362.txt 9.96 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61
గౌటు

https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B1%8C%E0%B0%9F%E0%B1%81

గౌటు (Gout) అనేది శరీరంలో యూరిక్ ఆమ్లం జీవ ప్రక్రియ సరిగా లేనందున ఉత్పమన్నమయ్యే ఒక కీళ్ళ వ్యాధి (metabolic arthritis).
సాధారణంగా మన రక్తంలో 'యూరిక్‌ ఆమ్లం' అనే రసాయనం ఉంటుంది.
అది ఉండాల్సిన దానికంటే కూడా ఎక్కువగా ఉంటే.. కీళ్లలోకి వచ్చి చేరుతుంటుంది.
ఇలా కీలు దగ్గర యూరిక్‌ ఆమ్లం స్ఫటికాలు ఎక్కువగా పేరుకుంటున్నప్పుడు కీలు వాచి, కదలికలు కష్టంగా తయారవుతాయి.
దీన్నే గౌట్‌ అనీ, గౌటీ ఆర్త్థ్రెటిస్‌ అని అంటారు.
దీనివల్ల కీలు నొప్పి, వాపు, ఎరుపుదనం వంటి బాధలు మొదలవుతాయి.
సాధారణంగా ఈ సమస్య కాలి బొటన వేలు వాపుతో ఆరంభమవుతుంది.
మొదట్లో ఏమంత ఎక్కువగా బాధించదు.
మందులు వాడినా, వాడకపోయినా కూడా.. దానంతట అదే వారం పది రోజుల్లో తగ్గిపోవచ్చు.
తర్వాత ఐదారు నెలల పాటు మళ్లీ రాకపోవచ్చు.
కానీ క్రమేపీ ఏడాదికి రెండుమూడు సార్లు, తర్వాత మూడ్నాలుగు సార్లు బాధలు వస్తూ.. క్రమంగా తరచుదనం, తీవ్రతా పెరుగుతుంటాయి.
పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఇది దీర్ఘకాలిక సమస్యగా తయారై... జాయింట్లను బాగా దెబ్బ తీసేస్తుంది.
కాబట్టి మొదటిసారి వాపు వచ్చినప్పుడే చికిత్స ఆరంభిస్తే... తర్వాత ఏ సమస్యా లేకుండా, కీళ్లు దెబ్బతినకుండా చూసుకోవచ్చు.
నిజానికి కీళ్ల సమస్యలన్నింటిలోకీ 'గౌట్‌' చికిత్స చాలా తేలిక.
కేవలం ఒకే ఒక్క మాత్రతో దీనికి చికిత్స చెయ్యచ్చు.
కాకపోతే ఈ మాత్రను జీవితాంతం తీసుకోవాల్సి ఉంటుంది.
రక్తంలో యూరిక్‌ ఆమ్లం ఎక్కువ ఉన్నంత మాత్రాన గౌట్‌ ఉన్నట్లేనని భావించరాదు.
యూరిక్‌ ఆమ్లం ఎక్కువగా ఉండటంతో పాటు కీళ్లలో సమస్యలు, ఆర్త్థ్రెటిస్‌ లక్షణాలు కూడా ఉన్నప్పుడే దాన్ని గౌట్‌గా భావించాల్సి ఉంటుంది.
రక్తంలో యూరిక్‌ ఆమ్లం ఎక్కువగా ఉన్నాకూడా.. కీళ్ల బాధలేమీ లేకపోతే దాన్ని గౌట్‌గా భావించకూడదు.
అలాగే మరికొన్ని ఇతరత్రా సందర్భాల్లో కూడా యూరిక్‌ ఆమ్లం ఎక్కువగా ఉండొచ్చు.
ఉదాహరణకు 'సొరియాటిక్‌ ఆర్త్థ్రెటిస్‌' అనే సమస్యలో కూడా యూరిక్‌ ఆమ్లం ఎక్కువ ఉంటుంది.
కానీ దాని చికిత్స వేరు.
అల్లోప్యూరినాల్‌తో వారికి ఉపయోగం ఉండదు.
అలాగే లుకీమియా, కిడ్నీ ఫెయిల్యూర్‌ వంటి సమస్యల్లో కూడా యూరిక్‌ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి... గౌట్‌ విషయంలో రోగ నిర్ధారణ చాలా కీలకం.
సమస్యను కచ్చితంగా నిర్ధారిస్తేనే చికిత్సతో ఫలితం ఉంటుంది.
రక్తంలో యూరిక్‌ ఆమ్లం ఎక్కువగా ఉండటంతో పాటు... రోగి బాధలు కూడా గుర్తించే గౌట్‌ను నిర్ధారిస్తారు.
గౌట్‌ లక్షణాలు చాలా ప్రస్ఫుటంగానే ఉంటాయి.
ముఖ్యంగా రాత్రి పడుకునే వరకూ కూడా ఎలాంటి సమస్యా ఉండదు.
ఉదయం లేచే సరికి కాలి బొటనవేలు విపరీతంగా వాచి, ఎర్రగా తయారవుతుంది.
ముట్టుకుంటే భరించరాని నొప్పి.
నొప్పులు తగ్గేందుకు ఏవో మాత్రలు వేసుకుంటే వారంపది రోజుల్లో అదే పోతుంది.
ఇది గౌట్‌ ప్రధాన లక్షణం.
అప్పుడు మనం ఆ కీలు నుంచి కొద్దిగా నీరు తీసి పరీక్షిస్తే.. దానిలో యూరిక్‌ ఆమ్లం పలుకులు (క్రిస్టల్స్‌) స్పష్టంగా కనిపిస్తాయి.
దీంతో గౌట్‌ నిర్ధారణ అయినట్టే.
మొదట్లో ఇది కాలి బొటన వేళ్ల వంటి ఏదో ఒకటిరెండు కీళ్లకు పరిమితమైనా క్రమేపీ ఇతరత్రా జాయింట్లకు కూడా వస్తుంది.
ఈ దశలో.. అది గౌటీ ఆర్త్థ్రెటిస్సా?
లేక రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్సా?
అన్నది తేల్చుకోవటం ముఖ్యం.
అందుకని రుమటాయిడ్‌ ఫ్యాక్టర్‌, యూరిక్‌ ఆసిడ్‌ పరీక్షలు, వీటితో పాటు కిడ్నీ పరీక్షలు, రక్తంలో ఈఎస్‌ఆర్‌ పరీక్ష కూడా చేయిస్తారు.
వాచిన కీలు ఎక్స్‌రే తీయిస్తే ప్రారంభ దశలో అది మామూలుగానే ఉన్నా.. తర్వాత్తర్వాత మృదుకణజాలంలో వాపు కనిపిస్తుంది.
గౌట్‌ సమస్య ఉన్నవారికి చెవి తమ్మెల వంటి చోట కూడా స్ఫటికాలు పేరుకుని.. పైకి తెల్లగా కనబడుతుంటాయి.
ఇది కూడా సమస్య నిర్ధారణకు ఉపయోగపడుతుంది.
గౌట్‌కు 'అల్లో ప్యూరినాల్‌' (జైలోరిక్‌) ఒక్కటే మందు.
ఈ మందు ఆరంభిస్తే అక్కడక్కడ పేరుకున్న యూరిక్‌ ఆమ్లం మోతాదు కూడా క్రమేపీ తగ్గిపోతుంది.
కీళ్ల సమస్యలు బాధించవు.
మందు ఆరంభించకపోతే మాత్రం.. కీళ్లు మరింతగా వాచి, కీళ్ల మీద పుండ్లు పడి, క్రమేపీ జాయింట్లు దెబ్బతింటాయి.
గౌట్‌ బాధితులు మాంసకృత్తులు తగ్గించాలి, మరీ ముఖ్యంగా 'హైప్యూరిన్‌ డైట్‌' తీసుకోకూడదు.
మామూలుగా మాంసకృత్తులు (ప్రోటీన్లు) రెండు రకాలు.
1.ప్యూరిన్స్‌ 
2.పిరమిడీన్స్‌.
గౌట్‌ బాధితులు ప్యూరీన్స్‌ రకం ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోకూడదు.
మాంసాహారంలో మేక, గొర్రె, బీఫ్‌ వంటివి తీసుకోకూడదు.
అలాగే లివర్‌, కిడ్నీ, ఎముకల మూలుగ, పేగుల వంటి జంతువుల అంతర్గత అవయవాలూ తీసుకోకూడదు.
శాకాహారాల్లో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, చిక్కుళ్లు, బీన్స్‌ రకాలు, పుట్టగొడుగుల వంటివి బాగా తగ్గించాలి.
ఆల్కహాల్‌, బీరు వంటివాటికి దూరంగా ఉండటం కూడా అవసరం.