37.txt 39.1 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165
చదువు_(నవల)

https://te.wikipedia.org/wiki/చదువు_(నవల)

కొడవటిగంటి కుటుంబరావు రచించిన చదువు నవల సామాజిక జీవన చిత్రణ
చిప్పగిరి సాయి చరణ్.
ఒక రచనలో రచయిత జీవితం వర్ణితమవుతుందా?
రచయిత ఆలోచన తెలుస్తుందా?
ఆనాటి సమాజం తెలుస్తుందా?
వంటి అనేక ప్రశ్నలు కొడవటిగంటి కుటుంబరావు రాసిన ‘చదువు’ నవల చదివినప్పుడు పాఠకులకు కలుగుతాయి.
కె.వి.రమణారెడ్డి ఈ నవలను సంఘ చరిత్రాత్మక నవలగా, ఆత్మ చరిత్ర నవలగా వ్యాఖ్యానించారు.
రచయిత ఆత్మకథ గల నవలగా నవీన్‌ అభిప్రాయపడ్డారు.
ఇదే నవలను కాత్యాయని విద్మహే ప్రాతినిథ్య నవల అని పేర్కొన్నారు.
టి.జి.ఆర్‌ ప్రసాద్‌ తన పరిశోధనలో రచయిత స్వీయ అభిప్రాయాలు ఉన్నాయన్నారు ఇదొక చారిత్రక వాస్తవికత ఉన్న నవలగా కేతు విశ్వనాథరెడ్డి అభిప్రాయ పడ్డారు.
ఒక నవలను ఆ రచయిత జీవిత కోణాన్నుండి అవగాహన చేసుకోవటం అవసరమా అనే అనుమానం చదువు నవలను, ఆ నవలపై వచ్చిన విమర్శలను చదివిన వారికి కలుగుతుంది.
మరి రచయిత ఈ నవల గురించి ఎక్కడైనా, ఏమైనా అభిప్రాయాన్ని వ్యక్తీకరించారా?
అయితే ఆ అభిప్రాయాల్ని విమర్శకుల అభిప్రాయాల్ని తులనాత్మకంగా పరిశీలించటం అవసరం అనిపిస్తుంది.
కొడవటిగంటి కుటుంబరావు 1909 అక్టోబరు 28 తేదిన గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు.
ఈయన విద్యాభ్యాసం స్కూలు ఫైనలు వరకు తెనాలిలో జరిగింది.
ఆ తరువాత 1926-27 మధ్య గుంటూరు ఏ.సి.
కాలేజీలో ఇంటరు, 1927-29 మధ్య విజయనగరం మహారాజు కళాశాలలో బి.ఎ.
ఫిజిక్సు చదివారు.
1929లో కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్‌.సి.
ఫిజిక్సులో చేరారు.
కాని శాసనోల్లంఘన జాతీయోద్యమం కారణంగా, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తాకిడి కారణంగా రెండవ సంవత్సరంలో చదువు ఆగిపోయింది.
కొడవటిగంటి కుటుంబరావు దాదాపు యాభైయేళ్ళ కాలంలో పది పన్నెండువేల పేజీలకు మించిన సాహిత్యం రాశారు.
నాలుగు వందలకు పైగా కథలు, దాదాపు ఎనభై గల్పికలు, ఇరవై నవలలు వంద దాకా రేడియో నాటికలు, రెండు మూడు సినిమా స్క్రిప్టులు ఆరేడు వందలకు పైగా సాహిత్య సాంస్కృతిక, వైజ్ఞానికి వ్యాసాలు, ఫీచర్లు, పుస్తక సమీక్షలు, పుస్తక పరిచయాలు రాశారు.
చదువు నవల 1952లో పుస్తక రూపంలో ప్రచురించబడింది.
అంతకు ముందు ఆంధ్రజ్యోతి మాసపత్రికలో 1950 నుండి నవంబరు 51 వరకు ధారావాహికగా ప్రచురింపబడింది.
ఈ నవలలో రచయిత తన భావనను ‘సుందరం’ పాత్ర ద్వారా చూపించారు.
రచయిత మాటల్లో చెప్పాలంటే “విద్య అంటే జ్ఞానం సంపాదించటం, జ్ఞానం రెండు విధాలు.
పుస్తక జ్ఞానమూ, అనుభవ జ్ఞానమూ, ఈ రెండు రకాల జ్ఞానమూ విద్య ద్వారా లభ్యం కావాలి” (కుటుంబరావు, కొవటిగంటి 1974) ఇంచు మించు ఈ అభిప్రాయాన్ని నిరూపిస్తూ రాసిన నవల చదువు.
ఈ నవలలో రచయిత జీవితం కథావస్తువుకు చాలా దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తుంది.
కాని చాలా మంది సుందరం పాత్ర రచయిత జీవితానుభవాల నుంచి వచ్చిందని లేదా రూపొందిందని అభిప్రాయపడుతుంటారు.
కాని ఒక సందర్భంలో రచయిత చదువు నవల తన ఆత్మకథ కాదని అందులో ఉన్న సన్నివేశాలు, సంఘటనలు తాను చూసినవేనని సుందరం పాత్రను కేంద్రంగా చేసుకొని ఈ నవలను చూడకూడదనీ, సామాజిక చరిత్రకు ప్రాధాన్యతనివ్వాలని అభిప్రాయపడ్డారు.
ఈ నవలలో రచయిత జీవితం, అనుభవాలు ప్రతిఫలించాయి.
అవి ఆనాటి సామాజిక జీవితాన్ని చిత్రికరించటానికి ఉపయోగపడిన అనుభవాలు.
అంతే తప్ప రచయిత జీవితం కాదు.
కనుక ఇది రచయిత ఆత్మకథ కాదని గర్తించాలి.
ఈ నవలలో 1915 నుండి 1935 వరకు భారతదేశంలో జరిగిన చరిత్రను సామాజిక కోణం నుండి చిత్రించడం కనిపిస్తుంది.
కనుక రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో వచ్చిన పరిణామాలు ఈ నవలలో చక్కగా వర్ణించబడ్డాయి.
రచయిత ఒక సందర్భంలో నవల గురించి చెప్తూ, “నవలాకారుడు తనకు పరిచయమైన వాతావరణాన్ని, జీవితాన్ని, పాత్రలోను మాత్రమే సృష్టించగలడు.
‘చదువు’ నవలలో డిప్రెషన్‌’ (ఆర్తిక మాంద్యం)కు ముందు ఇరవై సంవత్సరాల సాంఘిక వాతావరణాన్ని చిత్రించటానికి ప్రయత్నించాడు.
అయినప్పటికీ ఇదే కాలంలో జరిగిన పరిస్థితులను వర్ణిస్తూ ఇంకో ఇరవై నవలలు రాయటానికి అవకాశం ఉంది” (కుటుంబరావు 1969) అన్నారు.
దీన్ని బట్టి -ఒక నవలలో ఒక నాటి సంఘజీవితం ప్రతిఫలించే అవకాశం ఉంది కాని ఒకే నవలలో ఆనాటి సమాజం పూర్తిగా ప్రతిఫలించదు అని, ఒక కోణం మాత్రమే ప్రతిఫలిస్తుంది అని గ్రహించాలి.
ఈ అవగాహనతో చదువు నవలను అర్థం చేసుకోవచ్చు.
చదువు నవలలోని ముఖ్య వస్తువు ఆనాటి విద్యావిధానం.
అంటే స్వాతంత్ర్యానికి ముందు ఉన్నవిద్యావిధానం, ఆనాటి ప్రజల్లో దేశీయ విద్యకు ఉన్న ఆదరణ, ఆంగ్ల విద్య అవశ్యకత పట్ల ప్రజల్లో ఉన్న అవగాహన వంటివి ఈ నవల ద్వారా అవగతమవుతాయి.
ఒక సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబాలలో ఐదవ ఏటనే పుట్టువెంట్రుకలు తీసి శాస్రోక్తంగా అక్షరాభ్యాసం చేసి వీధి బడులకు పంపించేవాళ్ళు.
ఆ వీధి బడుల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగానూ, మాస్టర్ల సంఖ్య తక్కువగాను ఉండేది.
అంటే ఒకళ్ళో, ఇద్దరో మాత్రమే ఉండేవారు.
మాస్టర్లకు జీతభత్యాలు అంతంత మాత్రంగా ఉండేవి.
పిల్లలకు చదువు రావాలంటే వాళ్ళకు భయభక్తులు ఉండాలని, అందుకు పిల్లలను కొట్టడం, తిట్టటం అవసరమని మాస్టర్లు భావించేవాళ్ళు.
దీనివల్ల కూడా పిల్లలలో చదువు పట్ల ఆసక్తి తక్కువగా ఉండేదని తెలుస్తుంది.
బ్రిటిష్‌ప్రభుత్వం భారతదేశంలో ఆంగ్ల విద్యావిధానం ప్రవేశ పెట్టటం వల్ల ఉన్నత పాఠశాల చదువు పట్ల ఆసక్తి కలిగిన విద్యార్థులు వీధి బడుల నుంచి ఉన్నత పాఠశాలకు మారి తమ చదువులను కొనసాగించారు.
అలాగే స్కూలుఫైనలు తరువాత కొంత మంది విద్యార్థులు టైపు, షార్ట్‌ హాండ్‌ పట్ల ఆసక్తి చూపేవారు.
ఇది నేర్చుకోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు వెంటనే దొరుకుతాయని వాళ్ళు అభిప్రాయపడేవాళ్ళు.
ఇదే కాకుండా ఉన్నత విద్య అభ్యసించటం కొరకు చదువును కొనసాగించేవాళ్ళ వర్గం కూడా ఉండేదని సుందరం పాత్ర ద్వారా సూచించారు రచయిత.
సుందరం స్కూలు ఫైనల్‌ తరువాత ఇంటరు, బి.ఎ., తరువాత ఎల్‌.ఎల్‌.బి, ఎం.ఎ.
చేయటానికి బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయానికి వెళ్లాడు.
అలాగే టైపు, షార్ట్‌ హాండ్‌ నేర్చుకొని ఉద్యోగంలో స్థిరపడేవారు కొందరు ఉంటారని సుందరం స్నేహితుడైనా నాగేశ్వరరావు పాత్ర ద్వారా సూచించారు.
ఈ విధంగా, ఆనాటి చదువుకున్న యువకుల అభిప్రాయాలను ఈ రెండు పాత్రల ద్వారా రచయిత చక్కగా సూచించారు.
దీన్ని బట్టి ఆనాటి విద్యార్థులలో ఒకవైపు చదువుతూనే అది జీవనోపాధికి ఉపయోగపడాలనే ఆకాంక్ష ఉండేదనీ, కొంతమంది ఉపాధి కంటే ఉన్నత విద్యను అభ్యసించాలని భావించేవారని తెలుస్తుంది.
చదువు నవలలో స్వాతంత్ర్యానికి ముందు పేర్కొన్న 1915 నుండి 1935 ప్రాంతంలో ఆనాటి స్త్రీల స్థితిగతుల్లో చెప్పుకోదగ్గ మార్పు ఏమీ లేదు.
ఆనాటి సమాజంలో ఆడపిల్లలకు రజస్వల కాకమునుపే బాల్య వివాహాలు జరిగేవి.
రజస్వల అయిన ఆడపిల్ల పెళ్ళికి పనికిరాదనే మూఢ విశ్వాసం ఆనాటి ప్రజల్లో బలంగా ఉండేది.
సీతమ్మ తన కూతురు లక్ష్మికి రజస్వల కాకముందే పెళ్ళి సంబంధాలు చూడటం చివరకు మేనల్లుడికే ఇచ్చి పెళ్ళి చేయటం వంటి పరిస్థితులను జానకి పాత్ర ద్వారా రచయిత సూచిస్తారు.
స్త్రీలకు చదువు అంత ముఖ్యమైనది కాదనే అభిప్రాయం ఆనాటి ప్రజల్లో ఉండేది.
ఆడపిల్లలు బడికి వెళ్ళి చదువుకోవటం అరుదుగా జరిగింది.
అయినప్పుటికీ తన తోడబుట్ట్టిన అన్నల దగ్గిరో, తమ్ముళ్ల దగ్గిరో వాళ్ళు చదువుతుంటే వినీ, వాళ్ళ పుస్తకాలు చూసీ అక్షరాలు పోల్చుకుని కొంతవరకు చదవటం నేర్చుకొనేవాళ్ళని శేషగిరి కూతురు కృష్ణవేణి నాల్గవ ఏటనే తన అన్న నరసు పుస్తకాలు గడగడా చదవటం నేర్చుకున్నదని ఈ పాత్రద్వారా తెలియచేస్తారు.
అలాగే సీతమ్మ తన కూతురిని విడిగా ఆడపిల్లల బడిలో చేర్చి చదివిస్తుంది.
ఆమె ఎం చదివింది?
ఎంతవరకు చదివింది?
అనేవి ఈ నవలలో ఎక్కడా ప్రస్తావించలేదు.
ఇంకొక సందర్భంలో రచయిత ఆనాటి ఆడపిల్ల ఎంతవరకు చదువుకున్నదన్న ప్రశ్నకు జవాబుగా సుందరానికి పెళ్ళి సంబంధం చూసే ప్రయత్నంలో అతని మేనమామ శేషగిరిరావు, అతను కలిసి ఏటి వొడ్డు సంబంధం చూడబోయినప్పుడు శేషగిరిరావు పైప్రశ్న వేయటం పెళ్ళి కూతురు తన తండ్రివైపు నిస్సహాయంగా చూడటం అతను ‘రుక్మిణీ కళ్యాణం’లోని కొన్ని పద్యాలు వినిపించమనటం వంటి సన్నివేశాల ద్వారా ఆమె చదువుకోలేదనీ, వినటం ద్వారానే నేర్చుకున్నదనీ రచయత పరోక్షంగా సూచిస్తారు.
దీన్ని బట్టి ఆనాడు ఆడపిల్లలకు చదువు అంత ముఖ్య విషయంగా భావించేవారు కాదనేది తెలుస్తుంది.
విధవను చేసి ఆమెచేత రవ్వో పిండో తినిపించటమనేది ఆనాటి సమాజంలో ఉన్నట్లు రచయిత సీత పాత్ర ద్వారా తెలియజేస్తారు.
ఎక్కడో ఒకటి రెండు చోట్ల వితంతు పునర్వివాహాలు జరిగేవి.
అవి కూడా సమాజానికి భయపడి గుట్టు చప్పుడు కాకుండా రహస్యంగా జరిగేవని శకుంతల పాత్ర ద్వారా సూచించారు రచయిత.
బ్రహ్మసమాజం భావాలు ఆంధ్ర ప్రాంతంలో అక్కడక్కడ ఉన్నప్పటికీ అది అంత జనాదరణ పొందలేదనేది స్పష్టమవుతోంది.
జాతీయోద్యమం ప్రజలమీద అంతగా ప్రభావం చూపలేదనే చెప్పాలి.
ఎందుకంటే తాత్కాలికంగా ఉద్యమకారుల పాఠశాలలను మూయించినప్పటికీ కొన్నాళ్ళ తరువాత ఆ ఉద్యమం చప్పబడుతూ పాఠశాల విద్యార్థులు కొన్ని రోజులకు తిరిగి పాఠశాలలకు వెళ్ళటం జరిగింది.
ఉదాహరణకు ఈ నవలలోని సుందరం మొదట్లో ఉద్యమకారులకు మద్దతునిచ్చినప్పటికీ తన పాఠాలు ఎక్కడ వెనకబడిపోతాయో అని ఉద్యమం పట్ల తన అభిప్రాయాన్ని మార్చుకొని ఉన్నత పాఠశాలకు తిరిగి వెళ్ళటం ప్రారంభించటాన్ని రచయిత సూచిస్తారు.
అలాగే భారతదేశ పరిస్థితులు మారనప్పుడు స్వరాజ్యం వచ్చినా రాకపోయినా ఒకటే అనే అభిప్రాయం సుందరానికి కలిగింది.
దీనివల్ల ఆనాడు ప్రజల్లో కొందరు జాతీయోద్యమంలో మనస్ఫూర్తిగా పాల్గొనలేదని పరోక్షంగా చెప్తున్నట్లు అయింది.
సహాయనిరాకరణోద్యమ కాలంలో జాతీయ పాఠశాలలు, కళాశాలలు తెరిచినప్పటికీ ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల కొంత మంది ప్రజలు తమ పిల్లను పాఠశాలలకు పంపటం మానేయడం వల్ల కూడా ఈ పాఠశాలలు, కళాశాలలు మూత పడిపోయాయి.
గాంధీజీ భావాలలో ఒకటైన అస్పృశ్యతా నివారణ ప్రజల్లో వ్యతిరేక భావాల్ని కలిగించాయి.
ఈ ప్రస్తావన రచయిత శేషగిరి పాత్ర ద్వారా సూచిస్తారు.
కుటుంబరావు ఈ నవలలో డిప్రషన్‌ ప్రస్తావన తీసుకొచ్చి అంతర్జాతీయంగా ఏర్పడ్డ ఆర్థిక మాంద్యం వలన చదువులు ఆర్థాంతరంగా ఆగిపోయినట్లు సుందరం పాత్ర ద్వారా తెలియచేస్తారు.
బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో సుందరం ఎల్‌.ఎల్‌.బి.
ఎం.ఎ. రెండవ సంవత్సరం చదువుతుండగా జాతీయోద్యమ ప్రభావ వల్ల విశ్వవిద్యాలయం మూతబడుతుంది.
దానితో సుందరం స్వగ్రామానికి తిరిగి వచ్చేస్తారు.
మళ్ళీ కొన్నాళ్ళ తరువాత విశ్వవిద్యాలయం తెరిచినట్లు కబురు అందుతుంది.
కానీ మళ్ళీ వెళ్ళడానికి తన కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించదు.
అందువల్ల అతని చదువు అర్థాంతరంగా ఆగిపోయింది.
ఇక్కడ ఉన్నత విద్య అర్థాంతరంగా ఆగిపోవటం అనేది కేవలం సుందరానికే జరగలేదు.
‘సుందరం’ లాంటి వాళ్ళు ఎందరికో జరిగిందని అర్థం చేసుకోవాలి.
ఇలాంటి కారణాలను వర్ణించి సుందరం పాత్ర ద్వారా ఆనాటి ఆర్థిక పరిస్థితులను రచయిత తెలియజేశారు.
అందుకనే సామాజిక పరిస్థితిని చదువు నవల వర్ణించిందని చెప్తూ ఇలా అన్నారు.
“విదేశీ వస్తు బహిష్కారం గ్రామ సీమల్లో కూడా జరిగింది.
విద్యార్థులు విద్యాలయాలను వదిలేయటం, ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలను మానివేయటం, న్యాయవాదులు బ్రిటీష్‌ కోర్టులనుత్యజించటం జరిగేవి” (కేతువిశ్వనాథరెడ్డి 1982) కనుక సుందరం విద్యకు ఆటంకం అని కాదు.
ఆనాడు ఉన్నత విద్యకు వచ్చిన ఆటంకాలని అర్థం.
కుటుంబరావు ఆనాటి మత, సాంస్కృతిక పరిస్థితులను సూచిస్తూ కేవలం హిందూ మత ప్రాధాన్యత కలిగినటువంటి బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం ప్రస్తావన తెస్తారు.
సుందరం అక్కడ ఉన్నత విద్యను అభ్యసించటానికి వెళ్ళినప్పుడు, ఇస్లామ్‌ మత ప్రాధాన్యత కలిగిన అలీఘర్‌ విశ్వవిద్యాలయం ప్రస్తావన కనిపిస్తుంది.
అలీఘర్‌ విశ్వవిద్యాలయాన్ని చూడటానికి వచ్చినప్పుడు వాళ్ళ నడవడిక, వేషధారణ, క్రమపద్ధతిని గురించి ప్రస్తావిస్తారు.
వీటి అన్నింటివల్ల విద్యసంస్థలలో మత, జాతి, ప్రాంతీయ పరమై తేడాలు ఉండేవని తెలుస్తుంది.
మరొక సందర్భంలో బ్రిటీష్‌ వాళ్ళకు వ్యతిరేకంగా జాతీయ కళాశాలలు ఏర్పాటు చేసి ‘వృత్తి’ విద్య పట్ల ఆసక్తిని కలిగించాలనే ఆలోచనలు కనిపిస్తాయి.
ఈనవలలో మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల ప్రసక్తి కనిపిస్తుంది.
ఆ సమయంలో భారతదేశంలోని రాజకీయ, సాంఘిక పరిస్థితులను ప్రజల మనోభావాలను కొన్ని పాత్రల ద్వారా తెలియజేస్తారు రచయిత.
‘సుబ్బులు’ అనే ఒక చిన్న పిల్లవాడి పాత్ర ద్వారా మొదటి ప్రపంచ యుద్ధం ప్రస్తావన తీసుకొని వస్తారు.
ఇంగ్లీషువాళ్ళు గెలవకూడదు, జర్మన్లే గెలవాలి.
అప్పుడుగాని తమకీ కష్టాలన్నీ తీరవని తెలిసీ తెలియని జ్ఞానంతో ఆ పిల్లవాడు సుందరంతో అంటాడు.
అదే మొట్ట మొదటిసారి ఆ యుద్ధం గురించి ప్రస్తావించటం.
ఆ తరువాత ఇంకొక సందర్భంలో సుందరం ఉన్నత పాఠశాలలో చదువుతున్న్నప్పుడు స్కూలు మాస్టరు ఈ యుద్ధం గురించి ప్రస్తావిస్తూ జర్మన్లే ఓడిపోవాలని లేకపోతే ఇప్పటిదాకా నేర్చుకున్న ఇంగ్లీష్‌ విద్య ఆపేసి జర్మనీ భాష నేర్చుకోవలసి వస్తుందని అంటాడు.
సుందరానికి కూడా ఈ విషయంలో పూర్తి అవగాహన లేకపోవటంతో ఆంగ్లేయులే నెగ్గాలనీ లేకపోతే జర్మనీ భాష నేర్చుకోవలసి వస్తుందని అనుకుంటాడు.
యుద్ధకాలంలో ధరలు విపరీతంగా పెరిగిపోవటంతో ఆడవాళ్ళు ఇంటి దగ్గర పెరట్లో కూరగాయలు పండించు కునేవారు.
ఇటువంటి సామాన్య విషయాలను కూడా విస్మరించకుండా ఆనాటి జన జీవితంలోని చాలా అంశాలను రచయిత స్పృశించారు.
సుందరం హైస్కూలో ఉండగా జాతీయోద్యమంలో అతివాద, మితవాద ధోరణుల ప్రభావం గమనించాడు.
తిలక్‌ మరణం ఆ హైస్కూల్లో ఒక మాస్టరుపై తీవ్ర ప్రభావన్ని చూపించింది.
అందుకు ఆ రోజు పాఠాలు చెప్పలేదు.
హాజరు వేయలేదు.
కొంతసేపటి తరువాత ఆ స్కూలుకు సెలవు ప్రకటించారని తెలిసింది.
అప్పటికీ సుందరానికి జాతీయోద్యమం అంటే ఏమిటో సరిగ్గా తెలియదు.
అంతేకాదు తన చదువు పాడైపోతుందని విచారించాడు.
ఆంగ్లేయులతో జర్మనీ వాళ్ళు యుద్ధం చేసినప్పుడు జర్మనీ వాళ్ళు గెలిస్తే జర్మన్ నేర్చుకోవాల్సి వుంటుందని తెలిసి ఆంగ్లేయులే నెగ్గాలనుకుంటాడు.
ఇంతవరకు సుందరానికి జాతీయోద్యమ ప్రభావం సరిగ్గా అర్థం కాలేదని తెలుస్తుంది.
ఆ తరువాత కొంత మంది పెద్దలు జాతీయ కళాశాలలను ప్రారంభించాలని ప్రయత్నిస్తారు.
ఆంగ్ల ప్రభుత్వ ఆధ్వర్యంలోనడిచే చదువులకు వ్యతిరేకంగా జాతీయ కళాశాలల్ని ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయాలనుకున్నారు.
వీటిలోచదువుతో పాటు వివిధ వృత్తులను నేర్పాలనుకున్నారు.
అయితే అందులో అస్పృశ్యులకు ప్రవేశం కోసం తర్జన భర్జనలు పడ్డారు.
ఎక్కువ మంది ముందుగా సామాజిక ఉన్నత వర్గాలకు అవకాశం కల్పించాలని అస్పృశ్యులకు తరువాత చూడవచ్చని నిర్ణయించారు.
ఇవన్నీ సుందరానికి చదువుకోవటానికి అడ్డంకులు సృష్టించే అమోయమయ విధానాలుగా తోచేవి.
ఆ తరువాత కాకినాడలో జరిగిన కాంగ్రేస్‌ సమావేశానికి గాంధి వంటి నాయకులు వచ్చారని తెలుసుకుంటాడు.
ఆ గాంధీని చూడాలనుకున్నా అప్పుడు కుదరలేదు.
కానీ శేషగిరి ఆ పట్టణంలోఉద్యమాన్ని ఉధృతం చేస్తాడు.
విదేశీ వస్తు బహిష్కరణ జరుగుతున్నప్పుడు సుందరంలో ఏదో ఒక అసహనం ఉండేది.
కానీ బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలోఉన్నత విద్య అభ్యసించటానికి వెళ్ళినప్పుడు జాతీయోద్యమం పట్ల గాఢమైన అనుబంధం ఏర్పడింది.
అంతకు ముందు మద్రాసు వెళ్లినప్పుడు కొంత మంది జాతీయోద్యమ నాయకులను చూశాడు.
వాళ్ళ ప్రసంగాలను విన్నాడు.
అక్కడ జరగుతున్న్న కాంగ్రేస్‌ సమావేశానికి వచ్చినవాళ్ళు ఆ నాయకుల ప్రసంగాలు వినకుండా తిరగటం చూసి ఆశ్చర్య పోయాడు స్వాతంత్ర్య ఉద్యమం పట్ల చాలా మందికి త్రికరణ శుద్ధి లేదని గ్రహించాడు.
బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో అనేక రాష్ట్రాలనుండి వచ్చిన విద్యార్థులు సైనికుల్లా అంకిత భావంతో రాత్రనక పగలనక జాతీయ ఉద్యమ భావాలను ప్రచారం చేయటంలో ఒక నిష్కల్మషత కనిపించింది సుందరానికి.
అది అతడిని ఆకర్షించింది.
కనుక సుందరంలో జాతీయోద్యమ బీజాలు హైస్కూల్లో పడినా కాకినాడ కాంగ్రేస్‌ సభ గురించి తెలిసి కొంత ఆసక్తి కలిగినా, మద్రాసు వెళ్ళి జాతీయ నాయకుల ఉపన్యాసాలు విన్న తరువాతనే ఆ భావాలు నిజంగా మొలకెత్తాయనుకోవచ్చు.
అవి బెనారస్‌లో వృక్షమయ్యాయి.
ఈలోగా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం తాత్కాలికంగా మూతపడిపోవటంతో చదువు అర్థాంతరంగా ఆగిపోయింది.
సుందరం మీద జాతీయోద్యమ ప్రభావం అంటే కథా కాలం నాటి జాతీయోద్యమ ప్రభావం అని అర్థం.
అది సుందరం మీద కాని ప్రజల మీద కాని ఉండటమా ఉండకపోవటమూ అనేవి నవలలో స్పష్టంగా చిత్రించబడినయి.
కేతువారి మాటలలో చెప్పాలంటే ‘గాంధీజి అహింసాత్మక జాతీయోద్యమ ధోరణి ప్రజా బహుళ్యంలోకి చొచ్చుకొని పోతున్నప్పటికి 1920 ప్రాంతాలనాటి చిత్తశుద్ధి పూర్వకమైన ఉద్యమదీక్ష సన్నగల్లటం” (విశ్వనాథరెడ్డి 1982) ఈ నవలలో కనిపిస్తుంది.
యుద్ధానంతరం ప్రపంచ దేశాలలో ఏర్పడిన సంక్షోభం ఆనాటి కొంత మంది భారతీయులకు తెలిసే అవకాశంలేదు.
ఒకవేళ తెలిసినా అవి తమ జీవితాల్లో ఏలాంటి మార్పు తేస్తాయో ఊహించగలిగే స్థితిలో లేరు.
కనుక ఇవన్నీ తెలియని కొంతమంది ప్రజలకు అవి మంచి రోజులుగానే తోచాయి.
అందుకనే చాలా ఉత్సాహంతో ఉన్నారని, తాము ఇంతకు ముందు ఎన్నడూ చూడని రంగురంగుల వసతులు, బట్టలు చూసి ప్రజల్లో “చైతన్యం” వచ్చిందని రచయిత ఈ నవలలో మొదటి ప్రపంచ యుద్ధానంతర పరిస్థితులు ప్రజలపై చూపిన ప్రభావాలను కళ్ళకు కట్టించగలిగాడు.
ఇదంతా చూసిన తరువాత ఒక నవలపై భిన్న భావాల సంఘర్షణ కనిపించటం వల్లనే చదువు నవలకు నేటికీ గొప్ప ప్రాధాన్యత ఉందని తెలుస్తుంది.
రచయిత జీవితానుభావల నుండి సన్నివేశాలను కల్పించటం జరుగూతూ ఉంటుంది.
తన సృజనా శక్తిని దృక్పథానికి అనుగుణంగా మార్చుకోవటం జరుగుతుంది.
ప్రతి రచయితకు ఒక ప్రాపంచిక దృక్ఫథం ఉంటుంది.
అది కొడవటిగంటి కుటుంబరావుకు ఉంది.
అది చారిత్రక వాస్తవికతను ప్రతిఫలించే దృక్పథం.
అదే చదువులో నవలలలో ప్రతిఫలిస్తుంది.
అంతే తప్ప రచయిత స్వానుభావాలనో తన జీవిత ఘట్టాలనో నవలగా రాయలేదు.
తాను చూసిన జీవితాన్ని రాశారు.
తన అభిప్రాయాలను వివిధ పాత్రల ద్వారా వెల్లడించారు.
స్వాతంత్ర్యానికి ముందు భారత దేశ స్థితిగతులు, యుద్ధ సమయంలో, జాతీయోద్యమ సమయంలో, భారత దేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత ఉన్న పరిస్థితులన్నిటినీ ఒక్క క్రమ పద్ధతిలో వర్ణించటం నవల ప్రధాన లక్ష్యంగా గుర్తించాలి ఒక రచయిత ‘జీవితం’ గురించి చెప్పుటానికే నవల రాసినట్లయితే, నవలా సాహిత్యలో చదువు కూడా ఒక మామూలు నవల అయ్యేది.
అలా కాకుండా రచయిత ఈ నవల్లో అనేక జీవితాలను ఒక జీవితం (సుందరం) చుట్టూ వెల్లడించగలిగాడు.
అందుకనే స్వాతంత్ర్యానికి ముందు, తరువాత నెలకొని ఉన్న ‘విద్యావిధానం’ గురించి వచ్చిన నవలల్లో ఒకే ఒక ముఖ్య నవలగా చదువు తెలుగు సాహిత్యంలో నిలిచిపోయింది.