503.txt 49.1 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201
పరమహంస యోగానంద

https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%B0%E0%B0%AE%E0%B0%B9%E0%B0%82%E0%B0%B8_%E0%B0%AF%E0%B1%8B%E0%B0%97%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6

పరమహంస యోగానంద (జన్మనామం: ముకుంద లాల్ ఘోష్ 1893 జనవరి 5 – 1952 మార్చి 7) ఒక భారతీయ సన్యాసి, యోగి, ఆధ్యాత్మిక గురువు.
ఆయన తాను స్థాపించిన సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ (SRF), యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థల ద్వారా లక్షలమంది జనాలకు ధ్యానం, క్రియా యోగ పద్ధతులను నేర్పించాడు.
ఈయన తన చివరి 32 సంవత్సరాలు అమెరికాలో గడిపాడు.
ఆయన గురువు అయిన శ్రీయుక్తేశ్వర్ గిరికి ముఖ్య శిష్యుడిగా తమ సన్యాసి పరంపర లక్ష్యాల మేరకు పాశ్చాత్య దేశాలకు ప్రయాణించి యోగాభ్యాసాన్ని పాశ్చాత్యులకు పరిచయం చేసి వారి భౌతిక వాదాన్ని, భారతీయుల ఆధ్యాత్మికతను సమన్వయపరిచే పాత్ర పోషించాడు.
అమెరికాలో యోగా ఉద్యమంపై ఆయన వేసిన చెరపలేని ముద్ర, ముఖ్యంగా లాస్ ఏంజిలస్ లో ఆయన నెలకొల్పిన యోగా సంస్కృతి ఆయనకు పాశ్చాత్యదేశాల్లో యోగా పితామహుడిగా స్థానాన్ని సంపాదించిపెట్టాయి.
యోగానంద అమెరికాలో స్థిరపడ్డ ప్రధాన ఆధ్యాత్మిక గురువుల్లో ప్రథముడు.
1927 లో అప్పటి అమెరికా అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్ చేత వైట్ హౌస్ ఆతిథ్యాన్ని అందుకున్న ప్రథమ భారతీయ ప్రముఖుడు కూడా ఆయనే.
ప్రారంభంలో ఆయన అందుకున్న ప్రశంసలతో లాస్ ఏంజిలస్ టైమ్స్ అనే పత్రిక ఆయన్ను 20వ శతాబ్దపు మొట్టమొదటి సూపర్ స్టార్ గురువు అని అభివర్ణించింది.
1920 లో బోస్టన్‌కు చేరుకున్న ఆయన తన ఉపన్యాసాలతో ఖండాంతర పర్యాటన చేశాడు.
చివరికి 1925లో లాస్ ఏంజిలస్ లో స్థిరపడ్డాడు.
తర్వాత 25 సంవత్సరాల పాటు అక్కడే ప్రాంతీయంగా మంచి గుర్తింపు పొందడమే కాక తన ప్రభావాన్ని విశ్వవ్యాప్తం చేశాడు.
ఒక సన్యాసి సాంప్రదాయాన్ని ఏర్పాటు చేసి శిష్య పరంపరకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు.
అక్కడక్కడ పర్యటిస్తూ బోధనలు చేశాడు.
కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాల్లో తమ సంస్థ కోసం ఆస్తులు కొన్నాడు.
వేలాది మందిని క్రియా యోగంలోకి ప్రవేశింపజేశాడు.
1952 కల్లా SRF భారతదేశంలోనూ, అమెరికాలో కలిపి 100కి పైగా కేంద్రాలు నెలకొల్పారు.
ప్రస్తుతం వీరికి అమెరికాలో ప్రతి ప్రధాన నగరం లోనూ కేంద్రాలున్నాయి.
ఆయన బోధించిన సరళ జీవనం, ఉన్నతమైన ఆలోచన అనే విధానం వివిధ నేపథ్యాలు కలిగిన పలువురు జిజ్ఞాసువులను ఆకట్టుకుంది.
1946 లో ఆయన రాసిన ఒక యోగి ఆత్మకథ విమర్శకుల ప్రశంసలనందుకుని ఇప్పటిదాకా 40 లక్షల ప్రతులకుపైగా అమ్ముడైంది.
హార్పర్ కోలిన్స్ సంస్థ 20వ శతాబ్దపు అత్యంత ప్రజాదరణ పొందిన 100 పుస్తకాల్లో ఈ పుస్తకాన్ని చేర్చింది.
ఆపిల్ సంస్థ మాజీ సియివో స్టీవ్ జాబ్స్ తన ఆఖరి రోజుల్లో ఈ పుస్తకం 500 ప్రతులను తెప్పించి తన మెమోరియల్ కార్యక్రమానికి వచ్చినవారికి అందజేయించాడు.
ఈ పుస్తకం క్రమం తప్పకుండా అనేక పునర్ముద్రణలు జరుపుకుని అనేక లక్షల మంది జీవితాలను మార్చినదిగా పరిగణించబడుతోంది.
2014 లో యోగానంద జీవితం పై వచ్చిన డాక్యుమెంటరీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అనేక చలనచిత్రోత్సవాలలో పురస్కారాలు అందుకుంది.
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆయన వారసత్వ సాంప్రదాయం, పాశ్చాత్యుల ఆధ్యాత్మికతలో ఈ నాటికీ ఆయన ప్రథమశ్రేణిలో ఉండటం వలన ఫిలిప్ గోల్డ్‌బెర్గ్ లాంటి రచయితలు పాశ్చాత్య దేశాలకు వచ్చిన భారతీయ ఆధ్యాత్మిక గురువుల్లో తన సుగుణాలతో, అత్యంత నైపుణ్యంతో తరతరాలకు ఆధ్యాత్మిక ప్రభలను ప్రసారం చేసి, లక్షలాది మందిని ఆత్మసాక్షాత్కారం వైపు నడిపించి చిరపరిచితుడిగా, అందరి ఆదరాభిమానాలు చూరగొన్నాడు  అని పేర్కొన్నారు.
ఈయన గురువు పేరు శ్రీయుక్తేశ్వర్ గిరి.
శ్రీ యుక్తేశ్వర్ గిరి గురువు లాహిరి మహాశయులు.
లాహిరీ మహాశయులు గురువు మహావతార్ బాబాజీ.
యోగానంద 1893, జనవరి 5 న ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్లో ఒక సాంప్రదాయ బెంగాలీ కాయస్థ కుటుంబంలో జన్మించాడు.
అతను జన్మనామం ముకుందలాల్ ఘోష్.
తండ్రి భగవతీ చరణ్ ఘోష్ బెంగాల్ - నాగపూర్ రైల్వేలో ఉపాధ్యక్షుడి స్థాయి ఉద్యోగి.
తల్లి గృహిణి.
భగవతీ చరణ్ దంపతులకు మొత్తం ఎనిమిది సంతానం.
వీరిలో నాలుగోవాడు ముకుందుడు.
కొడుకుల్లో రెండో వాడు.
అతను తమ్ముడు సనందుడి మాటలను బట్టి యోగానంద చిన్నవయసు నుంచే ఆధ్యాత్మికతలో వయసుకు మించిన ఆసక్తిని, పరిణతిని కనబరిచేవాడు.
తండ్రి ఉద్యోగ రీత్యా వీరి కుటుంబం లాహోర్, బరేలీ, కోల్‌కత లాంటి ఊర్లలో నివాసం ఉన్నారు.
ఆయన తల్లి తాను 11 సంవత్సరాల వయసులో ఉండగా తన పెద్దన్న అనంతుడి పెళ్ళి నిశ్చయ తాంబూలాలకు ముందుగానే మరణించిందని తన ఆత్మకథలో రాసుకున్నాడు.
ఆమె అతని కోసం ఎవరో ఒక సన్యాసి ఇచ్చిన ఒక రక్షరేకును అనంతుడి దగ్గర దాచి ఉంచింది.
ఆ రక్షరేకు ముకుందుడి దగ్గర అవసరమైనంత కాలం ఉండి దాని అవసరం తీరిపోగానే దానంతట అదే మాయమవుతుందని తెలియజేసి ఉంటాడు దాన్ని ఇచ్చిన సన్యాసి.
బాల్యంలో అతని తండ్రి అతను అనేక దూర ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించడం కోసం రైలు పాసులు సమకూర్చేవాడు.
వీటి సహాయంతో ముకుందుడు తన స్నేహితులతో కలిసి వివిధ ప్రదేశాలకు వెళ్ళి వస్తుండేవాడు.
యవ్వనంలో ఉండగా అతను తన ఆధ్యాత్మిక తృష్ణను తీర్చుకోవడానికి మంచి గురువు కోసం వెతుకుతూ టైగర్ స్వామి, గంధ బాబా, మహేంద్రనాథ్ గుప్తా లాంటి భారతీయ సన్యాసులను కలిశాడు.
పాఠశాల చదువు పూర్తయిన తర్వాత ఇల్లు వదలి వారణాసిలోని మహామండల్ సన్యాసాశ్రమం చేరాడు.
కానీ వారు ధ్యానం, భగవంతుని సేవ కాకుండా సంస్థ కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తుండటంతో ఆయనకు ఆశ్రమవాసం పట్ల అసంతృప్తి కలిగింది.
తనకు మార్గనిర్దేశం చేయమని భగవంతుని వేడుకునేవాడు.
చివరకు 17 ఏళ్ళ వయసులో, 1910 సంవత్సరంలో శ్రీయుక్తేశ్వర్ గిరిని తన గురువుగా కనుగొన్నాడు.
అప్పటికే తనకు తల్లి అందజేసిన రక్షరేకు దాని అవసరం తీరిపోవడంతో దానంతట అదే మాయమైపోయింది.
అతను గురువుతో కలిసిన మొట్టమొదటి కలయిక జన్మజన్మలకీ గుర్తుండిపోతుందని తన ఆత్మకథలో రాసుకున్నాడు.
యోగానంద శ్రీయుక్తేశ్వర్ గిరి శ్రీరాంపూర్ ఆశ్రమంలోనూ, పూరీ ఆశ్రమంలోనూ ఒక దశాబ్దం పాటు (1910-1920) శిక్షణ పొందాడు.
తర్వాత శ్రీయుక్తేశ్వర్ గిరి యోగానందకు తమ పరమగురువైన మహావతార్ బాబాజీనే అతన్ని యోగా ప్రాచుర్యమనే మహత్తర కార్యం కోసం తన దగ్గరికి పంపించినట్లు తెలియజేశాడు.
1914 లో కలకత్తాలోని స్కాటిష్ చర్చి కళాశాల నుండి ఆర్ట్స్ లో ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణుడై 1915, జూన్లో కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాల అయిన సీరాంపూర్ కళాశాలనుండి ఇప్పటి బి.
ఎ డిగ్రీకి సమానమైన డిగ్రీని పొందాడు.
అప్పట్లో దాన్ని ఎ.బి డిగ్రీగా వ్యవహరించేవారు.
అక్కడ చదివే రోజుల్లో యోగానంద సీరాంపూర్ లోని యుక్తేశ్వర ఆశ్రమంలో సమయాన్ని గడిపేవాడు.
1914 జూలై లో అతను కళాశాల వదిలిపెట్టిన కొన్ని వారాలకు సాంప్రదాయికంగా సన్యాసాన్ని స్వీకరించాడు.
శ్రీ యుక్తేశ్వరి గిరి ఆయన సన్యాస నామాన్ని ఎంచుకోవడం శిష్యునికే వదిలివేయగా ఆయన తన పేరును స్వామి యోగానంద గిరిగా మార్చుకున్నాడు.
1917 లో యోగానంద బాలుర కోసం పశ్చిమ బెంగాల్ లోని దిహిక లో ఒక పాఠశాల ప్రారంభించాడు.
ఇందులో ఆధునిక విద్యాభోధనతో పాటు, యోగాభ్యాసం, ఇంకా ఇతర ఆధ్యాత్మిక పద్ధతులను నేర్పించేవారు.
ఒక సంవత్సరం తర్వాత దీన్ని రాంచీకి తరలించారు.
ఈ పాఠశాల మొట్టమొదటి బృందంలో యోగానంద ఆఖరి తమ్ముడైన బిష్ణు చరణ్ ఘోష్ ఉన్నాడు.
ఈ పాఠశాల తర్వాత అమెరికాలో యోగానంద స్థాపించిన సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కి భారతదేశంలో అనుబంధ పాఠశాల అయిన యోగదా సత్సంగ సొసైటీ గా మారింది.
1920 లో రాంచీ పాఠశాలలో యోగానంద ఒకసారి ధ్యానంలో కూర్చుని ఉండగా అనేక మంది అమెరికన్లు అతని దృష్టికి కనబడ్డారు.
ఇది తాను త్వరలో అమెరికా వెళ్ళబోతున్నందుకు సూచనగా భావించాడు.
పాఠశాల బాధ్యతను తన సహ ఉపాధ్యాయుడైన స్వామి సత్యానందకు అప్పగించి తాను కలకత్తాకు ప్రయాణమయ్యాడు.
ఆ తర్వాతి రోజే ఆయనకు అమెరికన్ యూనిటేరియన్ అసోసియేషన్ నుంచి త్వరలో బోస్టన్ లో జరగబోయే ప్రపంచ మత ఉదారవాదుల సభకు భారతదేశ ప్రతినిధిగా హాజరు కమ్మని ఆహ్వానం అందింది.
వెంటనే ఆయన గురువు శ్రీయుక్తేశ్వర్ గిరి అనుమతి కూడా వచ్చింది.
తర్వాత తన గదిలో తీవ్రమైన ధ్యానంలో మునిగిఉండగా ఆశ్చర్యకరమైన రీతిలో తమ పరమగురువైన మహావతార్ బాబాజీ కనిపించి క్రియాయోగాన్ని పాశ్చాత్య దేశాల్లో వ్యాప్తి చేసేందుకు తాము యోగానందను ఎన్నుకున్నామని చెప్పాడు.
దాంతో సంతృప్తి చెందిన యోగానంద అమెరికా ప్రయాణానానికి తన సమ్మతిని తెలియజేశాడు.
ఈ సంఘటనను పలు చోట్ల తన సందేశాల్లో వినిపించేవాడు యోగానంద.
1920 ఆగస్టున బోస్టన్ వెళ్ళే ద సిటీ ఆఫ్ స్పార్టా అనే నౌకను ఎక్కాడు.
ఈ నౌక సుమారు రెండు నెలలు ప్రయాణించి సెప్టెంబరులో బోస్టన్ నగరం చేరుకుంది.
అక్టోబరు తొలిరోజుల్లో ఈయన అంతర్జాతీయ మత సభల్లో ప్రసంగించాడు.
అది సభికులను బాగా ఆకట్టుకుంది.
తర్వాత సనాతన భారతదేశపు ఆధ్యాత్మిక బోధనలు, యోగా తత్వం, ధ్యాన సాంప్రదాయాలను ప్రచారం చేయడం కోసం సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అనే సంస్థను ప్రారంభించాడు.
యోగానంద తర్వాతి నాలుగు సంవత్సరాలు బోస్టన్ లో గడిపాడు.
ఆ మధ్యకాలంలోనూ తూర్పు తీరంలో ప్రసంగాలు చేశాడు.
1924 లో సందేశాలిస్తూ ఖండాంతర పర్యటనలు చేశాడు.
ఆయన సభలకు వేలాదిమంది తరలివచ్చేవారు.
ఈ సమయంలో ఆయన అనేక మంది సెలెబ్రిటీలను కూడా ఆకర్షించాడు.
1925లో ఆయన కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిలెస్ లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ తరఫున ఒక అంతర్జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించాడు.
ఇది తాను విస్తృతంగా చేపట్టబోయే కార్యక్రమాలకు పరిపాలనా కేంద్రంగా రూపుదిద్దుకుంది.
తమ జీవిత కాలంలో అమెరికాలో ఎక్కువ భాగం గడిపిన హిందూ ఆధ్యాత్మిక గురువుల్లో యోగానంద ప్రథముడు.
ఆయన 1920 నుంచి 1952లో మరణించే దాకా అక్కడే ఉన్నాడు.
మధ్యలో 1935-36 లో మాత్రం ఒకసారి భారతదేశానికి వచ్చి వెళ్ళాడు.
తన శిష్యుల సహకారంతో ప్రపంచమంతా క్రియా యోగ కేంద్రాలను నెలకొల్పాడు.
భారతదేశంలో బలపడుతున్న స్వాతంత్ర్యోద్యమం దృష్ట్యా ఆయన మీద అమెరికాకు చెందిన ఎఫ్.బి.ఐ, బ్రిటిష్ ప్రభుత్వాలు నిఘా ఉంచాయి.
ఆయన చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు వింతగా అనిపిస్తుండటతో 1926 నుంచి 1937 మధ్యకాలంలో ఆయన మీద రహస్యంగా కొన్ని దస్త్రాలు కూడా తయారు చేయబడ్డాయి.
యోగానంద కూడా అమెరికాలో వేళ్ళూనుకున్న సంచలనాత్మక మీడియా, మత మౌఢ్యం, జాతి వివక్ష, పితృస్వామ్యం, లైంగిక ఆరాటం లాంటి లక్షణాలపై వ్యతిరేకంగా ఉన్నాడు.
1928లో మయామీలోని పోలీసు అధికారి లెస్లీ కిగ్స్ ఆయన కార్యక్రమాలను అడ్డుకోవడంతో ఆయనకు కొంత ప్రతికూలత ఎదురైంది.
అయితే తనకు యోగానంద మీద వ్యక్తిగత ద్వేషమేమీ లేదనీ ఇది ఆ ప్రాంతంలో శాంతిభద్రతల సంరక్షణ కోసం ఇంకా, యోగానంద రక్షణ కోసమే అలా చేయవలసి వచ్చిందని కిగ్స్ తెలిపాడు.
యోగానందకు వ్యతిరేకంగా కొన్ని అనామక బెదిరింపులు వచ్చినట్లు కూడా తెలియజేశాడు.
ఫిల్ గోల్డ్‌బెర్గ్ ప్రకారం మయామీ అధికారులు ఈ విషయంపై బ్రిటీష్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు.
ఒకానొక కాన్సులేట్ అధికారి ప్రకారం మయామీ అధికారి కిగ్స్ యోగానంద బ్రిటీష్ రాజ్య పౌరుడిగా, చదువుకున్న వాడిగానూ గుర్తించాడు.
కానీ దురదృష్టవశాత్తూ ఆయన శరీరం రంగు పట్ల ఆ ప్రాంతపు ప్రజల్లో వివక్ష ఉందనీ, ఆయన మీద భౌతిక దాడులు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.
1935 లో యోగానంద ఇద్దరు పాశ్చాత్య శిష్యుల్ని తీసుకుని భారతదేశానికి ఓడ ద్వారా వచ్చి తన గురువు శ్రీయుక్తేశ్వర్ గిరిని కలుసుకున్నాడు.
ఆయన ఆశీర్వాదంతో భారతదేశంలో కూడా యోగదా సత్సంగ సొసైటీని నెలకొల్పాలన్నది యోగానంద ఆశయం.
ఈ ప్రయాణంలో ఆయన ఎక్కిన ఓడ యూరోప్, మధ్య ప్రాచ్యంలోని ప్రాంతాలన్నీ చుట్టుకుని వచ్చింది.
దీన్ని అవకాశంగా చేసుకుని ఆయన పాశ్చాత్య సాధువులైన థెరిసా నాయ్‌మన్ లాంటి వారిని కలిశాడు.
సెయింట్ ఫ్రాన్సిస్ గౌరవార్థం, ఇటలీలోని అసిసి, గ్రీస్ దేశంలోని అథీనియన్ దేవాలయాలు, సోక్రటీసు మరణించిన జైలు, పాలస్తీనాలోని పవిత్ర ప్రదేశాలు, జీసస్ తిరిగిన ప్రదేశాలు, ఈజిప్టు లోని మహా పిరమిడ్లు మొదలైన వాటిని సందర్శించాడు.
1935 ఆగస్టున ఆయన ఎక్కిన ఓడ బొంబాయి తీరాన్ని చేరుకుంది.
అమెరికాలో ఆయనకు దక్కిన ఆదరాభిమానాలను చూసి ఆయన దిగిన తాజ్ మహల్ హోటల్ కు ఎంతోమంది ఫోటోగ్రాఫర్లు, విలేకరులు ఆయనను కలవడానికి వచ్చారు.
ఆ తర్వాత ఆయన తూర్పువైపు వెళ్ళే రైలు మార్గాన కలకత్తాకు సమీపంలోని హౌరా స్టేషన్ కు చేరుకున్నాడు.
అక్కడ ఆయన సోదరుడు బిష్ణు చరణ్ ఘోష్, కాశింబజార్ మహారాజా, ఇంకా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
శ్రీరాంపూర్ చేరుకుని తన గురువును ఆత్మీయంగా కలుసుకున్నాడు.
ఈ వివరాలను యోగానంద పాశ్చాత్య శిష్యుడైన సి.
రిచర్డ్ రైట్ విపులంగా గ్రంథస్తం చేశాడు.
ఆయన భారతదేశంలో ఉండగానే రాంచీ పాఠశాలను చట్టబద్ధంగా నమోదు చేయించాడు.
ఒక పర్యటన బృందంతో కలిసి ఆగ్రాలోని తాజ్ మహల్,  మైసూరు లోని చాముండేశ్వరి దేవి ఆలయం, 1936 జనవరిలో అలహాబాదు లో జరిగిన కుంభ మేళా, లాహిరీ మహాశయుల శిష్యుడైన కేశవానందను కలుసుకోవడానికై బృందావనం మొదలైన ప్రదేశాలను సందర్శించాడు.
ఆయనకు ఆసక్తిగా అనిపించిన మరికొంతమందిని కూడా ఆయన కలిశాడు.
మహాత్మా గాంధీని కలిసి ఆయనను క్రియాయోగంలో ప్రవేశ పెట్టాడు.
ఇంకా ఆనందమయి మా, నిరాహార యోగిని గిరిబాల, భౌతిక శాస్త్రవేత్త సి.
వి.రామన్, లాహిరీ మహాశయుల శిష్యులను కొంతమందిని కలిశాడు.
ఆయన భారతదేశంలో ఉండగానే శ్రీయుక్తేశ్వర్ గిరి యోగానంద సాధించిన ఆధ్యాత్మిక ఉన్నతికి చిహ్నంగా ఆయనకు పరమహంస అనే బిరుదును ఇచ్చాడు.
ఇది అంతకు ముందున్న స్వామి కంటే ఘనమైనది.
1936 మార్చిన యోగానంద బృందావనం సందర్శించుకుని కలకత్తాకు తిరిగిరాగా పూరీ ఆశ్రమంలో ఉంటున్న శ్రీయుక్తేశ్వర్ గిరి తన భౌతిక దేహాన్ని త్యాగం చేశారు (యోగి సాంప్రదాయంలో మహాసమాధి చెందారు).
తన గురువు గారికి జరగాల్సిన కార్యక్రమాలు జరిపించాక యోగానంద తన బోధనా, ముఖాముఖి కార్యక్రమాలు కొనసాగించాడు.
కొన్ని నెలలపాటు స్నేహితులను కలుసుకుంటూ ఉన్నాడు.
1936 మధ్యలో తిరిగి అమెరికా ప్రయాణానికి నిశ్చయించుకున్నాడు.
ఆయన ఆత్మకథ ప్రకారం 1936 జూన్ నెలలో కలలో శ్రీకృష్ణుడి దర్శనం అయ్యాక, ముంబైలో రీజెంట్ హోటల్ లో ఉండగా చనిపోయిన తన గురువు గారిని మామూలు భౌతిక శరీరంతో మళ్ళీ చూడగలిగాడు.
ఆయనను ఆ రూపంలోనే గట్టిగా పట్టుకోగలిగాడు కూడా.
యోగానంద ఆయనను సూక్ష్మ లోకం గురించి వివరించమని అడిగాడు.
శ్రీ యుక్తేశ్వర్ తాను ఇప్పుడు భువర్లోకం లో ఉన్నాననీ భగవంతుడు తనను అక్కడే రక్షకుడిగా సేవలందించమని కోరాడని చెప్పాడు.
ఆ లోకం గురించీ, మరణం తర్వాతి విషయాల గురించి ఆయన వివరంగా చెప్పాడు.
కర్మ ఫలితాలు, మనిషి అభౌతిక శరీరం, మనిషి దానితో ఎలా మెసలుతాడు, ఇంకా ఇతర అదిభౌతిక శాస్త్రాలకు సంబంధించిన వివరాలు చెప్పాడు.
తాను గురువు గారి నుంచి కొత్తగా నేర్చుకున్న పరిజ్ఞానంతో, యోగానంద తన ఇద్దరు పాశ్చాత్య శిష్యులతో కలిసి ముంబై నుంచి ఓషన్ లైనర్ ద్వారా తిరుగు ప్రయాణమయ్యారు.
మార్గమధ్యంలో ఇంగ్లండులో కొన్ని వారాలు ఉన్నారు.
లండన్ లో యోగా తరగతులు నిర్వహించారు.
చారిత్రాత్మక స్థలాలు దర్శించారు.
అక్కడ నుంచి 1936 అక్టోబరున అమెరికాకు ప్రయాణమయ్యారు.
1936 చివరి భాగంలో ఆయన ప్రయాణిస్తున్న ఓడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని దాటుకుంటూ న్యూయార్కు ఓడరేవు చేరుకుంది.
ఆయన అనుయాయులు ఫోర్డు కారు తీసుకుని సుదీర్ఘ దూరం ప్రయాణిస్తూ, కాలిఫోర్నియాలోని మౌంట్ వాషింగ్టన్ లోని ఆయన ప్రధాన కార్యాలయానికి తీసుకు వెళ్ళారు.
తన అమెరికన్ శిష్యులను కలుసుకుని తన బోధనలు, రచనా కార్యక్రమాలు తిరిగి కొనసాగించాడు.
దక్షిణ కాలిఫోర్నియాలో చర్చిల నిర్మాణం గావించాడు.
సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ఆశ్రమ వాసాన్ని ఆయన శిష్యుడైన రాజర్షి జనకానంద, కాలిఫోర్నియా, ఎన్సినాటిస్ లో బహుమతిగా ఇచ్చిన విశాలమైన స్థలంలోకి మార్చుకున్నాడు.
ఈ ఆశ్రమంలోనే ఆయన తన బహుళ ప్రాచుర్యం పొందిన ఒక యోగి ఆత్మకథ పుస్తకాన్ని, ఇంకా ఇతర రచనలు చేశాడు.
అదే సమయంలో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్/యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా కోసం ఒక ఫౌండేషన్ను కూడా స్థాపించాడు.
1946 లో ఆయన అమెరికాలో మారిన వలస చట్టాలను ఆసరాగా చేసుకుని పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
1949లో ఆయన దరఖాస్తు అంగీకరించబడి అధికారికంగా అమెరికా పౌరుడు అయ్యాడు.
ఆయన జీవితంలో ఆఖరి నాలుగు సంవత్సరాలు ఆయనకు అత్యంత దగ్గరైన కొంతమంది వ్యక్తులతో కాలిఫోర్నియాలోని ట్వెంటీనైన్ ఫార్మ్స్ రిట్రీట్ లో గడిచింది.
ఆ సమయంలో తన రచనలు పూర్తి చేయడం, ఇది వరకే రాసి ఉన్నవాటిని పరిశీలించడం చేశాడు.
అప్పుడే కొన్ని ముఖాముఖి కార్యక్రమాలకు, బహిరంగ ఉపన్యాసాలు చేశాడు.
ఇప్పుడు నా కలంతోనే ఎక్కువ మందికి చేరువ కాగలను అని తన శిష్యులతో అన్నాడు.
ఆయన మరణానికి కొద్ది రోజుల ముందు నుంచే ఆయన దగ్గరి శిష్యులతో తాను ఈ లోకం విడిచివెళ్ళే సమయం ఆసన్నమైందని పరోక్షంగా తెలియబరుస్తూ వచ్చాడు.
1952 మార్చి 7 న యోగానంద అమెరికాలో భారత రాయబారి వినయ్ రంజన్ సేన్ గౌరవార్థం లాస్ ఏంజిలెస్ లోని బిల్ట్‌మోర్ హోటల్లో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నాడు.
ఆ విందు చివరలో అమెరికా, భారతదేశాలు ప్రపంచ శాంతి, మానవ అభివృద్ధి కోసం చేసిన కృషి, భవిష్యత్తులో రెండు దేశాలు కలిసి పనిచేయడం గురించి మాట్లాడుతూ పాశ్చాత్య దేశపు భౌతిక పురోగతీ, భారతదేశపు ఆధ్యాత్మిక ఉన్నతి కలిసి ఐక్యప్రపంచంగా ఏర్పడాలని ఆకాంక్షించాడు.
ఆ సమయంలో యోగానంద ప్రత్యక్ష శిష్యురాలయిన దయామాత అక్కడే ఉంది.
ఈమె 1955 నుంచి 2010 వరకు సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కి సారథ్యం వహించింది.
ఆమె చెప్పిన ప్రకారం యోగానంద తన ఉపన్యాసం ముగించి, ఆయన రాసిన మై ఇండియా అనే పద్యంలోనుంచి కొన్ని వాక్యాలు చదివాడు.
తర్వాత తన చూపును ఆజ్ఞాచక్రంపై కేంద్రీకరించాడు.
కాసేపటికి ఆయన శరీరం నేలమీద పడిపోయింది.
ఆయన అనుచరులు తమ గురువు మహాసమాధి చెందినట్లు ప్రకటించారు.మరణానికి కారణం గుండె పనిచేయకపోవడంగా తేల్చారు.
1917 లో యోగానంద భారతదేశంలో పిల్లల కోసం ఉన్నతంగా జీవించే విధానాన్ని బోధించేందుకు ఒక పాఠశాలను నెలకొల్పాడు.
ఇందులో యోగాతో పాటు ఆధునిక బోధనా పద్ధతులు కూడా మిళితమై ఉండేవి.
1920 లో ఆయనను సర్వమత సభలలో పాల్గొనమని అమెరికాలోని బోస్టన్ నుండి ఆహ్వానం వచ్చింది.
అందులో ఆయన ఎంచుకున్న అంశం ది సైన్స్ ఆఫ్ రెలిజియన్.
ఇది సభికులకు బాగా ఆకట్టుకుంది.
తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఆయన అమెరికా అంతా పర్యటించి ఆధ్యాత్మిక బోధనలు చేశాడు.
యోగానంద తన ఆదర్శాలను, లక్ష్యాలను ఈ కింది విధంగా రాసుకున్నాడు.
దేవుని ప్రత్యక్ష వ్యక్తిగత అనుభవాన్ని పొందటానికి నిర్ధిష్టమైన శాస్త్రీయ పద్ధతులను గురించి వివిధ దేశాలకు వ్యాప్తి చేయడం
స్వీయ ప్రయత్నం ద్వారా, మనిషి పరిమితమైన మర్త్య స్పృహ నుంచి దైవ స్పృహలోకి పరిణామం చెందడమే మానవ జీవిత పరమార్థమనీ; ఈ లక్ష్యం చేరుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా దేవుని-సమాజం కోసం సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ దేవాలయాలను స్థాపించడం, ఇళ్లలోనూ, మనుష్యుల హృదయాలలో దేవుని వ్యక్తిగత దేవాలయాల స్థాపనను ప్రోత్సహించడం.
యేసుక్రీస్తు బోధించిన అసలైన క్రైస్తవ మతం, శ్రీకృష్ణభగవానుడు బోధించిన అసలైన యోగాలోనూ ఉన్న పూర్తి సామరస్యాన్ని, ప్రాథమిక ఏకత్వాన్ని  బహిర్గతం చేయడం; ఈ సత్య సూత్రాలు అన్ని నిజమైన మతాల యొక్క సాధారణ శాస్త్రీయ పునాది అని నిరూపించడం.
అన్ని మతాల సారం ఒకటేననీ, అన్ని మతాలు చూపించే మార్గాలు ఒకే భగవంతుని దగ్గరికి దారి తీస్తాయని చూపించడం
మానవుని భౌతిక రోగాల నుండీ, మానసిక అసమతౌల్యాల నుండీ, ఆధ్యాత్మిక అజ్ఞానం నుంచి బయటకు తీసుకు రావడం.
"సరళమైన జీవనం, ఉన్నతమైన ఆలోచన" ను ప్రోత్సహించడానికి; ప్రజల్లో ఐక్యతకు శాశ్వతమైన ఆధారాన్ని బోధించడం ద్వారా వారి మధ్య సోదర స్ఫూర్తిని వ్యాప్తి చేయడం; దేవునితో సాన్నిహిత్యం ఏర్పరుచుకోవడం.
శరీరం కన్నా మనసు, మనసు కన్నా ఆత్మ గొప్పది అని నిరూపించడం.
మంచి ద్వారా చెడును, ఆనందం ద్వారా దుఃఖాన్ని, దయ ద్వారా క్రూరత్వాన్ని, జ్ఞానం ద్వారా అజ్ఞానాన్ని జయించడం.
విజ్ఞాన శాస్త్రం, మతం లోని అంతర్లీన సూత్రాలను గమనించడం ద్వారా వాటి ఏకత్వాన్ని చాటడం.
ప్రాక్పశ్చిమ దేశాల మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక అవగాహన, వారి అత్యుత్తమ విలక్షణ లక్షణాల మార్పిడిని సూచించడం.
ఒక విశ్వమానవుడిగా మానవజాతికి సేవ చేయడం.క్రియా యోగం ఆయన బోధనలన్నింటికీ మూలం.
ఇది ఒక ప్రాచీన ఆధ్యాత్మిక పద్ధతి.
ఈ ప్రక్రియ మహావతార్ బాబాజీ ద్వారా లాహిరీ మహాశయులకూ, ఆయన ద్వారా శ్రీయుక్తేశ్వర్ గిరికీ, ఆయన నుండి పరమహంస యోగానందకూ అందించబడింది.
క్రియా యోగం గురించి యోగానంద తన ఆత్మకథ పుస్తకంలో ఇలా వర్ణించాడు.
యోగానంద తన ఆత్మకథలో క్రియాయోగాన్ని సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ లేదా యోగదా సత్సంగ సొసైటీ లో అధికారికంగా శిక్షణ పొందిన వారి దగ్గర మాత్రమే నేర్చుకొమ్మని తెలిపాడు.
1946 లో ఆయన ఆత్మకథను ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి అనే పేరుతో ఆంగ్లంలో రాశాడు.
ఈ పుస్తకం ఇప్పటి దాకా 50 పైగా భాషల్లోకి అనువాదమైంది.
దీనిని తెలుగులో ఒక యోగి ఆత్మకథ పేరుతో అనువదించారు.
1999 లో ఫిలిప్ జొలెస్కీ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక రచయితల సంఘం చేత హార్పర్ కొలిన్స్ ప్రచురణ సంస్థ జరిపిన అధ్యయనంలో, ఈ పుస్తకం 20 వ శతాబ్దపు అత్యుత్తమ ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఒకటిగా స్థానం సంపాదించుకుంది.
ఆయన రాసిన పుస్తకాల్లోకెల్లా అత్యంత ప్రజాదరణ పొందిన పుస్తకం కూడా ఇదే.
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (YSS) 1917 లో యోగానంద భారతదేశంలో స్థాపించిన సంస్థ.
దీన్నే 1920 లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ (SRF) పేరుతో అమెరికాకు విస్తరించారు.
ఇది భారతదేశంలో YSS పేరుతోనూ, ఇతర దేశాల్లో SRF పేరుతోనూ పిలవబడుతోంది.
ఈ సంస్థల ద్వారా ఆయన బోధనలు ప్రపంచ వ్యాప్తంగా విస్తృతం చేయబడుతున్నాయి.
SRF/YSS ప్రధాన కార్యాలయం లాస్ ఏంజిలెస్ లో ఉంది.
ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 500 కి పైగా దేవాలయాలు, కేంద్రాలు ఉన్నాయి.
175 దేశాల నుంచి ఈ సంస్థలో సభ్యులు ఉన్నారు.
భారతదేశంలో YSS 100 కి పైగా కేంద్రాలు, ఆశ్రమాలను నడుపుతోంది.
యోగానంద తన మరణం తర్వాత రాజర్షి జనకానందను తన వారసుడిగా ఈ సంస్థలకు అధ్యక్షుడిగా ఉండమని కోరాడు.
ఆయన 1955 లో మరణించేదాకా అధ్యక్షుడిగా ఉన్నాడు.
తర్వాత ఆధ్యాత్మిక నాయకురాలు, యోగానంద శిష్యురాలూ, ఆయన దగ్గర స్వయంగా శిక్షణ పొందిన దయామాత SRF/YSS కు 1955 నుంచి 2010 వరకు అధ్యక్షురాలిగా ఉన్నారు.
పరమహంస యోగానంద జ్ఞాపకంగా 1977 లో భారత ప్రభుత్వం ఆయన పేరు మీదుగా తపాలా బిళ్ళను విడుదల చేసింది.
ఇది ఆయన 25వ వర్ధంతి సందర్భంగా మానవుల్లో ఆధ్యాత్మికతను పెంపొందించినందుకు భారత తపాలాశాఖ ఆయనకు అందించిన గౌరవం.
వారు తమ సందేశంలో ఈ విధంగా పేర్కొన్నారు.
మార్చి 7, 2017 నాడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరో స్మారక తపాలా బిళ్ళను విడుదల చేశాడు.
భారతీయ ఆధ్యాత్మిక సంపదను పాశ్చాత్య దేశాలకు పరిచయం చేయడంలో యోగానంద విశేష కృషి చేశాడనీ, న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నాడు.
ఆయన విదేశాలకు వెళ్ళినా భారతదేశంతో ఎప్పుడూ సంబంధాలు కొనసాగించాడని తన సందేశంలో పేర్కొన్నాడు.
నవంబరు 15, 2017 న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, జార్ఖండ్ గవర్నరు ద్రౌపది ముర్ము, జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్‌తో కలిసి రాంచీలోని యోగదా సత్సంగ శాఖను సందర్శించాడు.
ఈ ఆశ్రమం స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యోగానంద ఆంగ్లంలో రాసిన God Talks with Arjuna: The Bhagavad Gita అనే పుస్తకానికి హిందీ అనువాదాన్ని విడుదల చేశారు.