డాక్టర్ సి.వి.జి.చౌదరి https://te.wikipedia.org/wiki/%E0%B0%A1%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D_%E0%B0%B8%E0%B0%BF.%E0%B0%B5%E0%B0%BF.%E0%B0%9C%E0%B0%BF.%E0%B0%9A%E0%B1%8C%E0%B0%A6%E0%B0%B0%E0%B0%BF డా.సి.వి.జి.చౌదరి MRCVS (1914- 1989) గా పిలవబడే గోరంట్ల చిన వెంకటేశ్వర్లు  చౌదరి భారత దేశంలో వెటర్నరీ విద్యలో విశేష కృషి చేసిన తొలి తరం పశు వైద్య శాస్త్ర విద్యావేత్త, బ్రిటిష్ ప్రభుత్వరాజ్య పురస్కారాలలో మూడవదైన M.B.E.అవార్డును పొందారు. మేజర్ సి.వి.జి.చౌదరి,  లండన్ వెంకటేశ్వర్లుగా పిలవబడే గోరంట్ల చిన వెంకటేశ్వర్లు  చౌదరి గారు ప్రకాశం జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామంలో గోరంట్ల వీరరాఘవయ్య, పిచ్చమ్మ దంపతులకు ప్రధమ సంతానంగా 1914లో జన్మించారు. వీరికి ముగ్గురు సోదరులు మరియు ఒక సోదరి. వీరన్నపాలెం వీధిబడిలో ప్రాధమిక అక్షరాభ్యసం చేసుకున్న చౌదరిని హైస్కూల్ చదువు కొరకు బాపట్లలో చేరారు. వసతి సౌకర్యాలు లేని ఆ రోజులలో శ్రమించి PUC వరకు చదివారు. చౌదరి గారి వివాహం 15 ఏళ్ళ వయస్సులో సరోజినీ దేవి (బుల్లెమ్మ) గారితో 1929లో జరిగింది. ఆతరువాత కాకినాడ పి.ఆర్.కళాశాలలో రసాయనిక శాస్త్రంలో B.Sc డిగ్రీ పూర్తిచేసుకొన్నారు. చౌదరి గారు ఉద్యోగ అన్వేషణ మాని షుగర్ టెక్నాలజీ లో ఉన్నత విద్య అభ్యసించటానికి 1935 లో ఇంగ్లాండ్ వెళ్లారు. మన దేశంలో పశు వైద్యులు కొరత తీవ్రంగా ఉందన్న మిత్రుల సలహా మేరకు మనసు మార్చుకొని వెటర్నరీ కోర్సులో చేరారు. స్కాట్లాండ్ లో ఎడింబర్గ్ విశ్వవిద్యాలయం లోని రాయల్ (డిక్) పశు వైద్య కళాశాల లో పశు వైద్య శాస్త్రం నందు BVMS , MRCVS గా 1940లో భారతదేశం తిరిగివచ్చారు. ఇండియా తిరిగివచ్చిన చౌదరి 1940 లో హిమాలయ పర్వతశ్రేణిలో ఉన్న ముక్తేశ్వర్ లో  ఇంపీరియల్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్ట్యూట్ నందు పరిశోధనా విభాగంలో శాస్త్రవేత్తగా చేరారు. ప్రపంచ గుత్తాధిపత్యం కొరకు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న ఆసమయంలో దేశం కొరకు యువకులు  సైన్యంలో జేరుతున్న రోజులవి. చౌదరి కూడా చేస్తున్న  ఉద్యోగాన్ని వదిలి 1941లో ఇండియన్ ఆర్మీ వెటర్నరీ కార్ప్స్(IAVC 14th DIV) లో లెఫ్టెంట్ గా చేరారు. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ నాయకత్వంలో గల అక్షరాజ్యాల తరువున జపాన్ దేశం  బర్మా (మైన్మార్) దేశాన్ని ఆక్రమించి ఆతరువాత ఇండియా వైపుకు వస్తున్న జపాన్ సైనికులను నిలువరించటానికి బ్రిటీష్ ఇండియా తరుపున మన సైనిక దళం పశ్చమ బర్మాలోని అర్కాన్- మయుపెన్సులా యుద్ధ భూమికి వెళ్ళింది. 1942 నవంబర్- 1943 ఏప్రిల్ మధ్య కాలంలో బర్మా భూభాగంలో జరిగిన ఈ హోరాహోరీ యుద్ధంలో చౌదరిగారు వీరోచితంగా పాల్గొన్నారు. శత్రుసైనికుల విమాన దాడిలో పుట్టకొకరు, చెట్టుకొకరుగా చెల్లా చెదురైనా తోటి సైనికులను కూడగట్టి, ప్రాణభయంతో పారిపోయిన దళపతి బాధ్యతలను తానే స్వీకరించి వారిలో ధైర్యాన్ని నూరిపోశారు. చావు బతుకుల మధ్య అత్యంత క్లిష్ట పరిస్థితులలో శత్రుసైనికుల నుండి బాంబుదాడులు, తుపాకీ గుళ్ల వర్షం కురుస్తున్న వెనుకంజ వేయకుండా ధైర్యంగా ముందుండి నాయకత్వం వహించి తోటి సైనికులను విజయపధంలో నడిపించారు. శత్రుదాడిలో  దళ సభ్యులందరు మరణించి ఉంటారని భావిస్తున్న సమయంలో శత్రు మూకలను ఎదుర్కొని సురక్షితంగా వచ్చారు. యుద్ధ రంగంలో చౌదరి చూపించిన తెగువకు, అసామాన్య ధైర్య సాహసాలకు, అకుంఠిత దీక్షకు, పోరాట పటిమకు బ్రిటిష్ ప్రభుత్వం నుండి 1943, జూన్ లో అత్యుత్తమ ప్రభుత్వరాజ్య పురస్కారాలలో మూడవదైన M.B.E. అవార్డును కింగ్ జార్జి  VI ద్వారా లండన్లో అందుకున్నారు. 1946 లో యుద్ధం సద్దుమణగిన తరువాత మేజర్ గా పదోన్నతి పొంది ఇంటికి తిరిగి వచ్చారు. అప్పటికే రెండవ ప్రపంచ యుద్ధంలో దాదాపు మన సైనికులు 87వేల మంది, మేజర్ చౌదరి పనిచేసిన  దళం లో  5 వేల మంది   వీర మరణం చెందారు. వీటితో పాటు నాజీల యుద్ధ దమనకాండలు, హిరోషిమా-నాగసాకిలో దారుణ అణు విస్ఫోటన ఆక్రందనలు దేశంలో ఊరు వాడ వ్యాపించాయి. మేజర్ చౌదరి గారి ఆనాటి యుద్ధ వీరోచిత సాహస రోమాంచిత కథనాలు బంధుమిత్రులందరికి తెలిసాయి. ఇవి విని భీతిల్లిన కుటుంబ సభ్యులు తీవ్ర వత్తిడి చేసి చౌదరి చేత మిలటరీ నుండి రాజీనామా చేయించారు. ఆతరువాత 1947లో ఉత్తర ప్రదేశ్ లో మధుర లో కొత్తగా నెలకొల్పిన పశు వైద్య కళాశాలలో ప్రొఫెసర్ గా అధ్యాపక వృత్తిలో చేరి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆనాడు మన దేశంలోనే కాకుండా మొత్తం ఆసియాలోనే వెటర్నరీ వైద్య విద్యలో డిగ్రీ ఇచ్చే తొలి కళాశాల ఇది. చౌదరి గారు ఆదర్శ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఎందరో మొదటి తరం పశువైద్యులను తీర్చిదిద్దారు. పశు వైద్యంలో  అనేక జాతీయ, అంతర్జాతీయ పరిశోధన పత్రాలు సమర్పించారు. ఈ కళాశాలకు 1956 లో ద్వితీయ ప్రిన్సిపాల్ గా నియమింపబడి 1974 వరకు 18 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం పనిచేసారు. 1972లో కాలేజీ రజతోత్సవ సందర్భంగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నుండి విశిష్ట పురస్కారం పొందారు. 1974 లో పదవీవిరమణ చేశారు ఈ వెటర్నరీ కాలేజి నేడు దేశంలో అత్యుత్తమ పశు వైద్య కళాశాలగా పేరుగడించింది. ఈ కళాశాల  2001లో ఉత్తరప్రదేశ్ పండిట్ దీనదయాళ్ ఉపాద్యయ పశువైద్య విశ్వవిద్యాలయం గా రూపాంతరం చెందింది. దీని ప్రగతి వెనుక చౌదరి గారు చేసిన అవిరాళ కృషి నిరుపమానం. ప్రిన్సిపాల్ గా పదవీ విరమాణాంతరం చౌదరి గారు 1974 నుండి 1977 వరకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వారి FAO మరియు UNDP సంయుక్త పధకానికి సిరియా దేశంలో డమాస్కస్ నగరంలో ప్రాజెక్టు మేనేజర్ గా విశేష సేవలందించారు. సిరియా దేశంలో మొట్టమొదటి వెటర్నరీ కాలేజీని స్థాపించటానికి సహాయ సహకారాలు అందించారు. చమురు పై ఆధారపడిన ఒక అరబ్బు దేశం సిరియాలో ఆహార భద్రత, వ్యవసాయ అభివృద్ధి రంగాలలో చౌదరి గారు చేసిన విశేష సేవలకు గుర్తింపుగా 'యునైటెడ్ నేషన్స్ పీస్ మెడల్' ను పొందారు. భారత దేశంలో వెటర్నరీ విద్యలో విశేష కృషి చేసిన తొలి తరం పశు వైద్య శాస్త్ర విద్యావేత్త గా పేరు పొందిన డా. సి.వి.జి.చౌదరి గారు హైదరాబాద్ లో తమ స్వగృహంలో శేషజీవితాన్ని ప్రశాంతంగా జీవిస్తూ తన 75వ ఏట 21-05-1989న మరణించారు. వీరికి రామచంద్ర రావు, రాఘవేంద్ర రావు అనే కుమారులు, ఇందిరా దేవి, రాజ్య లక్ష్మీ అనే కుమార్తెలు కలరు. బ్రిటిష్ ప్రభుత్వం నుండి 1943, జూన్ లో అత్యుత్తమ ప్రభుత్వరాజ్య పురస్కారాలలో మూడవదైన M.B.E. (Most Excellent Order of the British Empire) అవార్డు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నుండి 1972 లో విశిష్ట పురస్కారం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ నుండి 1977 లో 'యునైటెడ్ నేషన్స్ పీస్ మెడల్' 1.0 1.1 1.2 శ్రీనివాస్, కొడాలి (2018). వీరన్నపాలెం గ్రామ చరిత్ర. గుంటూరు: కొమల చారిటిబుల్ ట్రస్ట్.