మెడిసిన్ ఫ్రమ్ ది స్కై https://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%86%E0%B0%A1%E0%B0%BF%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D_%E0%B0%AB%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B1%8D_%E0%B0%A6%E0%B0%BF_%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B1%88 మెడిసిన్ ఫ్రమ్ ది స్కై అనేది తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన విన్నూత కార్యక్రమం. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ పరిధిలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ ఆధ్వర్యంలో భారతదేశంలో తొలిసారిగా ఆకాశమార్గాన డ్రోన్‌లతో ఔషధాల పంపిణీ ప్రాజెక్టు వికారాబాద్‌లో ప్రారంభమయింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు ఔషధాలు, టీకాలను వేగంగా చేరవేయడానికి డ్రోన్లను వినియోగిస్తున్నారు. మెడికల్ డెలివరీ డ్రోన్‌లు సుదూర ప్రాంతాలకు చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలోని సహాయకులు ఒక బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా కొన్ని నిమిషాల్లోనే రోజువారీ ఔషధాలను పొందవచ్చు భారతదేశం అంతటా డ్రోన్ ఆధారిత వైద్య డెలివరీలను అమలు చేయడం కోసం నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో 2021, ఫిబ్రవరి 11న రౌండ్ టేబుల్ చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టు ప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకువచ్చి "వేగవంతమైన వ్యాక్సిన్ డెలివరీ, మెరుగైన ఆరోగ్య సంరక్షణ" విషయంలో చొరవ చూపడంతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మానవరహిత విమాన వ్యవస్థ (యుఏఎస్) 2021 నియమాల నుండి మినహాయింపును మంజూరు చేసింది, విజువల్ లైన్ ఆఫ్ సైట్ బియాండ్ డ్రోన్ కార్యకలాపాలను దాటి నిర్వహించడానికి అనుమతిని మంజూరు చేసింది. అటవీ ప్రాంతాలలో జీవిస్తున్న ప్రజలకు డ్రోన్ల ద్వారా మెడిసిన్ సరఫరా చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రపంచ ఆర్థిక వేదిక, నీతి ఆయోగ్, హెల్త్​నెట్ గ్లోబల్ వంటి సంస్థల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం రూపొందించబడింది. 2021, సెప్టెంబరు 11న కేంద్ర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కేటీఆర్, విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ లంక రమాదేవి తదితరుల చేతులమీదుగా వికారాబాద్​లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమయింది. భారతదేశంలోని అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు మారుమూల గ్రామీణ ప్రాంతాలలో, చేరుకోవడం కష్టతరమైన ప్రాంతాలలో (కొండలు, అటవీ లేదా నదీ ప్రాంతాలలో) ఉన్నాయి. దీనివల్ల కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తుల వల్ల సంవత్సరంలో చాలా నెలలపాటు రహదారి కనెక్షన్‌లు నిలిపివేయబడతాయి. అలాంటి పరిస్థితులలో డ్రోన్లను ఉపయోగించి ఔషధాల పంపిణి చేయవచ్చు. ఫ్రిజ్‌లు, ఫ్రీజర్‌లు, నిరంతర కమ్యూనికేషన్, రియల్ టైమ్ కమాండ్ సెంటర్‌తో కూడిన కస్టమ్ డిజైన్ చేసిన మొబైల్ లాంచ్ ప్యాడ్ నుండి ఈ డ్రోన్‌లు ఎగురవేయబడతాయి. హెలికాప్టర్ ప్లాట్‌ఫారమ్ 20-40 కిలోమీటర్ల దూరం వరకు ఒక ట్రిప్‌లో 2-8 డిగ్రీల వద్ద 2,000-5,000 డోస్‌ల వ్యాక్సిన్‌లను సురక్షితంగా రవాణా చేయడం జరుగుతుంది. 40,000-1,00,000 డోస్‌లను రవాణా చేసే వివిధ ఆరోగ్య సౌకర్యాలకు ప్రతిరోజూ రెండు డ్రోన్‌లు 10 ట్రిప్పులు తిరుగుతాయి. అలాగే ఒక ట్రిప్‌లో రెండు నుండి నాలుగు ఉష్ణోగ్రత-నియంత్రిత పెట్టెలు 2,000 టీకాలు లేదా సుమారు 1,000 ఔషధ మోతాదులు లేదా 40 రక్త నమూనాలు లేదా రెండు యూనిట్ల రక్తాన్ని 20-40 కిలోమీటర్ల దూరం వరకు తీసుకువెళతాయి. రెండు డ్రోన్‌లు ప్రతిరోజూ 10 ట్రిప్పులు వివిధ ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళి నేరుగా డెలివరీ చేయగలవు. 'మెడిసిన్ ఫ్రమ్ ది స్కై' ప్రాజెక్ట్ ప్రయోగానికి డ్రోన్ విమానాలను నడిపేందుకు అవసరమైన మినహాయింపులు, హక్కులను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. ఆమోదించబడిన వ్యాక్సిన్‌లు, మందులు ఒక సంవత్సరం పాటు బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ లోపల డ్రోన్‌లను ఉపయోగించి పంపిణీ చేయబడతాయి. మొబైల్ యాప్ ద్వారా యాక్సెస్ చేయగల హెపికాప్టర్, "డెలివరీ హబ్-అండ్-స్పోక్ మోడల్‌లో పనిచేస్తుంది. యాప్ ద్వారా ఔషధాల జాబితాను చేర్చగానే, పంపిణీ బృందం అ సందేశాన్ని అందుకుంటుంది. అవసరమైన ఔషధాలను జాగ్రత్తగా ప్యాక్ చేసి, సాధారణ ప్రీ-ఫ్లైట్ పరీక్షలు, గాలి పరిస్థితులు, ఆడియో పైలట్ సిస్టమ్‌లు, జిపిఎస్ ట్రాకర్‌లను తనిఖీ చేసిన తర్వాత డ్రోన్‌లు బయలుదేరుతాయి. దానికి సంబంధించిన వివరాలు కోఆర్డినేట్‌లు సిస్టమ్‌లకు అందించబడతాయి. డ్రాప్-ఆఫ్ పాయింట్ దగ్గర ఆరోగ్య సమన్వయకర్తలు ఆ ఔషధాలను తీసుకుంటారు. సామాగ్రిని తీసుకువెళుతున్న ప్రతి డ్రోన్ పనితీరు వివరంగా రికార్డ్ చేయబడుతుంది, పూర్తి స్థాయి పంపిణీకి సంబంధించిన తదుపరి విధానాలకు మార్గనిర్దేశం చేయడానికి ఈ డేటా ఉపయోగించబడుతుంది. నీతి ఆయోగ్: ఔషధాల చేరవేతలో ‘మెడిసిన్‌ ఫ్రమ్‌ స్కై’ విధానం ద్వారా సమయం సగానికి తగ్గనున్నదని నీతి ఆయోగ్‌ పేర్కొన్నది. డ్రోన్ల ద్వారా ఔషధాలను చేరవేసేందుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైనట్టు తెలిపింది. నీతి ఆయోగ్‌ ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదికలో ‘మెడిసిన్‌ ఫ్రమ్‌ స్కై’ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో చేపట్టిన కార్యక్రమాల జాబితాలో స్థానం కల్పించింది.