దండాసనం https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%82%E0%B0%A1%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%82 దండాసనం యోగాలో ఒక విధమైన ఆసనం. ఇది కూర్చుని వేసే ఆసనం. కూర్చుని వేసే అనేక ఇతర ఆసనాలకు ఇది పునాది వంటిది. దండం అనగా కర్ర. ఈ ఆసనం వేసినపుడు కటి నుండి పైభాగం ఒక కర్రలాగా నేలకు లంబంగా నిలబడి ఉంటుంది. కాళ్ళు రెండూ భూమిపై ఒక కర్రలా చాపి ఉంచుతారు. అందువల్లనే ఈ ఆసనానికి దండాసనం అనే పేరు వచ్చింది. నిటారుగా కూర్చుని, కాళ్ళు ముందుకు చాపాలి. దేహానికి అటూ ఇటూ చేతులను కిందికి చాపి, అరచేతులను నేలపై ఆనించాలి. కటి నుండి పై భాగం నిటారుగా, వీపు నేలకు లంబంగా ఉండాలి (ఒక గోడకు ఆనుకుని కూర్చున్నట్లుగా ఉండాలి). కాళ్ళూ రెండూ ఒకదానికొకటి ఆన్చి (కదవేసి) ఉంచాలి. అరికాళ్ళను నిటారుగా ఉంచి, కాలివేళ్ళను వెనక్కి దేహం వైపు చూస్తున్నట్లుగా వంచాలి. తలను వంచకుండా నిటారుగా ఉంచుతూనే, చుబుకాన్ని ఛాతీ వైపు లాగి పెట్టాలి. ఈ ఆసనంలో కూర్చుని ఉండగా, శ్వాస మామూలుగా తీసుకోవాలి. గాలి పీల్చి నిలిపి ఉంచరాదు.