ఉబ్బసము https://te.wikipedia.org/wiki/%E0%B0%89%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%B8%E0%B0%AE%E0%B1%81 ఉబ్బసము (ఆంగ్లం: Asthma) ఒక తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. ఇది దీర్ఘకాలంగా మనిషికి ఊపిరి అందకుండా చేస్తుంది. ఇది పిల్లలలోను పెద్దవారిలోను కూడా కనిపిస్తుంది. అయితే ఇద్దరిలోనూ కారణాలు వేరువేరుగా ఉంటాయి. ఈ వ్యాధి ప్రధాన లక్షణం ఆయాసం. ఈ వ్యాధి మూలంగా శ్వాస నాళాలు సంకోచించి వాపు మూలంగా శ్లేష్మం ఎక్కువగా తయారై ఊపిరికి అడ్డుకుంటాయి. అయితే ఇలా జరగడానికి సాధారణంగా వాతావరణంలోని ఎలర్జీ కలిగించే పదార్ధాల కారణంగా చెప్పవచ్చును. పొగాకు, చల్లని గాలి, సుగంధాలు, పెంపుడు జంతువుల ధూళి, వ్యాయామం, మానసిక ఆందోళన మొదలైనవి ఇందుకు ప్రధాన కారణాలు. పిల్లలలో జలుబు వంటి వైరస్ వ్యాధులు ప్రధాన కారణము. ఈ విధమైన శ్వాస నాళాల సంకోచం వలన పిల్లి కూతలు, ఆయాసం, ఛాతీ పట్టినట్లుగా ఉండడం, దగ్గు వస్తాయి. శ్వాస నాళాల వ్యాకోచాన్ని కలిగించే మందులు (Bronchodilators) సాధారణంగా మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అయితే తగ్గినట్లుగానే తగ్గి మళ్ళీ తిరిగి వచ్చేయడం ఉబ్బసం యొక్క ప్రధానమైన లక్షణం. ఇందుమూలంగా వీరు మందులకు అలవాటు పడిపోయే ప్రమాదం ఉంది. కొంతమందిలో ఈ వ్యాధి ప్రాణాంతకం కూడా కావచ్చును. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలలోని పట్టణ ప్రాంతాలలో ఉబ్బసం వ్యాధి ఎక్కువ అవుతుందని గుర్తించారు. దీని మూలంగా నలుగురిలో ఒకరు పిల్లలు ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందువలన పట్టణాలలోని వాతావరణ కాలుష్యం నియంత్రించేందుకు ప్రజల్ని జాగృతుల్ని చేయవలసి ఉంది. శ్వాసకోశాలు, జీవితపు మనుగడకు అవసరమైన ప్రాణవాయువును శ్వాసప్రక్రియ ద్వారా అందిస్తాయి. ప్రతిరోజూ మన శ్వాసకోశాలు, పలురకాల వాతావరణ పరిస్థితులు, ఎలర్జైన్లు, రసాయనాలు, పొగ, దుమ్ము, దూళి తదితర అంశాలకు లోనవుతుంటాయి. వీటివల్ల వివిధ రకాల దీర్ఘవ్యాధులు వస్తాయి. అలాంటి దీర్ఘకాలిక వ్యాధుల్లో ఆస్తమా ఒకటి. మన ముక్కులోకి, ఊపిరితిత్తుల్లోకి, శరీరానికి సరిపడని సూక్ష్మపదార్థాలు (ఎలర్జైన్స్) గాలి ద్వారా లేదా ఆహారం ద్వారా ప్రవేశించినప్పుడు వాటికి ప్రతిచర్యగా శరీరం స్పందించి కొన్ని రకాల రసాయనాలను విడుదల చేస్తుంది. వీటి ప్రభావం వల్ల మన శ్వాసనాళాలు కుంచించుకుపోతాయి. ఫలితంగా శ్వాసతీసుకోవడం కష్టమవుతుంది. ఆస్తమా ఉన్న వారిలో తరుచూ ఆయాసం రావడం, పిల్లికూతలు, దగ్గు, ఛాతీ బరువుగా ఉండడం, వ్యాయామం చేయలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటితో పాటు కొంత మందిలో తరుచూ తుమ్ములు రావడం, ముక్కునుంచి నీరు రావడం, తరుచూ జలుబు చేయడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఆస్తమా రావడానికి గల కారణాలు చాలానే ఉన్నప్పటికీ వాటిలో జన్యుసంబంధిత కారణాలు చాలా ప్రధానమైనవి. వీటితో పాటు వాతావరణ పరిస్థితులు, ఇంటిలోపల, బయటా గల వివిధ కాలుష్య కారణాల వల్ల కూడా ఆస్తమా రావచ్చు. లేదా అప్పటికే ఆస్తమా ఉంటే ఈ కారణాలతో మరికాస్తా పెరగవచ్చు. ఆస్తమా ఉన్న వారు సమస్య మరింత తీవ్రం కాకుండా ధూమనానానికి దూరంగా ఉండాలి. దుమ్మూదూళికి దూరంగా ఉండాలి. శీతల పానీయాలు, ఐస్‌క్రీములు, ఫ్రిజ్‌వాటర్ వంటి పడని పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో బూజు దులపడం వంటివి ఆస్తమా ఉన్నవారు చేయకూడదు. చలికాలం, పెంపుడు జంతువులు, వాటి ఉన్ని, గాలిలోని రసాయనాలు,, ఘాటు వాసనలు, అతిగా చేసే శారీరక శ్రమ, పుప్పొడి రేణువులు, ఇవన్నీ ఆస్తమా తీవ్రత పెరగడానికి కారణమవుతాయి. ఏదైతే ఒక వ్యాధికి కారణమవుతుందో అదే ఆ వ్యాధికి చికిత్సకు ఉపయోగపడుతుంది అనే ప్రకృతి సిద్ధాంతం పై హోమియో వైద్య విధానం ఆధారపడి ఉంది. దీన్నే లాటిన్ భాషలో 'సిమిలియా సిమిలిబస్ క్యూరెంటార్ ' అంటారు. ఇది ఇంచుమించు 'ఉష్ణం ఉష్ణేన శీతలం' అన్న సూత్రం లాంటిదే. ప్రకృతిని నిశితంగా పరిశీలించడం, అనుకరించడం ద్వారా అన్ని విజ్ఞాన శాస్త్రాల్లోనూ ఇలాంటి ఎన్నో గొప్ప విషయాలు కనుగొన్నారు. హోమియోపతి కూడా అలాంటి విజ్ఞాన శాస్త్రమే. ఆస్తమానుంచి పూర్తి ఉపశమనం కలిగించే మందులు హోమియోలో ఉన్నాయి. అయితే ఈ విధానం కేవలం ఆస్తమా లక్షణాలను తగ్గించడానికే పరిమితం కాకుండా, ఆ లక్షణాలను కలిగించే కారణాలను కూడా తొలగిస్తుంది. రోగి శరీర ధర్మాన్నే కాకుండా మానసిక తత్వాన్ని కూడా పూర్తిగా విశ్లేషించి హోమియో వైద్యులు మందులు సూచిస్తారు. అలాంటి మందుల్లో అకాలిఫా ఇండికా, ఎలియాంథస్ గాండ్యులోపా, అరాలియం రెసియోపా, బ్లాటా ఓరియంటాలిస్, బ్రోమియం, ఆర్సనికం ఆల్బం, ఆంటిమోనియం టార్టారికం, కాలికార్బ్, ఇపికాక్, పల్సటిల్లా వంటి మందులు ప్రముఖమైనవి. అయితే నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వీటిని వాడవలసి ఉంటుంది. ఉబ్బసం వ్యాధికోసం బత్తిన సోదరులు గత కొన్నేళ్ళుగా వేస్తున్న చేపమందుపై నటుడు డాక్టర్ రాజశేఖర్ స్పందించారు. వైద్య శాస్త్రంలో చేప మందువల్ల తగ్గిపోయే జబ్బు ఏదీ లేదని ఆయన అన్నారు. ఆస్త్మా గల వారు వింటర్ సీజన్‌లో ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు . అటువంటివారు ఆహారము విషయములో తగినంత శ్రద్ధ తీసుకుటే సమస్య తీవ్రతను కొంత తగ్గించుకోవచ్చును . అటు వంటి ఐదు పదార్థాలపై అవగాహన . ఆయుర్వేద, ప్రకృతి చికిత్సా నిపుణులు చెప్పిన ప్రకారము ఈ క్రింది కొన్ని పదార్ధములు ఉపయోగము ...-> 1.పాలకూర : మెగ్నీషయానికి పాలకూర మంచి ఆధారము . ఆస్త్మా లక్షణాలను తగ్గించడములో బాగా సహకరిస్తుంది. ఆస్తమా గలవారికి రక్తము లోనూ, టిష్యూలలోను మెగ్నీషియము స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీర్ఘకాలము మెగ్నీషియం స్థాయిలు పెంచుకోవడము వలన ఆస్త్మా ఎటాక్స్ తగ్గుతాయి. 2.రెడ్ క్యాప్సికం : దీనిలో " సి " విటమిన్‌ ఎక్కువ . ఇన్‌ప్లమేషన్‌ తగ్గించడములో బాగా దోహదపడుతుంది. అయితే మిగతా విటమిటన్‌ సి ఉన్న ఆహారపదార్ధాలు అస్త్మాకి మంచి చేయవు . రెడ్ మిరిపకాయలోని ఎస్కార్బిక్ యాసిడ్ " ఫాస్ఫోడిల్ స్టెరేజ్ " అనే ఎంజైమ్‌ ఉతపత్తిని అడ్డుకుంటుంది. చాలా ఆస్త్మా మందులలో ఇదే జరుగుతుంది . 3.ఉల్లి : వీటిలో కూడా యాంటీ - ఇన్‌ప్లమేటరీ, యాంటీ అస్త్మాటిక్ ప్రభావాలున్నాయి. ఉల్లి తినడము వల్ల ' హిస్తమిన్‌ ' విడుదలను అడ్డుకుంటుంది. దీనివల బ్రోంకియల్ అబ్ స్ట్ర్క్షక్షన్‌ తగ్గుతుంది. 4.ఆరెంజ్ : కమలా, నారింజ, నిమ్మలలో ఉండే విటమిన్‌ ' సి ' ఉబ్బస లక్షణాలు తగ్గిస్తుందని అనేక పరిశోధనలు ఉన్నాయి. ముఖ్యముగా చిన్నపిల్లలో ఈ లక్షణాలు బాగా తగ్గినట్లు ఆధారాలు ఉన్నాయి. 5.యాపిల్ : వీటిలో ఉండే ' ఫైటోకెమికల్స్ ' అస్త్మాతో ఇబ్బంది పడే వారి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. యాపిల్ పై తొక్క ముదుర రంగులో ' లైకోఫిన్‌' ఎక్కువగా ఉన్నందున యాంటి-ఆక్షిడెంట్ గా ఆస్త్మారోగులము మేలుచేస్తుంది. ప్రపంచ ఆస్తమా దినం