకు చేరుకుంటుంది. సంక్రమిత లార్వా దశలో ఉన్న దోమ మరొకరిని కుట్టినప్పుడు చర్మం మీద పరాన్నజీవులు ఉండిపోతాయి. కుట్టిన మార్గం ద్వారా లోనికి ప్రవేశించి లింఫ్‌ వ్యవస్థలోకి వెళ్లి స్థిరపడతాయి.వ్యాధి వచ్చిన భాగాలను నిత్యం నీటితో శుభ్రపరచుకోవాలి. కడిగిన కాళ్లను పొడి వస్త్రంతో శుభ్రంగా తుడుచుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా కాళ్లకు సంబంధించిన వ్యాయామం చేయాలి. వ్యాయామం చేసేవారికి జ్వరం ఉండకూడదు. డైఇతైల్ కార్బమజీన్ (డీఈసీ),ఆల్బెండజోల్‌ బిళ్ళలు 21 రోజుల పాటు కోర్సుగా వాడాలి. ఒకసారి ఈ వ్యాధి వస్తే లింఫ్ నాళాలు దెబ్బ తింటే , కాలు వాపు వస్తు పోతూ ఉంటుంది.ఈ మందులు సురక్షితమైనవి. వ్యాధి లేనివారు కూడా వాడవచ్చు. ఇది సూక్ష్మ ఫైలేరియాను నశింపజేస్తుంది. ఆల్బెండజోల్‌ పేగుల్లో ఉండే క్రిములను నిర్మూలించి అదనపు లాభం చేకూరుస్తుంది. ఈ రెండింటినీ కలిపి ఇవ్వడం ద్వారా పెరిగిన క్రిములపై ప్రభావం చూపిస్తుంది. బాక్టీరియా ఇన్ ఫెక్షన్ ఉండి జ్వరం వస్తుంటే ఏంటీబయోటిక్స్ ఇస్తారు. ముదిరిన బోదకాలు కోసం శస్త్రచికిత్స కూడా అవసరం ఉంటుంది. ఐదారు ఏళ్లపాటు ఏడాదికోసారి సముదాయం మొత్తానికి ఫైలేరియా వ్యతిరేక మందులను ఒకే మోతాదులో ఇవ్వడం.