45.txt 4.56 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19
జమ్మూ_కాశ్మీర్_పునర్వ్యవస్థీకరణ_బిల్లు,_2019

https://te.wikipedia.org/wiki/జమ్మూ_కాశ్మీర్_పునర్వ్యవస్థీకరణ_బిల్లు,_2019

జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 అన్నది భారత పార్లమెంటు ఆమోదించిన ఒక చట్టం.
2019 అక్టోబర్ 31 నాటికి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని విభజించి జమ్మూ కాశ్మీర్, లడఖ్ అన్న రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటుచేయాలన్న నిబంధనలు దీనిలో ఉన్నాయి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2019 ఆగస్టు 5న రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు.
ఈ బిల్లు 2019 ఆగస్టు 5న రాజ్యసభలో, ఆగస్టు 6న లోక్‌సభలో ఆమోదం పొందింది.
ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు 370 అధికరణం కింద భారత రాజ్యాంగంలోని అన్ని అధికరణాలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వర్తించేలా ఇంటర్ ఆలియాను వర్తింపజేశారు.
భారత పార్లమెంటు రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ చట్టాన్ని తీసుకువచ్చేలా ఈ ఘటన అవకాశమిచ్చింది.
భారత రాజ్యాంగంలోని 370 అధికరణం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించింది.
దీని వల్ల భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు భిన్నంగా జమ్మూ కాశ్మీరులో తనకంటూ ప్రత్యేకమైన రాజ్యాంగం, ఈ ప్రాంతంలో పరిపాలనలో స్వయం ప్రతిపత్తి ఉంటుంది.
ప్రత్యేకించి, ఇతర రాష్ట్రాలకు చెందిన భారత పౌరులు జమ్మూ కాశ్మీరులో భూములు, స్థిరాస్తులు కొనడానికి అవకాశం లేదు.
జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో మూడు భిన్నమైన ప్రాంతాలు ఉన్నాయి.
అవి హిందువుల సంఖ్యాధిక్యత కలిగిన జమ్మూ, ముస్లింల సంఖ్యాధిక్యత కల కాశ్మీరు, బౌద్ధుల సంఖ్యాధిక్యత కలిగిన లడాఖ్.
ముస్లిం సంఖ్యాధిక్యత కలిగిన కాశ్మీర్ ప్రాంతంలో హింస, అస్థిరత కొనసాగుతూ వచ్చింది.
1987లో తీవ్రమైన రిగ్గింగ్ జరిగిన శాసనసభ ఎన్నికల తర్వాత స్వయంపాలన, హక్కుల కోసం హింసాత్మకమైన తిరుగుబాటు ఏళ్ళ తరబడి కొనసాగింది.
భారతీయ జనతా పార్టీ 2014 భారత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.
ఐదు సంవత్సరాల తర్వాత భాజపా 2019 ఎన్నికల మేనిఫెస్టోలో రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని తోసిపుచ్చి, జమ్మూ కాశ్మీరును ఇతర రాష్ట్రాలతో సమాన ప్రతిపత్తికి తీసుకువస్తామన్న అంశాన్ని చేర్చారు.