ఒక యోగి ఆత్మకథ https://te.wikipedia.org/wiki/%E0%B0%92%E0%B0%95_%E0%B0%AF%E0%B1%8B%E0%B0%97%E0%B0%BF_%E0%B0%86%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AE%E0%B0%95%E0%B0%A5 ఒక యోగి ఆత్మకథ (ఆంగ్లం: Autobiography of a Yogi) ప్రముఖ భారతీయ యోగి పరమహంస యోగానంద రచించిన సంచలన ఆధ్యాత్మిక రచన. ఇందులో ఆయన ఆత్మకథను పొందుపరిచాడు. ఈ పుస్తకం ఎంతో మంది విదేశీయులకు యోగాను, ధ్యానాన్ని పరిచయం చేసింది. ఇప్పటి దాకా దాదాపు 50కి పైగా భాషల్లోకి అనువదించబడింది. ఆయన రచించిన పుస్తకాలన్నింటిలో ఈ పుస్తకం ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఈ పుస్తకంలో ప్రధానంగా యోగానంద తన గురువు కోసం అన్వేషణ, ఆ ప్రయత్నంలో భాగంగా ఆయనకు ఎదురైన ఆధ్యాత్మిక అనుభవాలు, అప్పట్లో పేరు గాంచిన ఆధ్యాత్మిక వేత్తలైన థెరెసా న్యూమన్, శ్రీ ఆనందమయి మా, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, నోబెల్ బహుమతి గ్రహీతయైన సి.వి. రామన్, అమెరికాకు చెందిన శాస్త్రవేత్త లూథర్ బర్బాంక్ మొదలైన వారితో గడిపిన ముఖ్యమైన ఘట్టాలు నిక్షిప్తం చేయబడ్డాయి. ఆయన గురువైన యుక్తేశ్వర్ గిరితో అనుబంధం, గురు శిష్యుల మధ్య సంబంధాల గురించి కూడా వివరాలు ఇందులో పొందుపరచబడ్డాయి. ఆయన ఈ పుస్తకాన్ని వీరికే అంకితం చేశాడు. యోగానంద గురువైన యుక్తేశ్వర్ గిరి, తనకు గురువైన లాహిరీ మహాశయులు వెల్లడించిన భవిష్యవాణి గురించి శిష్యుడికి తెలియజేశాడు. లాహిరీ మహాశయులు ఈ విధంగా అంటుండగా యుక్తేశ్వర్ వినడం తటస్థించింది. "నేను గతించిన యాభై సంవత్సరాల తర్వాత పాశ్చాత్యుల్లో యోగా పట్ల ఏర్పడే ఉత్సుకత ఫలితంగా నా జీవితం గురించి రాస్తారు. ప్రపంచ వ్యాప్తంగా యోగా ప్రాభల్యం పెరుగుతుంది. అందరి పుట్టుకకూ కారణమైన ఒకే పరమాత్మ గురించిన ఆలోచన సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుంది". 1895లో లాహిరీ మహాశయుల మరణించిన సరిగ్గా యాభై సంవత్సరాలకు అంటే 1945లో ఒక యోగి ఆత్మకథ (ఆంగ్లం) పుస్తకం మొదటి సారిగా ప్రచురణకు సిద్ధం అయింది. యోగానంద పిన్న వయసులోనే భారతదేశంలోని గొప్ప యోగులను కలవడం తటస్థించింది. ఉన్నత పాఠశాల విద్య పూర్తి కాకముందే ఆయన కనబరిచిన అనేక ఆధ్యాత్మిక శక్తులను, గురువు దగ్గర ఆయన శిక్షణ గురించిన విశేషాలు యోగానంద తమ్ముడైన సనంద లాల్ ఘోష్ రచించిన పుస్తకంలో సవివరంగా వివరించబడ్డాయి. బాల్యంలోనే ఆధ్యాత్మికత వైపు మొగ్గు ఆధ్యాత్మిక ప్రభావాలు, వారసత్వం గురుశిష్య సంబంధాలు క్రియాయోగంఈ పుస్తకం ప్రచురితమైనప్పటి నుంచి చాలామంది పాశ్చాత్యులకు ధ్యానం, యోగా ను పరిచయం చేసింది.. ఈ పుస్తకాన్ని పలువురు వ్యాపార వినోద రంగంలో ఉన్న లబ్ధప్రతిష్టులు సిఫారసు చేశారు. వీరిలో ముఖ్యమైన వాడు ఆపిల్ సంస్థ వ్యవస్థాపకుడైన స్టీవ్ జాబ్స్. వాల్టర్ ఐజాక్సన్ అనే కథకుడి ప్రకారం స్టీవ్ జాబ్స్ ఈ పుస్తకాన్ని మొట్టమొదటి సారిగా టీనేజ్ లో ఉన్నపుడు చదివాడు. తర్వాత ఆయన భారతదేశానికి వచ్చినపుడు చదివాడు. మళ్ళీ సంవత్సరానికి ఒకసారి చదివే వాడని తెలియజేశాడు. సేల్స్ ఫోర్స్ సి.యి.ఓ అయిన మార్క్ బెనియాఫ్ స్టీవ్ జాబ్స్ మృతికి నివాళిగా జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యాడు. అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయే సమయంలో అందరికీ ఒక చిన్న పెట్టెలో ఈ పుస్తకాన్ని ఇచ్చి పంపారు. మొదటి నుంచీ స్టీవ్ జాబ్స్ సలహాలు స్వీకరించిన మార్క్ ఇది ఆయన ఆలోచనే అయ్యుంటుందని భావించాడు. జాబ్స్ ఏది చేసినా ఏదో ఒక పరమార్థం ఆశించే చేస్తాడనీ, కాబట్టి ఆ పుస్తకం కచ్చితంగా మంచిదే అయ్యుంటుందని మార్క్ అభిప్రాయం. క్రికెట్ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా ఈ పుస్తకం తనకి ఎంతగానో ఉపయోగపడింది అని ఒకసారి అని ఉన్నాడు. ఆయన జీవిత కాలంలో ఈ పుస్తకం మూడు ఎడిషన్లు వెలువడింది. మొదటిది 1946లో, రెండవది 1949లో, మూడవది 1951లో వెలువడ్డాయి.