సన్నిపాత జ్వరం https://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A4_%E0%B0%9C%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B0%82 సన్నిపాత జ్వరం లేదా టైఫాయిడ్ జ్వరం (Enteric or Typhoid Fever), నిద్రాణావస్థ మొదలు 3 వారల దాకా ఉండవచ్చు. "సాల్మోనెల్లా టైఫై" (Salmonella typhi) అనే బాక్టీరియా వల్ల టైఫాయిడ్ జ్వరం వస్తుంది. ఈ జాతికి చెందినదే "పారాటైఫాయిడ్ " అనే మరో రకం జ్వరం కూడా ఉంది. ఆరంభంలో కొద్దిగా జ్వరం వస్తుంది. రోజురోజుకీ క్రమంగా జ్వరం ఎక్కువవుతూ వారం రోజుల్లో 40 డిగ్రీల సి. దాకా జ్వరం వస్తుంది. ఆ సమయంలో తలనొప్పి కూడా ఎక్కువగా ఉంటుంది. సకాలంలో చికిత్స జరిగినా , ఈ వ్యాధి మరో రెండు మూడు వారాల దాకా వుంటుంది. టైఫాయిడ్ వ్యాధి క్రిముల్ని నిరోధించక పోయిన పక్షంలో వ్యాధి ముదిరి, అవాంతర రోగాలు కూడా రావచ్చు. న్యుమోనియా, సంధించడం, హృదయం బలహీనపడడం, ప్రేగులలోనుంచి రక్త స్రావం, వ్రణాలవల్ల ప్రేగులు తూట్లు పడడం {Perforations) లాంటి ప్రమాదకరమైన పరిస్థులేర్పడి రోగి చనిపోవచ్చు. వైడాల్ పరీక్ష (Widal test) ద్వారా సాల్మోనెల్లా ప్రతిరక్షకాలను గుర్తించడం జరుగుతుంది. రక్తం, మల పరీక్ష (Blood and Stool culture) ద్వారా సాల్మోనెల్లా క్రిములను ప్రయోగశాలలో వృద్ధిచెందించి గుర్తిస్తారు.జ్వరం వచ్చిన వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. టైఫాయిడ్ జ్వరం అని తీర్మానం అయిన తర్వాత తగిన చికిత్స చేయాలి. ఇంటి దగ్గర ఉంటూనే చికిత్స తీసుకోవచ్చు. వైద్యుడు ఇచ్చే మందుల్ని క్రమం తప్పకుండా పుచ్చుకోవాలి. తగిన మోతాదులలో చల్లార్చిన గంజి, పాలు, నీళ్ళు కలిపిన అన్నం, పళ్ళ రసం, కొబ్బరి బొండాం నీళ్ళు, గ్లూకోస్, కోడి గ్రుడ్లు ఆహారంగా తీసుకోవచ్చు. జ్వరంవల్ల అధికంగా చెమటలు పోస్తూ ఉంటాయి, అందువల్ల తరచు రోగికి దాహంవేస్తుంది. నోరెండిపోకుండా కొద్దికొద్దిగా నీళ్లు ఇస్తూ ఉండాలి. మూత్రం జారీ అయేటట్లు చూడాలి. జ్వరం వచ్చిన తరువాత మొదటి ఐదారు రోజులు మామూలుగా స్నానం చేయవచ్చు. తరువాత గోరువెచ్చని నీటితో తడి గుడ్డతో దేహాన్ని తుడవాలి రోగిని ఫానుక్రింద కూర్చోబెట్టాలి లేదా విసనకర్రతో విసురుతూ, జ్వరం త్రీవత తగ్గించాలి. చర్మం మీద చెమట గ్రంథులు మూసుకుపోకుండా జాగ్రత్తపడాలి. విరేచనాలు అయే పక్షంలో పాలు పుచ్చుకోకూడదు. పాలను నిమ్మరసం పిండి, విరగ్గొట్టి- వడబోసి ఆ విరుగుడు తేట రోగిచేత త్రాగించవచ్చు. టైఫాయిడ్ జ్వరం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత కూడా ఆహార విషయంలో రోగి జాగ్రత్త వహించాలి. సుమారు 10, 15 రోజులు ఆహార నియమం పాటించాలి. కడుపులో వ్రణం ఆరడానికి కనీసం 10, 15 రోజులు పడుతుంది. కనుక ద్రవరూపంలోనే పోషక ఆహారం రోగికి ఎక్కువగా ఇస్తూ ఉండాలి. మిరప కాయలు, చింతపండు వాడుక పూర్తిగా మానివేయాలి. టైఫాయిడ్ క్రిములు మాములుగా మల మూత్రాల ద్వారా వ్యాపిస్తాయి. పాలు, ఐస్ క్రీం వంటి అహారపదార్థాల ద్వారా కూడా ఇవి వ్యాపించవచ్చు. అన్న పానీయాదులు ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది కనుక శుభ్రమైన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. ఈగలు వాలిన పదార్థాలను తినరాదు. ఇంట్లో గాని, హొటల్లో గాని వంట చేసేవాళ్ళు , సర్వర్లూ కాలకృత్యాలకు వెళ్ళివచ్చిన ప్రతిసారి చేతులూ, కాళ్ళూ సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఆహార పానీయాలు వడ్డించడానికి, తినడానికి ముందు మరోసారి కూడా చేతులూ, కాళ్ళూ తప్పక మరోసారి కడుక్కోవడం అవసరం. ఇంటిదగ్గర్ ఎవరికైనా టైఫాయిడ్ సోకితే, ఆ వ్యక్తి ఉపయోగించే పాత్ర సామగ్రిని ఇతరులు వాడకూడదు. ఇంట్లో వాళ్ళే కాక ఉళ్ళో వాళ్ళందరూ కూడా టైఫాయిడ్ టీకాలు వేయించు కోవాలి. ఈగలు వ్యాప్తిని అరికట్టడం చాలా అవసరం. టైఫాయిడ్ వ్యాధి వ్యాపించనప్పుడు ఆరోగ్యశాఖ వారికి కబురందజేయాలి. బావులలో, మంచి నీళ్ళ ట్యాంకులలో వ్యాధి నిరోధక ఔషధాలు కలిపి, వ్యాధి వ్యాపించకుండా రక్షక చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు వైద్యుడ్ని సంప్రదించి తగు సూచనలతో మందుల్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ తొందరగా జీర్ణమయ్యే పోషక ఆహారంతో పాటు విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి.