సెగవ్యాధి https://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B1%86%E0%B0%97%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A7%E0%B0%BF సెగవ్యాధి లేదా గనేరియా (Gonorrhea లేదా gonorrhoea) ఒక విధమైన అంటు వ్యాధి. ఇది నిసీరియా గొనోరియా (Neisseria gonorrhoeae) అనే బాక్టీరియా వలన కలుగుతుంది. ఇది ఒక సామాన్యమైన సుఖ వ్యాధి (sexually transmitted infection). అమెరికాలో దీనిది క్లమీడియా తర్వాత రెండవ స్థానం.,. సంభోగం లో పాల్గొన్న 2-5 రోజుల్లో దీని లక్షణాలు కనిపిస్తాయి. మూత్రంలో మంట, మూత్ర విసర్జనలో నొప్పి, మూత్ర మార్గం నుంచి చీము, స్త్రీలల్లో తెల్లమైల వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొద్దిరోజుల తర్వాత మూత్రం నిలిచిపోవటం, మూత్రమార్గం సన్నబడి కుంచించుకుపోవటం, మూత్ర మార్గానికి రంధ్రం పడి దానిలోంచి మూత్ర విసర్జన కావటం వంటి సమస్యలు ముంచుకొస్తాయి. అంతేకాదు.. పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలల్లో పెలోపియన్ ట్యూబులు మూసుకుపోవటం లాంటి సమస్యలూ రావొచ్చు. ఈ బ్యాక్టీరియా కీళ్లు, గుండె, కళ్ల వంటి భాగాలకూ చేరితే రకరకాల సమస్యలు మొదలవుతాయి. స్త్రీలల్లో పొత్తికడుపు నొప్పి, తెల్లమైల అధికం కావటం, నెలసరి క్రమం తప్పిపోవటం, నడుము నొప్పి లాంటి సమస్యలు కూడా వస్తాయి. స్త్రీ పురుష జననేంద్రియ అవయవాలే కాకుండా పురీషనాళము, గొంతు, కన్ను మొదలైన అవయవాలకు కూడా ఇది సోకవచ్చును. స్త్రీలలో ఇది గర్భాశయ గ్రీవం మొదట చేరుతుంది. అక్కడ నుండి సంభోగము ద్వారా మరొకరికి వ్యాపిస్తుంది. ప్రసవ కాలంలో తల్లినుండి పుట్టబోయే పిల్లలకు ఇది వ్యాపించవచ్చును. పిల్లలలో కంటి పొరకు సోకి సరైన సమయంలో వైద్యం చేయని పక్షంలో అంధత్వం సంక్రమించవచ్చును. ఈ వ్యాధి నిరోధన లక్ష్యంతోనే చాలా దేశాలలో పుట్టిన బిడ్డలకు ఎరిత్రోమైసిన్ (erythromycin) లేదా సిల్వర్ నైట్రేట్ (silver nitrate) కంటి చుక్కలు వేస్తారు. తొడుగు ఉపయోగించి సంభోగం లో పాల్గొనడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవచ్చును.