ఎముక విరుపు https://te.wikipedia.org/wiki/%E0%B0%8E%E0%B0%AE%E0%B1%81%E0%B0%95_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B0%E0%B1%81%E0%B0%AA%E0%B1%81 ప్రమాదాలు జరిగినప్పుడు లేదా ఎత్తైన ప్రదేశం నుండి క్రింద పడినప్పుడు ఎముకలు విరిగిపోతుంటాయి. ఎక్కువగా చేతులు, కాళ్ళ ఎముకలు ఇలా విరుగుతుంటాయి. ఇలా ఏ కారణం చేతనైనా ఎముకలు విరగడాన్ని ఎముక విరుపు (Bone Fracture) అంటారు. అయితే కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే ఎముకలు బలహీనంగా ఉన్నందువలన కూడా విరగవచ్చును. ఆస్టియోపోరోసిస్ (Osteoporosis), కాన్సర్ (Cancer) దీనికి ఉదాహరణలు. సామాన్య ఎముక విరుపు (Simple or Closed fracture) : ఈ రకమైన విరుపులో ఎముక పూర్తిగా లేదా కొమ్త భాగం విరగవచ్చును. విరిగిన చోట ఎలాంటి గాయం కనిపించదు. దీనినే మూసివున్న ఎముక విరుపు అని కూడా అంటారు. చాలాచోట్ల ఎముక విరుపు (Compound or Open fracture) : ఇందులో ఎముక విరిగిన దగ్గర కొన్ని ముక్కలుగా అయి, దానితో పాటు ఆ ప్రదేశంలో గాయం కనిపిస్తుంది. విరిగిన ఎముక కొనలు చర్మాన్ని చీల్చుకొని బయటకు వస్తాయి. జరిగిన రక్తస్రావం బయటకు తెలుస్తుంది. జటిలమైన ఎముక విరుపు (Complicated fracture) : ఈ రకమైన విరుపులో ఎముక విరగడంతో పాటు ముఖ్య అవయవాలైన కాలేయం, మెదడు, పేగులు మొదలైన భాగాలు దెబ్బతింటాయి. విఖండిత విరుపు: లేత ఎముక విరుపు: ఇందులో ఎముకకు ఒకవైపు భాగం మాత్రమే విరిగి ఎముక వంగుతుంది. ఇది లేతగా ఉండే చిన్నపిల్లలలో కనిపిస్తుంది.ఎముక విరిగిన చోట నొప్పిగా ఉంటుంది. ఒత్తిడిని ఏ మాత్రం భరించలేదు. విరిగిన చోట చుట్టూ వాపు ఉంటుంది. విరిగిన శరీర భాగాన్ని మామూలుగా కదల్చలేరు. విరిగిన చోట విరిగిన లేదా రాసుకున్న శబ్దం వస్తుంది లేదా తెలుస్తుంది. విరిగిన చోట కదలక అసామాన్యంగా ఉంటుంది. చెయ్యి లేదా కాలు వంకరపోవచ్చును. దీనికి కారణం ఎముక విరిగినప్పుడు దానికి అంటిపెట్టుకొని వున్న కండరాలు సంకోచించి, విరిగిన ఎముకల కొనలను ఒక దానిపై మరొకటి వచ్చేలా లాగుతాయి. దానితో ఆ భాగం పొట్టిగా అవుతుంది.ఎముక విరుపు(Bone fracture)ను కొన్ని X-రే లేదా ఎక్స్ రే (X-ray) చిత్రపటాలను చూసి నిర్ధారిస్తారు. దీని గురించి విరిగిన శరీర భాగాన్ని నిర్ధిష్టమైన విధంగా ఉంచి రెండు కంటే ఎక్కువ కోణాల నుండి చిత్రపటాల్ని తీయవలసి వుంటుంది. ప్రమాదం జరిగిన చోటనే ప్రథమ చికిత్స చేయాలి. రక్తస్రావం జరుగుతున్నప్పుడు గాయాన్ని శుభ్రపరచి రక్తస్రావాన్ని అరికట్టాలి. దెబ్బ తగిలిన భాగానికి కర్రబద్దలతో ఆధారం కల్పించాలి. జాగ్రత్తగా, గట్టిగా కట్టుకట్టాలి. విరిగిన ఎముక కదలకుండా కర్రబద్దలు ఉపయోగింగి కట్టుకట్టాలి. బ్యాండేజీ విరిగిన ఎముక మీద కాకుండా దానికి అటూ, ఇటూ కట్టాలి. అయితే రక్త ప్రసరణ ఆగిపోయేంత గట్టిగా కట్టకూడదు. ప్రమాదానికి గురైన వ్యక్తిని దగ్గరలోని వైద్యుని వద్దకు తీకుకొని వెళ్ళాలి.