హైదరాబాద్ : రాష్ట్ర విభజన జరిగితే గ్రేటర్ రాయలసీమను ప్రకటించాలని, ప్రత్యేక ప్యాకేజీని కూడా ఇవ్వాలని రాయలసీమ హక్కుల ఐక్య వేదిక అధ్యక్షుడు టీజీ వెంకటేష్ డిమాండ్ చేసారు. తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని, అయితే వెనుకబాటుతనం ప్రాతిపదికగా రాష్ట్రాలను విభజించాల్సి వస్తే కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్ ను పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న శ్రీకృష్ణ కమిటీకి సమర్పించేందుకు టీజీ వెంకటేష్ నివేదికను సిద్దం చేసారు. దీని ముసాయిదాను ఆయన బుధవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలుకు అందేచేసారు. రాయలసీమ ప్రాంతంలో వివిధ రంగాల్లో జరిగిన అభివృద్ధిని ఆయన ఇందులో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాతే తెలంగాణలో అభివృద్ధి వేగవంతమైందని గణాంకాలతో సహా ఆయన ముసాయిదాలో పొందుపరిచారు. అభివృద్ధికి ప్రామాణికంగా భావించే ఆర్థికాభివద్ధి పెరుగుదల రేటు తెలంగాణలోనే అధికంగా ఉందని ఆయన వివరించారు. తెలంగాణలోని అదిలాబాద్, నిజామాబాద్, మినహా అన్ని జిల్లాల్లో వృద్ధి రేటు రాష్ట్ర సగటు కంటే ఎక్కువని వివరించారు. సీమాంధ్రలో విశాఖ, కృష్ణా, ప్రకాశం జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో వృద్ధిరేటు రాష్ట్ర సగటు కంటే తక్కువని గుర్తు చేసారు. తెలంగాణ అభివృధ్దిలో వెనుకబడిందన్న ప్రచారం రాజకీయ నిరుద్యోగులు చేసిన పనేనని ఆయన అన్నారు. సెంటిమెంట్ ప్రాతిపదికన రాష్ట్ర విభజన జరపరాదని టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు.