2019–21 కరోనావైరస్ మహమ్మారి https://te.wikipedia.org/wiki/2019%E2%80%9321_%E0%B0%95%E0%B0%B0%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B5%E0%B1%88%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D_%E0%B0%AE%E0%B0%B9%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF 2019-20 కరోనావైరస్ మహమ్మారి అన్నది సార్స్-సీవోవీ-2 వైరస్ (కరోనావైరస్ 2019) కారణంగా వచ్చే కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి చెందుతూ ఉండడంతో ప్రస్తుతం కొనసాగుతున్న మహమ్మారి. మొట్టమొదటగా ఈ వ్యాప్తి 2019 డిసెంబరులో చైనాలోని హుబయ్ ప్రావిన్సులో వుహాన్ నగరంలో ప్రారంభమైంది. 2020 జనవరి 30న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) ఈ వ్యాప్తిని అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితిగానూ, 2020 మార్చి 11న మహమ్మారి (పాన్‌డమిక్)గానూ గుర్తించింది. 2020 ఏప్రిల్ 4 నాటికి, 190 పైచిలుకు దేశాల్లో, 200 పైచిలుకు ప్రాంతాల్లో మొత్తం 10 లక్షల పైచిలుకు కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19 కారణంగా 54 వేల మందికి పైగా చనిపోగా, 2 లక్షల 18 వేల మంది వరకూ దీని నుంచి కోలుకున్నారు. వైరస్ ప్రధానంగా సన్నిహితంగా మసిలినప్పుడు[lower-alpha , వ్యాధిగ్రస్తులు దగ్గినా, తుమ్మినా, మాట్లాడినా వచ్చే చిన్న తుంపరల ద్వారా వ్యాపిస్తుంది. ఈ తుంపరలు ఒక్కోసారి ఊపిరి పీల్చేప్పుడు కూడా ఏర్పడతాయి కానీ ఈ వ్యాధి సాధారణంగా గాలి ద్వారా వ్యాపించేది కాదు. ఈ వైరస్‌ మనిషి నుంచి రకరకాల వస్తువుల ఉపరితలాల మీద కూడా నిలిచివుంటుంది. మనుషులు అలా కలుషితమైన ఉపరితలాలను తాకి, ఆ చేతులతో తమ ముఖాన్ని తాకినా వైరస్ వారికి సోకుతుంది. రోగ లక్షణాలు (దగ్గు, జ్వరం వగైరా) కనిపిస్తున్న దశలో ఈ వ్యాధి బాగా వ్యాపిస్తుంది, కానీ రోగ లక్షణాలు కనిపించని దశలో కూడా వ్యాపించే అవకాశం ఉంది. వైరస్ సోకిన తర్వాత రోగ లక్షణాలు కనిపించడానికి సాధారణంగా ఐదు రోజులు పడుతుంది, అయితే ఆ సమయం అన్నది రెండు రోజుల నుంచి 14 రోజుల మధ్య ఎంతైనా ఉండవచ్చు. సాధారణ లక్షణాలు జ్వరం, దగ్గు, శ్వాస ఆడకపోవడం. దీని వల్ల తలెత్తే సమస్యలలో న్యుమోనియా, తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి ఉండవచ్చు. ఇంతవరకూ దీన్ని అడ్డుకోవడానికి టీకా కాని, నయం చేయడానికి నిర్దిష్టమైన యాంటీ-వైరల్ చికిత్స కానీ అందుబాటులో లేదు. రోగలక్షణాలను బట్టి చేసే చికిత్స, సహాయక చికిత్స మాత్రమే దీనికి ప్రస్తుతం చేస్తున్న ప్రాథమిక చికిత్స. వీలైనంత తరచుగా చేతులు కడుక్కుంటూ ఉండడం, దగ్గేప్పుడు నోరు కప్పుకోవడం, ఇతరుల నుంచి దూరంగా ఉండడం, వైరస్ సోకిందన్న అనుమానం ఉన్నవారిని వేరుగా ఉంచి, పర్యవేక్షించడం వంటివి సూచిస్తున్న నివారణ చర్యల్లో కొన్ని. వైరస్ వ్యాప్తిని నివారించడానికి ప్రయాణ పరిమితులు, నిర్బంధాలు, కర్ఫ్యూలు, కార్యాలయాల్లో నియంత్రణలు, కార్యక్రమాల వాయిదా, రద్దు, సౌకర్యాల మూసివేత, దిగ్బంధం వంటి చర్యలు చేపట్టారు. వీటిలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, ప్రాంతాల నిర్బంధాలు (హుబయ్ నిర్బంధంతో మొదలయింది), వివిధ దేశాల్లో కర్ఫ్యూలు, సరిహద్దుల మూసివేతలు, ప్రయాణికులపై ఆంక్షలు, విమానాలు, రైల్వేస్టేషన్లలో స్క్రీనింగ్‌, బయటకు వెళ్ళే ప్రయాణికుల ప్రయాణాల నిషేధాలు ఉన్నాయి. ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సామాజిక ఆర్థిక పరిస్థితులను అల్లకల్లోలం చేసింది. క్రీడా, మత, సాంస్కృతిక కార్యక్రమాలు వాయిదా పడడం, రద్దు కావడం, భయాందోళనలు, వాటి కారణంగా సరఫరాల కొరత తలెత్తుందన్న విస్తృత భయాలు. 160 దేశాల్లో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు దేశవ్యాప్తంగానో, స్థానికంగానో మూతబడ్డాయి. దీని కారణంగా 150 కోట్ల మంది విద్యార్థుల చదువు ప్రభావితమైంది. వైరస్ గురించి తప్పుడు సమాచారం ఆన్‌లైన్‌లో వ్యాపించింది,ఐరోపా దేశాల్లో, అమెరికాలో, మహమ్మారి వ్యాప్తి చెందుతున్న ఇతర దేశాల్లో చైనీయులు, తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా సంతతికి చెందినవారి పట్ల జనం జాతిపరంగా భయాలు, దూషణలు, వివక్ష చూపుతున్నారు. ఈ వైరస్ ప్రభావం అంతర్జాతీయంగా అనేక దేశల్లో విస్తరిస్తున్న కొద్దీ ఈ జాతి వివక్ష కూడా పెరుగుతోంది. 2019 డిసెంబరు 31న చైనాలోని హుబయ్ ప్రావిన్సులోని వుహాన్ నగర వైద్యాధికారులు తెలియని కారణంతో వచ్చిన ఒక సామూహిక న్యుమోనియా కేసులను నివేదించారు, 2020 జనవరి తొలినాళ్ళలో దీనిపై ఒక పరిశోధన ప్రారంభించారు. కేసుల్లో అత్యధికశాతం వన్యప్రాణుల మార్కెట్ అయిన హునాన్ సీఫుడ్ హోల్‌సేల్ మార్కెట్‌తో సంబంధం ఉన్నవి కావడంతో వన్యప్రాణుల నుంచి మనుషులకు సోకి ఉండవచ్చని అంచనా. ఈ వ్యాధి కారక వైరస్‌ని అప్పటివరకూ కనుగొనని కొత్త తరహా కరోనావైరస్‌గా పేర్కొన్నారు. దీనికి సార్స్-సీవోవీ-2 (SARS-CoV-2)గా పేరుపెట్టారు. దీనికి గబ్బిలాల కరోనావైరస్‌కీ, పాంగోలిన్లలో ఉండే కరోనావైరస్‌కీ, సార్స్-సీవోవీ వైరస్‌కీ దగ్గర సంబంధం ఉంది. ఈ వ్యాధి బారిన పడినట్టు లక్షణాలు కనబరిచిన రోగుల్లో మనకి తెలిసిన అత్యంత మొదటి వ్యక్తిని తర్వాత గుర్తించారు. 2019 డిసెంబర్ 1న అతనిలో ఈ లక్షణాలు బయటపడ్డాయి. అయితే వెట్ మార్కెట్ కి వెళ్ళిన చరిత్ర కానీ, ఆ వెట్ మార్కెట్ తో సంబంధం ఉన్న తర్వాతి బాధితులతో సంబంధాలు కానీ కనిపించడం లేదు. 2019 డిసెంబరులో నమోదైన మొట్టమొదటి కేసుల సమూహంలో మూడింట రెండు వంతుల మందికి మార్కెట్‌తో సంబంధం ఉంది. 2020 మార్చి 13న సౌత్ చైనా మార్నింగ్ పోస్టులో వచ్చిన నిర్ధారణ కాని రిపోర్టు హుబయ్ ప్రావిన్సుకు చెందిన 55 సంవత్సరాల వయస్కులు ఒకరు 2019 నవంబరు 17న ఈ వ్యాధి బారిన పడినట్టు, ఆ వ్యక్తే మొట్టమొదటి రోగి అన్నట్టు సూచిస్తోంది. అయితే ఇది నిర్ధారణ కాలేదు. ప్రస్తుతానికి మొట్టమొదటి రోగి ఎవరన్న విషయం మీద స్పష్టత లేదు. 2020 ఫిబ్రవరి 26న ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాలో కేసుల సంఖ్య తగ్గినట్టు తెలిసిందనీ, కానీ హఠాత్తుగా ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియాల్లో పెరుగుతున్నాయనీ ప్రకటించింది. అలానే, మొదటిసారిగా చైనాలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య కన్నా చైనా బయట నమోదవుతున్న కేసుల సంఖ్య పెరిగాయి. చెప్పుకోదగ్గ స్థాయిలో నమోదుకాని కేసులు ఉండివుండవచ్చు, ప్రత్యేకించి తీవ్రమైన లక్షణాలు లేనివారి విషయంలో నమోదు కాకపోవడం అన్నది ఎక్కువగా ఉండవచ్చు. ఫిబ్రవరి 26 నాటికి 19 సంవత్సరాల లోపు వయసులో ఉన్న యువతలో ఇతర వయసుల వారితో పోలిస్తే చాలా తక్కువ కేసులు బయటపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా బయటపడ్డ కేసుల్లో ఈ వయస్సుకు చెందినవారివి 2.4 శాతం. జర్మనీ, ఇంగ్లాండ్ ప్రభుత్వ వర్గాల అంచనా ప్రకారం మంద రోగ నిరోధక శక్తి (హెర్డ్ ఇమ్యూనిటీ) సాధించాలంటే 60-70 శాతం జనాభాకి ఈ వ్యాధి సోకాల్సివుంటుంది. దాదాపు 200 దేశాలు, ప్రాంతాల్లో కనీసం ఒక్క కోవిడ్-19 కేసు అయినా నమోదు అయింది. ఐరోపాలో కరోనావైరస్ మహమ్మారి వల్ల షెంజన్ ప్రాంతంలోనూ పలు దేశాల్లో స్వేచ్ఛగా ప్రయాణించడాన్ని నియంత్రించి, సరిహద్దు నియంత్రణలు ఏర్పాటుచేసుకున్నాయి. క్వారంటైన్ (లాక్‌డౌన్, స్టే-ఎట్-హోమ్, షెల్టర్-ఇన్-ప్లేస్‌ వంటి పేర్లతో ప్రాచుర్యంలో ఉన్నాయి), కర్ఫ్యూలు వంటివి కోవిడ్-19 వ్యాప్తిని నియంత్రించడానికి దేశాలు తీసుకున్న చర్యల్లో భాగంగా ఉన్నాయి. ఏప్రిల్ 2 నాటికి 130 కోట్ల మంది భారతదేశంలోనూ, 5.9 కోట్ల మంది దక్షిణాఫ్రికాలోనూ, 5 కోట్ల మంది ఫిలిప్పైన్స్‌లోనూ పూర్తి స్థాయి లాక్‌డౌన్‌లో ఉన్నారు. అమెరికాలో 30 కోట్ల మంది లేదంటే 90 శాతం అమెరికన్ జనాభా ఏదోక రూపంలోని లాక్‌డౌన్‌లో ఉన్నారు. మార్చి 26 నాటికి మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 170 కోట్ల మంది ప్రజలు ఏదో ఒక రూపంలోని లాక్‌డౌన్‌లో ఉన్నారు, రెండు రోజులు గడిచేసరికి ఆ సంఖ్య 260 కోట్లకు చేరుకుంది. తద్వారా ప్రపంచ జనాభాలో మూడవ వంతు లాక్‌డౌన్‌లో ఉన్నారు. కోవిడ్-19 వ్యాధికి సంబంధించి మనకి తెలిసిన తొలి నిర్ధారిత కేసు 2019 డిసెంబర్ 1న వుహాన్‌లో బయటపడింది; ఇదే నగరంలో 17 నవంబరున ఇంకా తొలినాటి కేసు ఉన్నట్టు ఒక నిర్ధారణ లేని రిపోర్టు సూచిస్తోంది. డాక్టర్ ఝాంగ్ జిక్సియాన్ తెలియని కారణంతో వస్తున్న న్యుమోనియా కేసుల సమూహాన్ని డిసెంబరు 26న గమనించింది, దీనితో ఆమె ఆసుపత్రి డిసెంబరు 27న ఈ విషయాన్ని వుహాన్ ప్రావిన్సుకు చెందిన వ్యాధుల వ్యాప్తి నియంత్రణ, నివారణ కేంద్రానికి నివేదించింది. వుహాన్ మున్సిపల్ ఆరోగ్య కమీషన్ డిసెంబరు 31న పబ్లిక్ నోటీసు విడుదల చేసింది. ఈ విషయం మీద ప్రపంచ ఆరోగ్య సంస్థకు అదే రోజు సమాచారం అందించారు. ఈ నోటిఫికేషన్లు వెలువడ్డాకా అవుట్‌బ్రేక్‌ గురించి "పుకార్లు ప్రచారం" చేయవద్దంటూ వుహాన్ నగరంలోని వైద్యులను పోలీసులు హెచ్చరించారు. మొదట్లో చైనీస్ జాతీయ ఆరోగ్య కమీషన్ మనిషి నుంచి మనిషికి ఇది వ్యాప్తిస్తుంది అనడానికి స్పష్టమైన ఆధారాలు ఏవీ లేవని పేర్కొంది. 2020 జనవరిలోనూ చైనా అధికారులు ఇది మనిషి నుంచి మనిషికి సోకడం లేదనీ, వన్యప్రాణుల మార్కెట్లో జంతువుల నుంచి మనుషులకు సోకిందని వాదించింది. జనవరి 19 నాటికి 50 కేసులు మాత్రమే నమోదైనట్టు చైనా పేర్కొంది. అయితే అప్పటికే జపాన్, థాయ్‌లాండ్ దేశాల్లో చెరో రెండు కేసులు నమోదై ఉండడంతో ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య 1,700 పైచిలుకు ఉండవచ్చనీ, ఇంత తీవ్రంగా విస్తరిస్తోందంటే మనిషి నుంచి మనిషికి వ్యాపించే సామర్థ్యం వైరస్‌కి ఉండి ఉండాలని ప్రపంచవ్యాప్తంగా వైరాలజీ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, తర్వాత చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రమైన ప్రచారోద్యమం ప్రారంభించింది, దీన్ని తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి గ్జి జిన్‌పింగ్ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చేసిన "ప్రజా యుద్ధం"గా అభివర్ణించాడు. తర్వాత "మానవ చరిత్రలో అతిపెద్ద క్వారంటైన్‌"గా పేర్కొన్న ప్రయత్నం ప్రారంభించారు. జనవరి 23న వుహాన్ నగరంలోకి, నగరం నుంచి బయటకు ఎవరినీ రానీయకుండా నియంత్రణలు అమలుచేస్తూ లాక్‌డౌన్ ప్రారంభించారు, దీన్ని హుబయ్ ప్రావిన్సులో 15 ఇతర నగరాలకు విస్తరించారు, మొత్తంగా ఈ లాక్‌డౌన్ 5.7 కోట్ల మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేసింది. నగరంలో ప్రైవేటు వాహనాల వాడకం నిషేధించారు. అనేక ప్రాంతాల్లో జనవరి 25న జరగాల్సి ఉన్న చైనీస్ కొత్త సంవత్సర వేడుకలు రద్దయ్యాయి. చైనా తాత్కాలిక ఆసుపత్రి, హువాషెన్‌షాన్ ఆసుపత్రిని పది రోజుల వ్యవధిలో నిర్మించింది, మొత్తంగా మరో 14 తాత్కాలిక ఆసుపత్రులను చైనా నిర్మించింది. ఆ తర్వాత లీషెన్‌షాన్ ఆసుపత్రిని క్వారంటైన్‌ రోగుల కోసం నిర్మించింది. జనవరి 26న కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వం ప్రయాణికులకు ఆరోగ్యపరమైన ప్రకటనలు జారీచేయడం సహా కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు మరికొన్ని చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి, స్ప్రింగ్ ఫెస్టివల్ సెలవులను పొడిగించారు. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు మూసివేశారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకు సంబంధించి, ఇతర అంశాల్లోనూ హాంగ్‌కాంగ్, మకావ్ ప్రాంతాలు వివిధ జాగ్రత్తలు ఏర్పరిచాయి. చైనాలోని వివిధ ప్రాంతాల్లో ఇంటి నుంచే పనిచేయాలని ఉత్తర్వులు జారీచేశారు. హుబయ్ ప్రావిన్సులోనూ, దాని బయట కూడా ప్రయాణాలపై పరిమితులు విధించారు. ప్రజారవాణా సౌకర్యాల్లో మార్పులు చేశారు. చైనావ్యాప్తంగా మ్యూజియంలు తాత్కాలికంగా మూసివేశారు. వివిధ నగరాల్లో ప్రజల రాకపోకలపై నియంత్రణలు విధించారు. 76 కోట్ల మంది (చైనా జనాభాలో సగానికి పైగా) ఏదో ఒక రూపంలో బయట తిరగడంపై నియంత్రణలు ఎదుర్కొన్నారు. మార్చిలో కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న దశలో చైనా అధికారులు ఇతర దేశాల నుంచి ఇది తిరిగి చైనాకు దిగుమతి కావడాన్ని నివారించడానికి గట్టి చర్యలు చేపట్టారు. ఉదాహరణకు, బీజింగ్ నగరానికి వచ్చే అందరు అంతర్జాతీయ ప్రయాణికులు 14-రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్ విధించారు. మార్చి 23 నాటికి చైనా ప్రధాన భూభాగంలో దేశీయంగా 5 రోజుల వ్యవధిలో ఒకే ఒక కేసు వ్యాప్తి చెందే స్థాయికి నియంత్రించారు. ఈ సందర్భంలో కూడా గ్వాంగ్జౌకు ఇస్తాంబుల్‌ నుంచి తిరిగి వచ్చిన ప్రయాణికుడి వల్ల ఆ ఒక్క కేసూ నమోదైంది. 2020 మార్చి 24న దేశీయంగా కేసుల వ్యాప్తిని అరికట్టామని, చైనాలో కరోనావైరస్ 2019 వ్యాప్తి నియంత్రణలోకి వచ్చిందని చైనా ప్రీమియర్ లీ కెక్వియాంగ్ ప్రకటించాడు. అదే రోజున లాక్‌డౌన్‌ విధించిన రెండు నెలల అనంతరం వుహాన్ మినహా మిగిలిన హుబయ్ ప్రావిన్సు అంతా ప్రయాణాలపై నియంత్రణలు సడలించారు. మార్చి 28 నుంచి ఇప్పటికే వీసాలు, రెసిడెన్స్ పర్మిట్ కలిగినవారికి అనుమతులను నిలిపివేస్తున్నట్టు 2020 మార్చి 26న చైనా విదేశాంగ మంత్రి ప్రకటించాడు. ఈ విధానం ఎప్పటితో ముగుస్తుందన్న విషయం మాత్రం ప్రకటించలేదు. చైనాలోకి ప్రవేశించాలని ఆశించేవారికి వీసాలను చైనీస్ ఎంబసీల్లోనూ, కాన్సులేట్‌లలోనూ దరఖాస్తు చేసుకోవాలి. మార్చి 30 నుంచి పరిశ్రమలు, వ్యాపారాలు తిరిగి తెరవమని వ్యాపార వర్గాలను చైనా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వ్యాపార సంస్థలకు ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలు అందిస్తోంది. ఏప్రిల్ 1న అమెరికా గూఢచారి సముదాయపు నివేదిక ప్రకారం ఇద్దరు అమెరికన్ అధికారులు తమ దేశంలో వచ్చిన కేసులను, మరణాలను చైనా ప్రభుత్వం తక్కువ చేసి చూపించిందని ఆరోపించారు. ఆ నివేదిక రహస్యమైనది కాబట్టి అధికారులు తమ పేర్లను బయటపెట్టలేదు, అంతకుమించిన వివరాలను కూడా చెప్పడానికి నిరాకరించారు. చైనా నుంచి 2020 జనవరి 20న కోవిడ్-19 దక్షిణ కొరియాకి వ్యాపించినట్టు నిర్ధారణ అయింది. ఫిబ్రవరి 20 నాటికి దక్షిణ కొరియా హెల్త్ ఏజెన్సీ చెప్పుకోదగ్గ స్థాయిలో నిర్ధారిత కేసుల పెరుగుదల ఉన్నట్టు గమనించింది. దీనికి డేగు అన్న ప్రదేశంలో షించియోంజీ చర్చ్ ఆఫ్ జీసెస్ అన్న కొత్త మతపరమైన ఉద్యమానికి చెందిన ఒక కూటమి ఇందుకు ప్రధానమైన కారణమని గుర్తించారు. వుహాన్ నుంచి డేగు ప్రాంతానికి వచ్చి ఈ కూటముల్లో పాల్గొన్న షించియోంజీ చర్చి భక్తులు ఈ వ్యాప్తి విజృంభణకు కారకులని అనుమానిస్తున్నారు. ఫిబ్రవరి 22 నాటికి 9,336 మంది చర్చి అనుచరుల్లో 1,261 మంది, అంటే 13 శాతం మందిలో కోవిడ్-19 లక్షణాలు బయటపడ్డాయి. ఈ 9వేల పైచిలుకు వ్యక్తులను సెల్ఫ్-క్వారంటైన్లో ఉంచారు. అదే రోజున 229 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. వీటిలో కొన్ని కేసులు అప్పటివరకూ వైరస్ బాధిత ప్రాంతాలతోనూ, రోగులతోనూ ప్రత్యక్ష సంబంధాలు లేకపోవడంతో దేశంలో కరోనావైరస్ 2019 వ్యాప్తి కొత్త దశలోకి వచ్చిందని దక్షిణ కొరియా మంత్రి కిమ్ పేర్కొన్నాడు. 2020 ఫిబ్రవరి 23న దక్షిణ కొరియా అత్యధిక స్థాయి అప్రమత్తత ప్రకటించింది. ఫిబ్రవరి 28న దేశంలో 2 వేలకు పైగా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి, ఫిబ్రవరి 29 నాడు 3,150 కేసులు నిర్ధారణ అయ్యాయి. ముగ్గురు సైనికులు కోవిడ్-19 పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో మొత్తం మిలటరీ బేస్‌లన్నిటినీ క్వారంటైన్ చేశారు. మొదట్లో అధ్యక్షుడు మూన్ జే-ఇన్ చేపట్టిన చర్యలు, ప్రతిస్పందన పట్ల దక్షిణ అమెరికా సమాజంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొందరు కొరియన్లు ప్రభుత్వం ఈ అవుట్‌బ్రేక్‌లో సరిగా పనిచేయలేదంటూ మూన్‌ని అధ్యక్ష పదవి నుంచి తొలగించాలంటూ పిటీషన్లపై సంతకాలు చేశారు. మరికొందరు అతని ప్రతిస్పందనను అభినందించారు. కరోనావైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రపంచంలో అతిపెద్ద, అత్యుత్తమంగా నిర్వహించినదిగా తర్వాతి రోజుల్లో పేరుతెచ్చుకున్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. పెద్ద ఎత్తున జనాభాను స్క్రీన్‌ చేసి, వైరస్‌ సోకినవారిని కనిపెట్టి విడదీసి, వారిని కలిసినవారిని వెతికి పట్టుకుని క్వారంటైన్‌ చేయడం ఇందులో ముఖ్యమైన అంశాలు. స్క్రీనింగ్ పద్ధతుల్లో విదేశాల నుంచి ఇటీవల తిరిగివచ్చినవారు మొబైల్ అప్లికేషన్ ద్వారా తప్పనిసరిగా తమ లక్షణాలను తాము నివేదించడం, వైరస్‌ పరీక్షలను సంచార పరీక్షాశాలల ద్వారా నిర్వహించి మరుసటి రోజుకల్లా ఫలితాలు వెల్లడించడం, ప్రతీరోజూ 20 వేలమందిని పరీక్షించగలిగేలా పరీక్షా సామర్థ్యాన్ని పెంచుకోవడం, జీపీఎస్ ఉపయోగించి కోవిడ్-19 వ్యాధిగ్రస్తులు ఎక్కడెక్కడికి తిరిగి ఎవరిని కలిశారన్న సమాచారం సేకరించి ఆ ప్రదేశాలు శానిటైజ్ చేయడం, వ్యక్తులను క్వారంటైన్ చేయడం, వంటివి ఉన్నాయి. పూర్తిగా నగరాలన్నిటినీ లాక్‌డౌన్ చేయకపోయినా ఈ ప్రయత్నాలతో దక్షిణ కొరియా వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేయడంలో విజయవంతం అయింది. మార్చి 18న ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్-జనరల్ దక్షిణ కొరియా కరోనావైరస్ 2019 వ్యాప్తిని అడ్డుకోవడానికి చేసిన కృషిని ప్రత్యేకంగా అభినందిస్తూ "కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ జరిగిన ఇతర దేశాలతో దక్షిణ కొరియా కృషి నుంచి వచ్చిన పాఠాలను, అనుభవాలను పంచుకుంటామని, వాటిని స్థానిక పరిస్థితులకు తగ్గట్టు అనసరించాలని" పేర్కొంది. మార్చి 23న, అప్పటికి నాలుగు వారాల వ్యవధిలో తొలిసారిగా ఒక రోజున నమోదైన కేసుల్లో అతి తక్కువ నమోదైనట్టు ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి దక్షిణ కొరియాకి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు అందరినీ తప్పనిసరిగా రెండు వారాల పాటు క్వారంటైన్ చేస్తామని ప్రకటించారు. ఏప్రిల్ 1 నాటి మీడియా వార్తల ప్రకారం, దక్షిణ కొరియా ప్రభుత్వాన్ని వ్యాధిగ్రస్తుతలను గుర్తించడానికి చేసే పరీక్షల విషయంలో సాయం అందించమని 121 దేశాలు సంప్రదించాయి. జర్మనీ, ఇండియా, బ్రిటన్, సహా పలు దేశాలు కరోనావైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో దక్షిణ కొరియా మోడల్‌ని అనుసరించాలని ప్రయత్నిస్తున్నాయి. జనవరి 20న వాషింగ్టన్‌ పసిఫిక్ నార్త్‌-వెస్ట్ స్టేట్‌లో తొలి కోవిడ్-19 కేసు నిర్ధారణ అయింది. ఆ రోగి జనవరి 15న వుహాన్ నుంచి అమెరికా తిరిగి వచ్చాడు. జనవరి 29 నాడు వైట్‌హౌస్ కరోనావైరస్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేశారు. జనవరి 31 నాడు ట్రంప్ ప్రభుత్వం కోవిడ్‌-19 వ్యాప్తిని ప్రజారోగ్య అత్యవసర స్థితిగా ప్రకటించి చైనా నుంచి తిరిగివచ్చే ప్రయాణికుల మీద నియంత్రణలు విధించింది. 2020 జనవరి 28న అమెరికన్ ప్రభుత్వ ప్రజారోగ్య సంస్థల్లో ముందు వరుసలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తమ స్వంత టెస్టింగ్‌ కిట్‌లు అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. అయితే ఆ పని చేయకపోగా అమెరికా పరీక్షలు నిర్వహించడంలో మెల్లిగా సాగింది. తద్వారా అప్పటికి వ్యాప్తి ఏ స్థాయిలో ఉందన్న విషయం మీద స్పష్టత రాలేదు. ఫిబ్రవరిలో ఫెడరల్ ప్రభుత్వం రూపొందించిన లోపభూయిష్టమైన కిట్లు, ఫిబ్రవరి నెలాఖరు వరకూ విశ్వవిద్యాలయాలు, కంపెనీలు, ఆసుపత్రులు వంటి ప్రభుత్వేతర సంస్థలు కిట్లు రూపొందించడానికి అనుమతించకపోవడం, మార్చి తొలినాళ్ళ దాకా పరీక్ష నిర్వహించడానికి ఒక వ్యక్తి అర్హులా అన్న విషయాన్ని అనేక ఆంక్షలు, నియమాలతో నిర్ణయించడం (ఆ తర్వాత నుంచి ఒక వైద్యుని ఆదేశం సరిపోయేలా సడలించారు) కలిసి పరీక్షల నిర్వహణను కుంటుపరిచాయి. ఫిబ్రవరి 27 నాటికి అమెరికా వ్యాప్తంగా 4 వేల కన్నా తక్కువ పరీక్షలు జరిగినట్టు ద వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వార్తా కథనంలో పేర్కొంది. మార్చి 13 నాటికి ద అట్లాంటిక్ వార్తా కథనం ప్రకారం 14 వేల కన్నా తక్కువ పరీక్షలు నిర్వహించారు. మార్చి 22న "లక్షణాలు ఉండి, వైద్యుల ఆర్డర్ తీసుకుని కూడా చాలామంది పరీక్ష చేయించుకోవడానికి గంటలు, రోజుల పాటు వేచి ఉండాల్సి వచ్చిందని" ద అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. ఫిబ్రవరి 29న అమెరికాలోని తొలి కోవిడ్-19 మరణం వాషింగ్టన్‌ రాష్ట్రంలో నమోదుకావడంతో గవర్నర్‌ జే ఇన్‌స్లీ అత్యవసర పరిస్థితిని విధించాడు, ఈ నిర్ణయాన్ని తర్వాత పలు ఇతర రాష్ట్రాలు అనుసరించాయి. మార్చి 3 నుంచి సియాటెల్ ప్రాంతంలోని పాఠశాలలు క్లాసులు నిలిపివేశాయి, మార్చి నెల మధ్యకి వచ్చేసరికి దేశవ్యాప్తంగా పాఠశాలల మూసివేత మొదలైంది. ఇంపీరియల్ కాలేజ్ లండన్‌కు చెందిన ఎపిడెమాలజిస్టుల (సంక్రమిత వ్యాధుల నిపుణులు) బృందం అమెరికాలో కరోనావైరస్ 2019 వ్యాప్తి ప్రభావం పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయని సూచనలు చేసింది. అదే రోజున కరోనావైరస్ ప్రిపేర్డ్‌నెస్ అండ్ రెస్పాన్స్ సప్లిమెంటల్ అప్రాప్రియేషన్స్ యాక్ట్ తీసుకువస్తూ అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశాడు. ఈ చట్టం ద్వారా కరోనావైరస్ 2019 వ్యాప్తికి ప్రతిస్పందించడానికి ఫెడరల్ ఏజెన్సీలకు $8.3 బిలియన్ల అత్యవసర ఫండింగ్ అందించింది. కార్పొరేషన్లు ఉద్యోగుల ప్రయాణాల మీద నియంత్రణలు విధించాయి, కాన్ఫరెన్సులు రద్దుచేశాయి, ఇంటి నుంచి పనిచేయమని ప్రోత్సహించాయి. క్రీడా కార్యక్రమాలు, రద్దయ్యాయి. భారతదేశలొ 2020 కరోనావైరస్ వ్యాప్తి కరోనా వైరస్‌